cloudfront

Advertisement


Home > Politics - Political News

హతవిథీ: భుజాలు తడుముకుంటున్న పవన్!

హతవిథీ: భుజాలు తడుముకుంటున్న పవన్!

గుమ్మడికాయ దొంగ అంటే నేను కాదంటూ భుజాలు తడుముకున్నాడట వెనకటికి ఒకడు. ఈరోజు మీడియా ముందు పవన్ వ్యవహార శైలి అచ్చంగా ఇలానే ఉంది. చంద్రబాబుతో దోస్తీ గురించి అడిగితే భుజాలు తడుముకున్నారు. ఆస్తులు వెల్లడిస్తారా అంటే భుజాలు తడుముకున్నారు. ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో చెప్పమంటే భుజాలు తడుముకుంటున్నారు. ఇలా ప్రతి ప్రశ్నకు కప్పదాటు సమాధానాలే. దేనిపై స్పష్టత ఇవ్వలేదు జనసేనాని.

టీడీపీతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారనే ప్రశ్నకు ముక్తసరిగా సమాధానమిచ్చారు పవన్. "నేను ఎలా ఆలోచిస్తున్నానో ఎందుకు బయటకు చెప్పాలి. ప్రజా జీవితంలోకి వచ్చామన్నది నిజమే. కానీ అన్ని ఆలోచనలు బయటకు చెప్పంకదా. సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. మీ (మీడియా) ఆలోచన విధానాన్ని నాపై రుద్దడానికి ప్రయత్నించొద్దు."

చూశారుగా పవన్ సమాధానమిది. చంద్రబాబును మోడీ డైరక్ట్ చేస్తున్నారని అంటే ఎలా ఉంటుందో... నన్ను, చంద్రబాబు డైరక్ట్ చేస్తున్నారని అంటుంటే నాకు అలానే ఉంటుందన్నారు పవన్. ఇన్ని మాటలు చెప్పిన జనసేనాని.. టీడీపీ, జనసేనకు ఎలాంటి సంబంధం లేదనే వాక్యాన్ని నేరుగా చెప్పలేకపోయారు.

ఇక ప్రత్యేక హోదాపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారనే ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం ఇవ్వలేదు జనసేన అధ్యక్షుడు.

"నాకు చాలా స్పష్టత ఉంది. ఎలాంటి స్టాండ్ తీసుకుబోతున్నానో నాకు తెలుసు. నా అభిప్రాయాల్ని నేనెప్పుడూ దాచుకోను. సమస్యల నుంచి నేను పారిపోను. కాకపోతే ఇప్పుడు చెప్పను. 14వ తేదీన వీటిపై స్పష్టత ఇస్తాను. ఆవిర్భావ మహాసభ పెట్టాను కదా. ఇప్పుడు కాకుండా అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అయినా ట్రయిలర్ లోనే అంతా చెప్పేస్తే ఎలా.." ఇలా స్పెషల్ స్టేటప్ పై తన కార్యాచరణను కూడా బయటపెట్టలేదు.

ప్రజా జీవితంలో ఉన్న కీలకమైన నేతలంతా తమ ఆస్తుల్ని వెల్లడిస్తుంటే.. పవన్ మాత్రం దాయడానికేం లేదంటూనే మొత్తం దాచేశారు. ఆస్తులు వెల్లడిస్తారా అనే ప్రశ్నకు ఇన్ కం ట్యాక్ వాళ్లకు అన్నీ తెలుసంటూ తప్పించుకున్నారు.

"నా ఆస్తులన్నీ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు తెలుసు. కొత్తగా చెప్పుకోవడానికి, దాచుకోవడానికి ఏం లేవు. నా ఆస్తులన్నీ క్లియర్ గా ఉంటాయి. ఎవర్నీ దోచి సంపాదించిన ఆస్తులు కావు. ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఆస్తులు. నేను కష్టపడి, 2దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆస్తులివి." ఇన్ని చెప్పిన పవన్, డిక్లరేషన్ ఇస్తానని మాత్రం అనలేదు.

ఇప్పటికే ఉన్నవి కొన్ని, గతంలో పోగొట్టుకొని తిరిగి సంపాదించుకున్నవి మరికొన్ని ఆస్తులు ఉన్నాయంటున్నారు పవన్. ఇందులో భయపడ్డానికి ఏం లేదని... సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వెళ్లిపోయారు. ఇలా తన మీడియా ఇంటరాక్షన్ లో ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి జనసేన పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం, ద్వితీయ శ్రేణి నాయకులపై కూడా పవన్ స్పష్టమైన సమాధానాలివ్వలేకపోయారు. అన్నింటికీ ఆవిర్భాత సభతోనే లింక్ పెట్టారు.

పవన్ కొత్త ఇల్లు భూమి పూజ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి