cloudfront

Advertisement


Home > Politics - Political News

వంశీ.. మరో పాతజ్ఞాపకం!

వంశీ.. మరో పాతజ్ఞాపకం!

జరిగిన సంఘటన ఏదైనా ఎంతో హృద్యంగా చెప్పగల రచయిత వంశీ. సినీ దర్శకుడిగానే కాకుండా రచయితగానూ తెలుగు వారిని ఎంతో రంజింపజేసిన వంశీ.. తన పాత జ్ఞాపకాలను, అనుభవాలను ఫేస్ బుక్ ద్వారా తనదైన రీతిలో అందంగా రాస్తూ ఉన్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన రాసిన మరో మ్యూజింగ్ ఇది. చదివాకా.. మరోసారి  వంశీకి ఫ్యాన్ అయిపోవడమే!

సిరిసిరిమువ్వ సినిమా రిలీజ్‌ అయ్యేకా ప్రొడక్షన్‌ ఆఫీసు ఖాళీ చేసేస్తున్నారు ప్రొడ్యూసర్లు. దాంతో దాని పెంట్‌హౌస్‌లో వుంటున్న మా బేచిలర్స్‌ బృందం కూడా ఖాళీచేసి బయటికొచ్చెయ్యాల్సిన పరిస్థితొచ్చింది.
మేం వుంటున్న ఆ ట్రస్ట్‌పురం ఏరియా అంతా రూమ్ కోసం కలతిరుగుతుంటే, సిరిసిరిమువ్వ ఆఫీసులో బోయ్‌గా పనిచేసిన తంబి నా దగ్గరకొచ్చి, ‘‘ఆండవార్‌ నగర్లో లీలానిలయం అని జాగ్‌తే రహో బిల్డింగ్‌ ఒకటుంది. దాంట్లో రూమ్ కావాలంటే మా బావ ఇప్పిస్తాడు,’’ అన్నాడు.

‘‘ఆండవార్‌ నగరెక్కడుంది?’’ అన్నాను.
‘‘వడపళినిలో రూమ్ థియేటర్‌ ఎదురుగా ఉన్న రోడ్లో రెండు కిలోమీటర్లెళితే వస్తుంది,’’ అన్నాడు తంబి.
‘‘నువ్వు చెప్పిన లీలా నిలయం ఆ ఆండవార్‌ నగర్లో వుందా?’’ అన్నాను.
‘‘ఔను... చాలా పోర్షన్లుంటాయి. అయిదు ఫ్లోర్ల పాత బిల్డింగది.’’
‘‘అందులో నీకు తెల్సున్నోళ్లున్నారా?’’
‘చెప్పేనుగదా, ఆ బిల్డింగ్‌ కింద హోటలు నడుపుతున్నాడు మా బావ... పోర్షన్లు చాలా ఎక్కువుండటం వల్ల ఎప్పుడూ ఏదో ఒకటి ఖాళీ అవుతానే వుంటది.’’
‘‘సరే అడిగి చూడు’’ అన్నాను
‘‘అలాగే... అయితే ఒక నెల అద్దె మా బావకివ్వాలి,’’ అన్నాడు తంబి.
‘‘ఏంటీ కమీషనా?’’ అన్నాను.
‘‘బ్రోకర్‌కయితే రెండు నెల్ల అద్దివ్వాల్సొస్తది మరి. నేనా టైపులో అడగటం లేదుగదా?’’ అన్నాడు తంబి.
‘‘ఎంతుంటది గదికి అద్దె?’’
‘‘చాలా పెద్ద పెద్ద గదులు. మీకు కావల్సిన గదికి ఏభై రూపాయలుంటది.’’
మా రూమ్మేట్స్ ముగ్గురితో మాటాడ్తే, సరే అన్నారాళ్ళు. దాంతో తంబిగాడి దగ్గరకొచ్చి, చెప్పు మీ బావకి,’’ అన్నాను.
సైకిలేసుకుని సందులూ గొందులూ దాటుకుంటా అడ్డదారిలో బయల్దేరినా తంబి,రాత్రికొచ్చేసి, ‘‘అయిదో ఫ్లోర్‌లో మూల రూవ్‌ు ఒకటి ఖాళీగా వుంది. నేన్జెప్పినట్టు నెలకి ఏభై రూపాయలే రెంట్‌. మూడు నెల్ల అద్ది అడ్వాన్స్‌. ఒక నెల ఎమౌంటు మా బావకి,’’ అన్నాడు తంబి.
మ్యూజిక్‌ డైరెక్టరవుదామనొచ్చిన ఆనంద్, కెమెరా మేన్‌ జి.కె. రాముగారి మేనల్లుడు మా ముగ్గుర్లోకీ డబ్బున్నోడు. మేవంతా ఆనంద్‌ మీద పడేటప్పటికి, ‘‘నో... మాటాడ్తే నన్ను బాదేస్తున్నారు... అనవసరంగా వచ్చేను మీ రూమ్మేటుగా,’’ అంటా అరవడం మొదలెట్టేడు.
‘‘ఇవ్వాళో రేపో ఈ ఔట్‌హౌస్‌ ఖాళీ చెయ్యకపోతే మన బట్టల బేగ్‌లూ నువ్వు ఇష్టంగా వాయించుకునే హార్మోనియం పెట్టి అన్నీ బయట పారేస్తాడా హౌసు ఓనరు అయ్యరు... ఏ పానగల్‌ పార్కులోనన్నా పడుకుందామంటే పోలీసులు పట్టేసుకుంటున్నారీ మధ్యని,’’ అన్నాను.
కాసేపాలోచించుకున్న ఆనంద్‌, ‘‘మీకు ఎం.ఓ.లొచ్చేకా నాకివ్వాల్సింది నాకిచ్చేయ్యాలి మరి,’’ అన్నాడు.
‘‘సరే,’’ అన్నాం.

