cloudfront

Advertisement


Home > Politics - Political News

రాఫెల్ రచ్చ: మోడీ భయపడుతున్నదెవరికి.!

రాఫెల్ రచ్చ: మోడీ భయపడుతున్నదెవరికి.!

'పారదర్శకత' అన్నమాటకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌నని చెప్పుకుంటుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ, పెద్దనోట్ల రద్దు విషయంలో కావొచ్చు, రాఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌ విషయంలో కావొచ్చు.. అస్సలేమాత్రం పారదర్శకత లేకుండా జాగ్రత్తపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.? ఆ నిర్ణయంతో ఎవరికి లాభం చేకూర్చాలనుకున్నారు.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.

రాజకీయాల్లో అవినీతి తగ్గలేదు.. దేశం నుంచి నల్లధనం మాయమైపోలేదు. కానీ, పెద్ద నోట్ల రద్దు పేరుతో సామాన్యుడి బతుకు బజార్న పడిపోయింది. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఆ సంగతి పక్కన పెడదాం. రాఫెల్‌ యుద్ధ విమానాల విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ప్రస్తావన ఎప్పుడు ఎక్కడ వచ్చినా.. బీజేపీ నేతలు అర్థం పర్థం లేని వాదనలతో తీవ్రమైన ఆందోళనకు గురవుతూ, ఆవేశపడిపోతున్నారు. ఒక్కో యుద్ధ విమానం ధర సుమారు 500 కోట్లుగా యూపీఏ హయాంలో 'డీల్‌' సెట్‌ అయితే, అదిప్పుడు 1600 కోట్లకు పెరిగిందన్నది కాంగ్రెస్‌ ఆరోపణ.

దీనిపై నరేంద్రమోడీ సర్కార్‌ పెదవి విప్పడంలేదు. సర్వోన్నత న్యాయస్థానం దగ్గరకి ఈ విషయం వెళితే, 'సున్నితమైన అంశం' అని చెబుతూ, సర్వోన్నత న్యాయస్థానం కూడా చేతులు దులిపేసుకుంది. కాగ్‌ రిపోర్ట్‌ అనీ, ఇంకోటనీ.. ఇప్పుడు రాఫెల్‌పై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నిజానికి, యుద్ధ విమానాల కోసం దేశం వేల కోట్లు ఖర్చు చేస్తోందంటే, అందులో ప్రతి భారతీయుడికీ వాటా వుంది. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సి వుంటుంది.

గడచిన ఏడు దశాబ్దాల్లో ఏ రక్షణ ఒప్పందం విషయంలోనూ ఇంత సీక్రెసీని ప్రదర్శించిన దాఖలాల్లేవు. ఫలానా యుద్ధ విమానం ఖరీదు ఇంత.. అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినా తెలిసిపోతున్న రోజులివి. అయినాగానీ, ఖర్చెంత.? అన్నదానిపై వివరాలు చెప్పడానికి మోడీ సర్కార్‌ ససేమిరా అంటోంది. ఏమన్నా అంటే, సర్వోన్నత న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు కమలనాథులు.

అసలక్కడ కుంభకోణం జరిగిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ, మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా అనుమానాలకు తావిస్తోంది. మోడీ సర్కార్‌ తత్తరబాటు కారణంగా, కాంగ్రెస్‌ ఆరోపణలు నిజమేనేమో అన్న భావన అందరికీ కలుగుతోంది. పరిస్థితుల్ని అంచనా వేయలేనంత అమాయకత్వం బీజేపీలో వుందని ఎలా అనుకోగలం.? ఏ తప్పూ జరగకపోతే, ఇదీ విషయం.. అని చెప్పగలిగే ధైర్యం మోడీకి వుంది.

మోడీనే భయపడుతున్నారంటే, తెరవెనుక జరగకూడనిది జరిగిందనే కదా అర్థం.! ఇంతకీ మోడీని భయపెడుతున్నదెవరికి.? దేశ ప్రజలకు చెప్పలేనంత సీక్రెట్ అందులో ఏముంది.? ఎవరు ఈ డీల్ కారణంగా లాభపడుతున్నారు.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేదెప్పుడో మరి.!

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే