cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్‌కళ్యాణ్‌కి 'అధ్యక్షా' అనే ఛాన్సుందా.?

పవన్‌కళ్యాణ్‌కి 'అధ్యక్షా' అనే ఛాన్సుందా.?

సినీనటుడు పవన్‌కళ్యాణ్‌, తాను స్థాపించిన జనసేన పార్టీతో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఐదేళ్ళ క్రితమే 2014లోనే జనసేన పార్టీ పుట్టినా, 2019లో జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల్ని ఫేస్‌ చేసింది. 'మేం అధికారంలోకి రాబోతున్నాం..' అంటూ ఎన్నికల ప్రచారంలో పవన్‌కళ్యాణ్‌ అండ్‌ టీమ్‌ చేసిన 'యాగీ' అంతా ఇంతా కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంటుంది.. కానీ, 'యాగీ' అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, సరైన ఎజెండా లేకుండా, ఇతర పార్టీల విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాల్లేకుండా.. జనసేన పార్టీ రాజకీయాలు చేసింది మరి.

ఎంపిక చేసుకున్న కొన్ని నియోజకవర్గాల్లోనే జనసేనాని ఎన్నికల ప్రచారహోరు కన్పించింది. చాలా నియోజకవర్గాల్ని ఆయన పట్టించుకోలేదు. ముందస్తు ప్లానింగ్‌ పక్కాగా వేసుకుని వుంటే, ఈ ఐదేళ్ళలో రాష్ట్రమంతా పర్యటించి, పార్టీని ఎంతోకొంత బలోపేతం చేసుకునే అవకాశం ఆయనకి వుండి వుండేది. కానీ, ఎన్నికలకు సరిగ్గా ఏడెనిమిది నెలల ముందు హంగామా మొదలయ్యింది. అభ్యర్థుల ఎంపికలో కిందామీదా పడ్డారు.. చివరికి ఎలాగోలా 'మమ' అన్పించేశారు.

జనసేన అంచనాల ప్రకారం, గట్టిగా ఓ 30 నుంచి 40 సీట్లలో ఇతర రాజకీయ పార్టీలకు పోటీ ఇచ్చిందట ఆ పార్టీ. కానీ, తెలుగుదేశం పార్టీ కావొచ్చు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కావొచ్చు ఎక్కడా జనసేనను తమ ప్రత్యర్థిగా కనీసం లెక్కల్లోకి తీసుకోలేదు. కాస్తో కూస్తో టీడీపీ భయపడింది జనసేనకి.. జనసేన కారణంగా తమకు దెబ్బ తగులుతుందేమోనని. కానీ, ఏపీలో క్లియర్‌గా ప్రజల నిర్ణయం వుందనీ, వైసీపీకే అధికారమనీ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తేల్చేశాయి. జనసేనకి ఒకటి నుంచి ఐదు సీట్లు రావొచ్చని ఆ అంచనాలు పేర్కొంటున్నాయి.

ఐదు సీట్లు గనుక జనసేనకు వస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా గొప్ప విషయం. కానీ, ఆ పరిస్థితి అయితే కన్పించడంలేదు. పవన్‌కళ్యాణ్‌ రెండుచోట్ల పోటీచేశారు, ఏదో ఒకచోట నెగ్గడం ఖాయమన్న ప్రచారం ఓ పక్క జరుగుతున్నా, రెండిట్లోనూ ఓడిపోతారన్న వాదనలూ తెరపైకొస్తున్నాయి. ఇంకోపక్క, కర్నాటక మోడల్‌.. అంటూ ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ ఏర్పడితే పవన్‌ కింగ్‌ మేకర్‌ అవుతారనే ప్రచారాన్ని జనసేన తెరపైకి తెచ్చింది. అయితే, ఆ ప్రచారం తుస్సుమందిప్పుడు.

జనసేన పార్టీకి ఇప్పుడు ఒకటే టెన్షన్‌, జనసేనాని అయినా గెలుస్తాడా.? లేదా.? అని. రేపు మధ్యాహ్నానికి మేటర్‌ తేలిపోతుంది. 'మార్పు మొదలైంది..' అని పవన్‌ ఈ మధ్యనే పార్టీ నేతలతో చెప్పుకున్నారుగానీ, పవన్‌కళ్యాణ్‌ చెప్పిన మార్పుని జనం లెక్కల్లోకి తీసుకోలేదని ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తేల్చేశాయి. చూద్దాం, పవన్‌ కళ్యాణ్‌ అయినా అసెంబ్లీలో 'అధ్యక్షా' అని అంటారో, రాజకీయాలు తన వంటికి సరిపడవని తిరిగి సినిమాల వైపు చూస్తారో.!

అన్నట్టు, ముఖ్యమంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు, అసెంబ్లీలో మైక్‌ పట్టుకుని 'అధ్యక్షా' అంటున్నట్లు.. అప్పుడే జనసైనికులు మీమ్స్‌ తయారు చేసేసి ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసేస్తున్నారండోయ్‌.  

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం