cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఓట్లు.. సీట్లు.. నోట్లు.. పొలిటికల్‌ స్టంట్లు.!

ఓట్లు.. సీట్లు.. నోట్లు.. పొలిటికల్‌ స్టంట్లు.!

ప్రజాస్వామ్యం అంటే మాటలా.? ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారమా.? కానే కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో పనిలేని రాజకీయంగా ఎప్పుడో మారిపోయింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎన్నికలు జరుగుతున్నాయి, జరుగుతూనే వున్నాయి. జనం తీర్పు ఇస్తున్నారు. ఆ తీర్పుని రాజకీయ పార్టీలు లెక్క చేయడం ఎప్పుడో మానేశాయి. అయినా తప్పదు, ప్రజాస్వామ్యం అన్నాక.. ఎన్నికలనేవి ఓ ప్రసహనం. ఆ ప్రసహనాన్ని ప్రజాస్వామ్యం భరించాల్సిందే.

ప్రతిసారీ ఇదే తంతు.. మళ్ళీ మళ్ళీ ఇదే తంతు. ఓటర్లను రాజకీయ పార్టీలు, నాయకులు ప్రలోభ పెట్టడం.. అయినా సరే, ప్రజాస్వామ్యం మీద గౌరవంతో జనం ఓట్లు వేయడం.. తీరా ఓట్లేశాక, గెలిచిన ప్రజా ప్రతినిథిని ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా అధికారంలో వున్న పార్టీలు కొనుగోలు చేసేయడం. ఇలాగైతే, ఇక ఎన్నికలెందుకు.? సగటు ప్రజానీకం మెదళ్ళను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి, మన తెలుగు రాష్ట్రం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీని వీడి, టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిపదవి దక్కించుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడాలి కదా.! కానీ, స్పీకర్‌ అనర్హత వేటు వెయ్యరు. ఎందుకంటే, ఆయన 'విచక్షణ' అలా వుంది మరి. ఆయన తన విచక్షణాధికారాల్ని వినియోగించుకుని.. ప్రజాతీర్పుకి పాతరేసేశారు.

తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ ఫిరాయింపులు ఇలాగే జరిగాయి. ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా వర్ధిల్లుతోంటే, ప్రజలు మాత్రం ఏం చేయగలరు.? ఏమో, రాజకీయ వ్యవస్థలో ఎప్పటికైనా మార్పు రాకుండా వుంటుందా.? అన్న ఆలోచనతో, కాళ్ళు కదలకపోయినా.. ముసలీ ముతకా ఓట్లేయడానికొస్తున్నారు. అదే ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనమంటే. ఎలాగైనా, అధికారంలో వున్న టీఆర్‌ఎస్‌ని మట్టికరిపించాలని కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఎం జట్టుకట్టాయి.

చిత్రమేంటంటే, ఈ కూటమిని నడిపిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ, టిక్కెట్లను అడ్డగోలుగా అమ్మేసుకుంటోందని ఆరోపణలు రావడం. కాంగ్రెస్‌ జాతీయ స్థాయి నేత కుమారుడొకరు, ఏకంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్‌ని 3 కోట్లకు బేరం పెట్టాడట. ఇది ఉత్త రాజకీయ ఆరోపణ మాత్రమేననీ, టిక్కెట్‌ రాని వ్యక్తి అక్కసుతో చేసిన ఆరోపణ అనీ కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే, టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని రాజకీయ పార్టీలు మొదలు పెడ్తున్నాయి మరి.

అధికార టీఆర్‌ఎస్‌లో 'టిక్కెట్ల అమ్మకం' ఆరోపణలు తారాస్థాయికి చేరిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? నిజానికి, ఎన్నికలంటే.. అధికార పార్టీ తరఫున టిక్కెట్లకు వుండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. అసెంబ్లీ టిక్కెట్‌ పది కోట్లపైన గతంలో.. అంటే, 2014 ఎన్నికల సమయంలోనే పలికేసింది. అప్పట్లో ఎంపీ టిక్కెట్‌ 15 నుంచి 25 కోట్ల దాకా పలికిందనే ప్రచారం జరిగింది. ఆ దిశగా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. టిక్కెట్లు దక్కించుకోలేని నేతలు, ఆరోపణలు చేయడమే కాదు, అందుకు తగ్గ ఆధారాలూ తెరపైకి తెచ్చారు.

కోట్లు ఖర్చుచేసి టిక్కెట్‌ కొన్నాక, గెలవాలి కదా.! ఆ గెలవడం కోసం మళ్ళీ ఖర్చు చేయడం తప్పనిసరి. ఇప్పటికే పెద్దయెత్తున నగదు తెలంగాణలో పట్టుబడ్తోంది. దొరికింది పది రూపాయలే అయితే, తనిఖీల్లో దొరక్కుండా చేరాల్సిన చోటకి చేరుతున్న సొమ్ము వేల రూపాయల లెక్క. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. ఎన్నో ఏళ్ళుగా.. ఆ మాటకొస్తే, గడచిన రెండు మూడు దశాబ్దాలుగా అత్యంత సర్వసాధారణమైపోయిన వ్యవహారం.

గత ఎన్నికలకీ ఈ ఎన్నికలకీ ఓటు కోసం నాయకులు వెదజల్లే నోటు పెద్దదిగా మారుతోందంతే. బహుశా ఇలాంటి అవసరాల కోసమేనేమో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌, పాత వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి కొత్తగా 2 వేల రూపాయల నోటుని తీసుకొచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఒకటి కాదు, రెండేసి 2 వేల రూపాయల నోట్లను 'ఆశిస్తున్నారట' కొందరు ఓటర్లు. 'వాడు పంచేది మన సొమ్మే కదా.. తీసుకుంటే తప్పేంటి.?' అంటూ బాహాటంగానే రాజకీయ నాయకులు ఇచ్చే సొమ్ము మీద వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల్లో కుల రాజకీయాలు చేయకూడదు, మత రాజకీయాలు చేయకూడదు, డబ్బు పంచకూడదు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు. ఇవన్నీ ఎన్నికల నియమావళిలో వుంటాయి. కానీ, అన్నీ జరుగుతాయి. కుల పెద్దలతో, మత పెద్దలతో 'ఆత్మీయ సమ్మేళనాలు' ఎన్నికల సమయంలోనే జరుగుతుంటాయేంటో చిత్రంగా. 'నువ్వు నాలుగు తిడితే, నేను నలభై నాలుగు తిడతా' అంటూ రాజకీయ నాయకులు రెచ్చిపోయేదీ ఎక్కువగా ఎన్నికల సమయంలోనే.

డబ్బు గురించి కొత్తగా చెప్పేదేముంది.? రోజురోజుకీ ఎన్నికలంటే రాజకీయ నాయకులకీ కష్టంగా మారిపోతోంది. ఓడినోడు కౌంటింగ్‌ సెంటర్‌ దగ్గర ఏడిస్తే, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడవాల్సిన పరిస్థితి.

మొత్తమ్మీద, ప్రజాస్వామ్యం వెలిగిపోయేలా చేయడంలో రాజకీయ పార్టీలు పడ్తున్న శ్రమ అంతా ఇంతా కాదన్నమాట. ముందే చెప్పుకున్నాం కదా, ఈ ప్రజాస్వామ్యానికి అర్థం వేరు. అవును మరి, ప్రజాస్వామ్యానికి అర్థం మార్చేశారు. ఇది డబ్బుతో, కులమతాలతో, అన్ని రకాల ప్రలోభాలతో రాజకీయంగా వెలిగిపోతున్న ప్రజాస్వామ్యం.

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్