cloudfront

Advertisement


Home > Politics - Political News

తనిఖీలకే బెదిరిపోతే ఎలా బాబూ.!

తనిఖీలకే బెదిరిపోతే ఎలా బాబూ.!

ఎయిర్‌పోర్ట్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని సిబ్బంది తనిఖీలు చేయడంతో ఉలిక్కిపడ్డారు తెలుగు తమ్ముళ్ళు. అవి సాధారణ తనిఖీలే.. గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఇలాంటి తనిఖీల్ని ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావిస్తోంటే, 'అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ ఒకటేనా.? మా చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ చాలా గొప్ప..' అంటూ తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమవుతున్నాయి.

చంద్రబాబు భక్తుడిగా పేరొందిన బుద్ధా వెంకన్న అయితే, ఈ తనిఖీల అంశం తెరపైకొచ్చాక.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందుతున్నారంటూ చాలా పెద్ద కామెడీ చేసేశారు. ప్రోటోకాల్‌ అనేది, అధికారంలో వుండడం.. వుండకపోవడం అన్న విషయాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత, ప్రతిపక్ష నేతకు ఎలా దొరుకుతుంది.? ముఖ్యమంత్రి పదవిలో వున్నా, లేకపోయినా.. తనకు అదే ప్రోటోకాల్‌ దక్కాలని చంద్రబాబు ఆశించడంలో అర్థమేలేదు. భద్రత విషయంలో కూడా కొన్ని ప్రయార్టీస్‌ వుంటాయి.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద గతంలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నమే జరిగింది. అదీ చంద్రబాబు హయాంలో. అప్పట్లో ప్రతిపక్ష నేతకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భద్రత అంత గొప్పగా వుంది మరి. 'అబ్బే, ఆ భద్రత మా పరిధిలోకి రాదు.. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వున్న ప్రాంతం..' అని టీడీపీ సర్కార్‌ అప్పట్లో చేతులు దులిపేసుకోవడాన్ని ఎలా మర్చిపోగలం.? చంద్రబాబు విషయంలోనే కాదు, టీడీపీకి సంబంధించిన చాలామంది నేతలు ఇప్పుడు ఒకప్పటి భద్రతను కోల్పోబోతున్నారు.

కొందరికి సెక్యూరిటీ కొనసాగిస్తోంటే, ఇంకొందరికి వున్న సెక్యూరిటీని తొలగిస్తున్నారు. ఇదంతా సాధారణంగా జరిగే వ్యవహారమే. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చెయ్యాలి గనుక.. అందులో టీడీపీ దిట్ట గనుక.. తెలుగు తమ్ముళ్ళు తమ పని తాము చేసుకుపోతున్నారంతే. కానీ, జనంలో తాము ఇంకా ఇంకా అభాసుపాలవుతున్నామని తెలుగు తమ్ముళ్ళు తెలుసుకోకపోవడమే హాస్యాస్పదం.  

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్