ఆ లీలా నిలయం నిండా రకరకాల సీ గ్రేడు సినిమావాళ్లు. మలయాళపోళ్లు బాగా ఎక్కువ.
సినిమాల్లేని త్యాగు అనే మేకప్‌మేన్‌ ఇక్కడే ఉంటున్నాడు.ఒకనాటి అందగత్తయిన మలయాళం కేరెక్టర్ ఆర్టిస్టుంటుంది. ఇద్దరు ముగ్గురు లేడీ ఆర్టిస్టులున్నారు. కె.వి. మహాదేవన్‌గారి ఆర్కెస్ట్రాలో సితార్‌ వాయించే ఖాన్ గారి లేడీ ఒకావిడ సెకెండ్‌ ఫ్లోర్లో వుంటుంది. హైదరాబాదు నించి కొత్తగా దిగిన స్వరూప గ్రౌండ్‌ ఫ్లోర్లో కాపురం పెట్టింది. ఇలా ఒకళ్లుగాదు చెప్పకుంటా పోతే బోల్డుమంది జనాలు.
దిగిన రెండో రోజు సాయంత్రం ఎవరోతెలుగులో పాడ్డం విని, కిటికీలోంచి చూస్తే కింద పిట్టగోడ దగ్గర నిలబడి "అన్నది నీవేనా.... నాస్వామీ" అంటా మనసే మందిరం సినిమాలో పాట పాడ్తుందో అమ్మాయి.ఎంత అద్భుతమైన పాట!పాడ్తున్న ఆ మనిషెవరో గానీ ఎంత బాగుందా గొంతు!!

ఆ లీలా నిలయం ఎదురుగుండా వున్న ఆ కిళ్లీకొట్టు ఆంటీ పేరు కనిమొళి. కొంచెం సావిత్రి గారి పోలికల్తో పుష్టిగా వుండే ఆ మనిషి వాళ్ళ తమిళే గాకుండా మలయాళం,తెలుగు కూడా మాటాడ్తుంది.
ఎంత సీరియస్ సీరియస్ విషయమైనా చిన్న కామెడీ టచ్ తో మొదలెడతా, ఏ దాపరికం లేకుండా మొఖం మీదే మాటాడి తేల్చేస్తుంది.
ఆ లీలానిలయంలో అమ్మాయిలకి ఏవడ్డీ లేకుండా అప్పులిచ్చే ఆ కనిమొళి,వాళ్ళతో బిజినెస్ చేస్తుందనే టాక్ ఒకటుంది.

