Advertisement


Home > Politics - Political News
బాబు, లోకేష్.. పవన్‌కూ వెన్నుపోటు..!

వెన్నంటి నిలిచిన వారిని వెన్నుపోటు పొడిచిన నేపథ్యం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. బాబు వెన్నుపోటు చరిత్ర చెప్పుకుంటే ఎంతో ఉంది. ఈ పరంపరలో.. బాబు బాధిత సంఘంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా చేరాడు. పవన్ తాజాగా పెట్టిన ట్వీట్లే అందుకు సాక్ష్యం.

గత ఎన్నికల సమయంలో తను తెలుగుదేశం పార్టీకి అండగా నిలిస్తే, ఇప్పుడు తనపై చంద్రబాబు తనయుడు తీవ్రమైన కుట్రలకు పాల్పడ్డాడు అని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఆరోపించడం ఆసక్తిదాయకంగా మారింది. ఏపీ సచివాలయంలోనే లోకేష్, కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు, లోకేష్ స్నేహితులు కలిసి తనపై కుట్ర పన్నారని, పది కోట్ల రూపాయల ఖర్చుతో తనపై బురదజల్లే ప్రాజెక్టును నడిపించారని పవన్ కల్యాణ్ పేర్కొనడం విశేషం.

నేడు జరుగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు తన మద్దతు కోరడం దగ్గర నుంచి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. దీక్షకు మద్దతు అడిగారు సరే, అయితే మిమ్మల్ని నమ్మడం ఎలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. గత ఎన్నికల ముందు మీకు నేను మద్దతునిస్తే, మీరు నాకు చేస్తున్నది ఏమిటి? టీవీ 9రవి ప్రకాష్, టీవీ 9శ్రీనిరాజు, రామ్ గోపాల్ వర్మ అనే సినీ దర్శకుడు.. వీళ్లతో పాటు నారా లోకేష్, అతడి స్నేహితుడు కిలారు రాజేష్‌లు ఆరు నెలల నుంచి తనపై కుట్ర చేసినట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.

తనపై అనునిత్యం బురదజల్లించేందుకు వీళ్లంతా కలిసి కుట్ర పన్నారని పవన్ పేర్కొన్నాడు. అందుకు ఏపీ సచివాలయమే వేదిక అయ్యిందని కూడా పవన్ వివరించాడు. కత్తి మహేశ్, శ్రీ రెడ్డి.. ఈ రచ్చ అంతటి గుట్టూ వీడినట్టే. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించాడు. లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగిందని వివరిస్తున్నాడు. కత్తి మహేశ్ రెచ్చిపోయిన తీరును చూసిన వారైనా, శ్రీ రెడ్డి అకృత్యాలను చూసిన వారైనా.. వీళ్ల వెనుక ఎవరున్నారు? అనే అంశం మొదటి నుంచి చర్చలో నిలిచింది. ఇదంతా లోకేష్ బాబు ఘనకార్యం అని పవన్ కల్యాణ్ చెబుతున్నాడిప్పుడు.