cloudfront

Advertisement


Home > Politics - Political News

రేణుకా చౌదరి 'కమ్మ' గోల

రేణుకా చౌదరి 'కమ్మ' గోల

'టిక్కెట్ల పంపకం' కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెట్టింది. టిక్కెట్లు దక్కనోళ్ళు బాహాటంగానే గగ్గోలు పెడ్తున్నారు. తమవారికి టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయిన నేతలేమో కిందా మీదా పడ్తున్నారు. పైకి గట్టిగా పార్టీని విమర్శించలేక.. పరిస్థితిని జీర్ణించుకోలేక.. వారు పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ లిస్ట్‌లో రేణుకా చౌదరి పేరు అందరికన్నా ముందే వుంటుందేమో. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి టిక్కెట్ల విషయమై, తనదైన ముద్ర కోసం రేణుకా చౌదరి విశ్వ ప్రయత్నం చేసి భంగపడ్డారు.

నిజానికి, రేణుకా చౌదరి ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఉద్దేశ్యంతో లేరు. కానీ, పార్టీ టిక్కెట్లు ఇచ్చిన తీరు అస్సలేమీ బాగాలేదంటూ గుస్సా అయ్యారు. 'ఖమ్మం జిల్లా అంటేనే, కమ్మ సామాజిక వర్గానికి కేరాఫ్‌ అడ్రస్‌.. ఇలాంటి చోట, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేకపోవడం బాధ కలిగించింది..' అంటూ తనవారికి టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయిన నిస్సహాయతను ఆమె బయటపెట్టేసుకున్నారు. అలాగని, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఆమె మాట్లాడతారా.? అంటే అదీ లేదట.

'జరిగిందేదో జరిగిపోయింది.. ఇది పార్టీకి ఏమాత్రం లాభించదు. పార్టీ, కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంది. అయినా, మిత్రపక్షాల గెలుపు కోసం ప్రయత్నిస్తా..' అంటూ నిట్టూర్చేశారు రేణుకా చౌదరి. ఎంపీగా ఖమ్మం జిల్లాకు తాను చాలా చేసేశాననీ, ఎంత చేసినా.. చెప్పుకోవడానికి వీల్లేకుండా పోయిందంటూ వాపోయారమె.

రాజకీయాలన్నాక సామాజిక వర్గాల 'గోల' మామూలే. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేకుండా అన్ని రాజకీయ పార్టీలూ కులాల వారీగా ఓట్ల కోసం నానా తంటాలూ పడ్తున్నాయి. నేతలు, ప్రత్యేకంగా కుల సంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. 'ఆత్మీయ సమావేశం' పేరుతో ఆయా కులాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి, వారి కోర్కెల్ని మన్నిస్తామంటూ హామీ ఇస్తుండడం మామూలే. కానీ, కమ్మ కులానికి 'ఖమ్మం' జిల్లాలో ప్రాతినిథ్యం దక్కలేదంటూ బాహాటంగా రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేయడం ఒకింత ఆశ్చర్యకరమే.