వచ్చిన రెండో రోజు నించే అందంగా వుండే మా రూమ్మేటు శేఖర్ కి మాంచి క్లోజయి పోయింది.ఆ వేళ మధ్యాన్నం ఆవిడ కొట్టు దగ్గర కెళ్ళిన నాతో‘‘హీరో ముత్తురామన్ లాగుండే మీ శేఖరంటే నాకు రొంబ ఇష్టమప్పా ...నిన్నరాత్రి ఐ లవ్ యూ చెప్పి కిస్ అడిగితి .ఇవ్వకుండా నవ్వుతా పూడుస్తుడప్పా. ’’అంది.
ఆ తర్వాత రెండు మూడు సార్లు కలిసేకా బాగా క్లోజయి పోయినా కనిమొళి ఆంటీని పాడే ఆ అమ్మాయి గురించడిగితే ’’ మీ తెలుగు అమ్మాయే మీనా కుమారి పేరు.సినిమాల్లో పాడ్డానికి ట్రై చేస్తుంది....అదోరకం మనిషప్పా....ఎవరితోనూ మాటాడదు. ’’అంది.

’’ఎవళ్ళనైనా సరే చిటికెలో పడగొట్టేసేలాగున్నావు గదాంటీ... నీతో కూడా మాటాడదా? ’’ అన్నాను.
’’లైన్లో పెడదామని చాలా తూర్లు ట్రై చేస్తినప్పా ..దాంతో ఈ సైడే రావటం మానేసి నాదప్పా’’అంటా ఆ కనిమొళి ఆంటీ అంటుంటే ఆ మీనాకుమారి మీద ఇంట్రస్ట్ మరింత పెరిగిన నేను ’’మరైతే ఎవరితో మాటాడ్తుందీ...ఏ దారిలో వెళ్తుందీ...ఇంట్లో సరుకులూ అయ్యీ ఎక్కడి కెళ్ళి తెచ్చు కుంటుందీ? ’’అన్నాను.
’’అదే తెలవదప్పా చీకటి పడ్డాకా ఎట్టేట్నో తిరిగేసి ఏంటేంటో తీసుకునొస్తది....మరి ఎక్కడి కెళద్దో నాకేమీ అర్ధం కాదప్పా ’’అంది.
’’ఆ మనిషి కసలు ఫ్రెండ్సే లేరా ఆంటీ? ’’
’’చాలా డిటెక్షన్ చేసినాను.....లేరప్పా’’అందాంటీ.

ఎన్ కన్మణీ ఉన్కాదలీ ఇళమాంగనీ,
ఉనెపాత్తదుం సిరికిన్రదే సిరికిన్రదే
ఆ వేళ సాయంత్రం ఆ మీనాకుమారి పాడ్తున్న ఈ పాట వినిపించింది కిందనించి.
ఇదేదో కొత్తరకం పాట.ఒక పదం మీద ఇంకో పదం ఎక్కేస్తా భళే గమ్మత్తుగా వున్న పాడ్డానికి కష్టమైన ఆ పాట ఆవేళంతా పాడతానే ఉందా మీనాకుమారి.
తర్వాత ఆరా తీస్తే తెలిసింది.కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా చిట్టుక్కురివి అనే సినిమాలో చేసిన పాటంటది.ఆ సినిమా పాడీబజార్లో వున్న రాజకుమారి దియేటర్లో ఆడ్తుందని తెల్సింది. ,ఎప్పుడూ జేబునిండా డబ్బులుండే ఆనంద్ గాడికా పాట గురించి చెప్పి గిల్లితే తీసుకెళ్ళేడు.
ఎస్పీబీ,సుశీల పాడిన ఆ సినిమాలో పాట కంటే ,మీనా కుమారి పాడిందే చాలా బాగుందని పించింది.
ఆవేళ పొద్దుట ఏదో పనున్నట్టు యాక్ట్ చేస్తా ఆ మీనా వాళ్ల పోర్షన్‌ వేపెళ్లేను. కింద, రంగు వెలిసిన ఎర్ర లంగా, మోచేతుల దాకా మడతపెట్టిన కాకీ షర్టు. మనిషి కారు నలుపు. వాళ్లమ్మ శనగపప్పు చేటలో వేసిస్తే మెట్ల మీద ఎండబెడతా ఎన్ కన్ మణీ సాంగే హమ్ చేస్తుం ది.

