cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్- ఎస్పీవై.. ఏమిటీ కామెడీ!

పవన్- ఎస్పీవై.. ఏమిటీ కామెడీ!

జంపర్స్.. జోకర్స్ కు తన పార్టీలో స్థానంలేదు అని ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తీరా తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న సమయానికి పవన్ కల్యాణ్ తీరే ఒక జోక్ గా మారిపోయింది. రాజకీయ ఫిరాయింపుదారులకు తన పార్టీలో స్థానంలేదని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆఖరి రోజున తన పార్టీలోకి ఫిరాయించిన వారికి కూడా భారీఎత్తున టికెట్లను కేటాయించడం విశేషం. అది కూడా ఆల్రెడీ ఫిరాయింపుదారుడిగా ముద్రపడిన ఎస్పీవై రెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు నిజంగానే కామెడీగా ఉంది.

ఎస్పీవై రెడ్డి కథేంటో తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఎస్పీవై.. తీరా ఫలితాలు వచ్చిన మరుసటిరోజే ఫిరాయించేశారు. చంద్రబాబును కలిసి పచ్చకండువాను వేయించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే.. ఏపీలో గత ఐదేళ్లలో రాజ్యమేలిన హీన రాజకీయాలను మొదలుపెట్టింది ఈ ఎస్పీవైనే.

ఐదేళ్లపాటు తెలుగుదేశం నేతగా చలామణి అయ్యి ఎస్పీవై ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. ఈయనపై అనర్హత వేటు కూడా పడలేదు. ఇక ఈ ఎన్నికల వేళ ఎస్పీవై చేసిన వ్యాఖ్యలు కూడా విశేషమైనవే. ముందుగా తనకు ఎంపీ టికెట్ కేటాయించడానికి చంద్రబాబు నాయుడు అరవై కోట్ల రూపాయల డబ్బు అడిగాడని ప్రకటించిన ఎస్పీవై మళ్లీ, తెలుగుదేశం పార్టీపై నమ్మకం ఉందంటే.. టికెట్ దక్కుతుందని చెప్పుకొచ్చారు. చివరకు అది దక్కకపోవడంతో జనసేనలోకి వెళ్లారు.

అక్కడి వరకూ ఎస్పీవై రెడ్డిది కామెడీ అయితే, ఆ తర్వాత పవన్ కామెడీ మొదలైంది. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి కుటుంబీకులకు జనసేనలో దక్కిన సీట్లు ఎన్నో తెలుసా! నాలుగు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యేగా ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యేగా ఎస్పీవై రెడ్డి పెద్దకూతురు సుజల శ్రీశైలం నుంచి, ఎస్పీవై చిన్నకూతురు అరవిందరాణి బనగానపల్లె నుంచి పోటీచేస్తూ ఉన్నారు.

తన పార్టీలో జంపర్స్ కు స్థానమే లేదని చెప్పిన పవన్ కల్యాణ్, ఫిరాయింపు రాజకీయ నేత ఎస్పీవై కుటుంబానికే ఏకంగా నాలుగు టికెట్లను కేటాయించారు. నంద్యాల ఎంపీ సీటు పరిధిలోనే ఇవన్నీ. బహుశా ఎస్పీవై రెడ్డి కుటుంబంలో ఇంకా ఎవరైనా కోరి ఉంటే.. మొత్తం నంద్యాల ఎంపీ సీటు పరిధిలో అన్ని స్థానాలనూ వాళ్లకే కేటాయించేసి.. పవన్ కల్యాణ్ తన రాజకీయ నీతిని ప్రదర్శించేవారేమో!

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!