cloudfront

Advertisement


Home > Politics - Political News

చేదు అనుభవం: జనంలో ఇరుక్కున్న జనసేనాని

చేదు అనుభవం: జనంలో ఇరుక్కున్న జనసేనాని

నెల్లూరు రొట్టెల పండగలో పవన్ కు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 20 నిమిషాల పాటు జనం మధ్య ప్యాక్ అయ్యారు జనసేనాని. మీద చేతులేసేవారు, మెడలో కండవా లాగేవారు, నెమలి పింఛంతో దీవిస్తున్నట్టు తలపై పదే పదే కొట్టేవాళ్లు, పోలీసులు మీడియాతో సహా సెల్ఫీ కోసం మీదమీదకి దూకేవాళ్లు... ఇలా చుట్టూ ఉన్న జనంతో పవన్ బాగా ఇబ్బందిపడ్డారు.

అభిమానులపై ఎప్పుడూ కన్నెర్రచేయని పవన్ ఈసారి ఎందుకో అసహనంతో అందర్నీ విదిలించుకున్నారు. చేయిస్తుంటే కసిరికొట్టాడు. ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది మరి. మండుటెండలో దర్గా దగ్గర పవన్ 20 నిమిషాల పాటు జనం మధ్య నిలబడిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం స్థానిక టీడీపీ నాయకులే.

పవన్ కల్యాణ్ పర్యటన టీడీపీ నాయకులకు ఇష్టంలేదు. అందుకే ముందస్తు సమాచారం ఇచ్చినా చివరివరకు ఆయన పర్యటనకు పోలీసుశాఖ అనుమతివ్వలేదు. నెల్లూరు నగరంలో దిగిన తర్వాత కూడా నాలుగైదు సార్లు దర్గాకి వచ్చే టైమింగ్ ని వాయిదా వేస్తూ వచ్చారు.

ఒకదశలో దర్గాకు వెళ్లకుండానే పర్యటన ముగించాలని పవన్ అనుకున్నారట. మొత్తానికి ఆఖరి నిమిషంలో అనుమతిచ్చారు. పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ పవన్ మందీ మార్బలం దర్గాలోకి రాకుండా పోలీసులు నిలువరించారు.

పవన్ వెంట ఎవరూ లేకపోయే సరికి ఆయన జనం మధ్య ఇరుక్కుపోయారు. రోప్ పార్టీ కూడా సరిగ్గా విధులు నిర్వహించలేదు. పవన్ వస్తున్నాడని తెలిసి మరీ పోలీసుల్ని ఆ ఏరియాలో తగ్గించారు. దీంతో సహజంగానే ఆయనపై ఒత్తిడి పెరిగింది.

జనం ఒక్కసారిగా వచ్చి మీదపడిపోయారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మాటి మాటికీ జుట్టు సరిచేసుకుంటూ పవన్ జనం మధ్యలో అలానే నిలబడాల్సి వచ్చింది. మొత్తానికి టీడీపీ నేతలు పవన్ పై తమ కోపాన్ని ఇలా తీర్చుకున్నారని అనుకోవాలి.