మధ్యాహ్నమెప్పుడో ఫియట్‌ టాక్సీలో దిగిన సితార్‌ వాయించే మెహబూబ్‌ ఖాన్‌ ఆ సాయంత్రం ఆ సెకండ్‌ ఫ్లోర్‌ పోర్షన్లోంచి బయటికొచ్చి, ఆగున్న టాక్సీ ఎక్కెళ్లిపోతున్నాడు.
పొద్దుట ఫుల్‌ మేకప్పుల్లో సినిమా కంపెనీలకెళ్లిన ఆ ముగ్గురు లేడీ ఆర్టిస్టులూ నలిగిపోయిన బట్టల్తో, చెరిగిపోయిన మేకప్పుల్తో నీరసంగా నడుచుకుంటా వస్తున్నారు.
హైదరాబాదు స్వరూప కోసం కారేసుకొచ్చినా పెద్దమనిషి హారన్‌ కొడ్తున్నాడు.
తంబిగాడి బావ కాఫీ హోటలు ముందు నిలబడ్డ నలుగురు జనాలు టీలు తాగుతుంటే అప్పుడే మూకిట్లోంచి దేవిన మసాలావడల్ని సొట్టలు పడ్డ సిల్వర్‌ పళ్ళెంలో వేస్తుంది తంబిగాడి సిస్టరు.
మా రూమ్మేట్‌ శేఖర్‌ ,ఆ కనిమొళి ఆంటీ కొట్టు ముందు నిలబడి స్టైల్ గా సిగరెట్టు కాలుస్తున్నాడు.
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నేను విచిత్ర జీవితం సినిమా ఆఫీసు నించి అప్పుడే వచ్చి అయిదు ఫ్లోర్ల మెట్లెక్కేటప్పటికి ఆయాసంతో రూవ్‌ులోకొచ్చి వెల్లకిలా పడిపోయేనో లేదో.......
అఆలు నేర్పనా
అసమాన సుందరీ
అవతార పురుషుడా
నా లేత చంద్రుడా
కింద నించి పాడ్తుందా నల్లటి మీనాకుమారి.
ఈ పాట ఇంతకు ముందెప్పుడూ వినలేదే!..ఏ సినిమా లోదీ?... ఎవరు రాసేరు...?ఎవరు పాడేరు?’’
సాహిత్యంలో డివిజన్‌ చూస్తుంటే డ్యూయెట్లాగుంది. అసలు రికార్డయ్యిందా ఈ పాట? అంటా డిస్కషన్ మొదలెట్టేడు మా ఆనంద్.

మా బడ్జెట్టు బాగా పెరిగి పోడంతో మా రూమ్ లోకి కొత్తగా ఇంకో ఇద్దర్ని చేర్చుకోవాల్సొచ్చింది.ఇప్పుడు ఆరుగురం మొత్తం.
ఒకటే సందడి. అప్పుడప్పుడూ గొడవలు. గొడవలకీ సండికీ, ఒరిస్సా చౌదరి గాడొక్కడే కారణం.
వెస్ట్‌ గోదావరి తణుకు దగ్గర కోనాల అనే ఊరుంది. రచయిత్రి కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవిగారి అక్కయ్యగారి ఊరది. ఆ వూరి నించి ఒరిస్సా వలస వెళ్లిన కొన్ని చౌదరీస్‌ కుటుంబాలు చవగ్గా అక్కడి పొలాలు కొనుక్కుని గొప్పగా వ్యవసాయం చేసి పండిస్తా అక్కడే సెటిలైపోయాయి.
వాళ్లలో ఒక కుటుంబంలో మనిషైన ఈ చౌదరి సినిమాపిచ్చితో హౌరా మద్రాస్‌ మెయిలెక్కొచ్చి , మా రూమ్మేటయ్యి నైస్ గా మా ప్రాణాలు తీస్తున్నాడు.
ఈ చౌదరి కారణంగా ఆవేళ రాత్రి పెద్ద ఎత్తున గొడవ. ఓపక్కనించి గొడవ జరుగుతుంటే కోడిగుడ్ల పులుసు కాస్తున్న నేను దాకలో చింతపండు రసం ఎక్కువ పిండేసేటప్పటికి ఎంత మరిగినా దగ్గరపడ్డం లేదు పులుసు. ఈలోగా స్టౌలో కిర్సనాయిలయిపోయింది. 
మొత్తానికి గొడవ సద్దుమణిగింది. ఆ నీళ్ల పులుసేసుకునే తినేసి పడుక్కున్నామో లేదో కింద నించి పాట.
కిటికీ తలుపు తెరిచి చూస్తే తాకితే పొడి రాలేంత చిక్కటి చీకటి.
ఆ చీకట్లో, చీకటి రంగు మీనాకుమారి పాట.
సంబంధం లేదుగానీ వింటుంటే, మదన్ మోహన్ మ్యూజిక్ లో ‘ ఓ కౌన్దీ‘ సినిమా పాట గుర్తుకొస్తుంది.
‘‘కిందింటి అమ్మాయి శృతిలో పాడ్తుంది,,,,శృతి దేవుడిచ్చిన వరం’’ అంటున్నాడు నిద్దట్లో వున్న మా కాబోయే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆనంద్ గాడు.

సితార వాయించే ఖాన్‌ మధ్యాహ్నం పూటొచ్చి సాయంత్రం దాకా ఉండెళ్తుంటే, ఎప్పుడూ ఆ లోపలున్న మనిషి బయటికి కనిపించదా మనిషి.
కనీసం వెళ్లేటప్పుడు అతన్ని సాగనంపడానికి గుమ్మందాకా కూడా రాదు.
అసలు మేవక్కడున్న రోజుల్లో ఏనాడూ మాకు కనిపించెరగదు.
ఇదే ముక్క హోటలు నడుపుతున్న తంబి వాళ్ల బావతో అంటే, ‘‘మీక్కాదు ఇన్నేళ్లనించి ఈ బిల్డింగ్‌ కింద హోటలు నడుపుతున్న మాకే కనపడలేదు,’’ అన్నాడా బావ.
ఆవేళ మధ్యాహ్నం బ్రిస్టల్‌ సిగరెట్ల కోసం వెళ్తే అంతసేపూ ఆంటీతో మాటాడ్తున్న ఆ మలయాళం అమ్మాయి నన్ను చూసేక గబగబా వెళ్ళిపోతుంది.
ఆ పిల్లనే చూస్తా నా వేపు తిరిగిన కనిమొళి ఆంటీ ‘‘ అమ్మాయి బావుందా?’’అంది.
’’నేను చూళ్ళేదు.’’అన్నాను.
’’పిలవనా?....చూస్తావా?....బాగుంటది.’’అందాంటీ.
’’ఒద్దొద్దు’’అన్నాను.
’’డబ్బుల్లేక చాలా ఇదవుతుంది.వందరూపాయిలు కావాలంట.ఇయ్యి.నువ్వెలా చెపితే అలా గింటది.’’అందాంటీ.
’’వద్దు’’అన్నాను.
’’అది కాదు’’అంటున్న ఆ కనిమొళి ఆంటీ మాట ఏమాత్రం వినకుండా ,నాక్కావల్సిన సిగరెట్లు తీసుకోకుండా మారూమ్ లోకొచ్చేసేను.

హార్మోనియం ముందు కూర్చుని ’’మేరేనైనా సావన్ బాదో’’పాట వాయిస్తున్న ఆనంద్’’శివరంజని రాగంలో చేసేరీ పాట.నిజానికి ఈ రాగం హిందూస్థానీలో లేదు.ఇది మన కర్ణాటిక్ రాగం....’’అని పాడ్తుంటే చాలా బాగా పాడ్తున్నావ్’’అన్నాడు ఒరిస్సా చౌదరి.
’’శ్రుతిలో ఎవరు పాడినా బానే వుంటుంది......శ్రుతి అంటే గుర్తు కొస్తుంది.మొన్నా కిందింటి మీనాకుమారి శృతిలో ఎంత చక్కగా పాడిందీ!’’ అంటుంటే మళ్లీ ఆ పాటంతా గుర్తుకొచ్చిన నేను దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ఆ ట్యూన్లో ఏదో వేదనుంది. దానికి మించి ఆ మీనాకుమారి గొంతులో విపరీతమైన బాధుంది. కానీ, అది అబద్ధ సాహిత్యవేమో అనిపిస్తుంది. అడుగుదామంటే ఆ మనిషి కన్నెత్తి చూడదు. పన్నెత్తి పలకరించదు. ఎలాగ?
ఆ తర్వాత చాలామంది మ్యూజీషియన్స్ కి ఆ లిరిక్ పాడి వినిపిస్తే ఎవరూ చెప్పలేకపోయేరు గాని, ట్యూన్ చాలా బాగుంది అన్నారు. కొందరైతే రాగం వసంత హిందోళం అన్నారు.
నాకే గనక డైరెక్షన్ ఛాన్సొస్తే ఆ కారు నలుపమ్మాయితో ఒక్క పాటయినా పాడించాలి అని చాలా సార్లను కున్నాను.

కొన్నాళ్ళయ్యేక ఈ లీలానిలయం ఖాళీ చేసి ఒత్తవాడై స్ట్రీట్ కి మారేను.అక్కడ చందమామ లాంటి పిల్లల పత్రికలకి బొమ్మలేసే ఆర్టిస్టు శ్రీకర్,ఫిల్మ్ఇన్స్టూట్ స్టూడెంట్ రాజారెడ్డీ,అతని పాత రూమ్మేట్ సుధాకర్ [బిషా] ఈ జనంతో ఇదోరకం సందడి.

ఆ తర్వాత నెంబర్ 17,పులియూర్ సెకెండ్ మెయిన్ రోడ్ కి మారిన కొన్నాళ్ళకి ’’మంచుపల్లకీ’’ సినిమా డైరెక్షన్ చాన్సొచ్చింది నాకు.పాటలు శ్రీ శ్రీ,గోపీ,మేఘమా దేహమా అన్నపాట వేటూరి రాస్తున్నారు.ఈపాట మీనాకుమారితో పాడిస్తే...?అనుకున్నాను.ఈ ఐడియా నాకొచ్చినందుకు నన్ను నేనే అభినందించుకుని అర్జంటుగా ఆటో ఎక్కి బయల్దేరేను.

చాలా ట్రాఫిక్కుందా వేళ.నేనెక్కిన ఆటో కొడంబాక్కం పవర్‌ స్టేషన్‌ దాటుతుంటే విజయచిత్ర ఆఫీస్‌నించి పచ్చరంగు ఫియట్‌ కారు నడుపుకుంటా వస్తున్న రావి కొండలరావుగారు కనిపించేరు. లాంబ్రెట్టా వేసుకునెళ్లిపోతున్న విలన్ వేషాలేసే ఆనంద్‌మోహన్‌ {తర్వాత నా కనకమాలక్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్ లో వేన్ డ్రైవర్ వేషమేసేడీయన} కనిపించేడు. ఆటో రూమ్ థియేటర్‌ ఎదురుగా ఉన్న వీధి మలుపు తిరుగుతుంటే అప్పుడే ఆగిన వడపళని సిటీబస్‌లోంచి సి.హెచ్‌. కృష్ణమూర్తిగారు దిగేడు. {ఈయన కూడా నేను తీసిన ఆలాపనలో ఏవడిగినా’’ నాకు పెద్దగా తెల్దు ’’అనే సింగిల్ డైలాగు సినిమా అంతా చెప్పే వేషమేసేరు} నా ఆటో కుమరన్‌ స్ట్రీట్‌లో వెళ్తుంటే స్టంట్‌ మేస్టర్‌ జూడో రత్నంగారింటి ముందు బోల్డుమంది ఫైటర్లు, పెద్దగా నవ్వుతున్న రత్నంగారబ్బాయి రాము.
అలా ముందుకి చాలా ముందుకెళ్లిన ఆటో ఆండవార్‌ నగర్లో ఆ లీలా నిలయం ముందాగింది.
ఆ మీనాకుమారి వాళ్ల పోర్షన్‌లో ఇంకెవరో ఉన్నారు. ఏవడిగినా మాకేం తెలీదంటున్నారు.
కనుమొళి ఆంటీ దగ్గర కెళ్ళడిగితే ఆర్నెల్ల క్రితం ఇంటద్దె కట్టలేని పరిస్థితిలో వున్న మీనాకుమారి వాళ్ళు రాత్రికి రాత్రి ఖాళీచేసి ఎక్కడికో పారిపోయేరని చెప్పింది.

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్