cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వార్‌ వన్‌ సైడే.. నా?!

వార్‌ వన్‌ సైడే.. నా?!

అత్యంత వాడీ వేడిగా సాగిన ఎన్నికల్లో ప్రధానమైన సంగ్రామం ముగిసింది. అమీతుమీ తేల్చుకోవడానికి తలపడిన రాజకీయ పార్టీలు తమ పని పూర్తిచేశాయి. ప్రజలు కూడా ఓటు అనే తమ తీర్పును ఇచ్చేశారు. అయితే వారి తీర్పు సీల్డ్‌ కవర్లలో ఉన్నట్టే. ఇప్పుడప్పుడే అది బయటకు రాదు. ఈసారి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్నడూ లేనంత స్థాయి నిరీక్షణను అనుభవించాల్సి వస్తోంది. పోలింగ్‌ తేదీ నుంచి ఫలితం తేదీకి విరామం నలభై మూడురోజులు! ఇది అల్లాటప్పా సమయం అయితే కాదు. ఏం జరిగిందో తెలీదు. ఎవరు గెలుస్తారో అంతుబట్టడం లేదు.. ఇలా వారం పదిరోజులు ఉండటమే ఎక్కువ. అయితే ఈసారి ఉత్కంఠత నెలన్నర పాటు నెలకొని ఉంటుంది.

నోటిఫికేషన్లో బాగంగా నామినేషన్ల తతంగం దగ్గరై పోవడంతో హుటాహుటిన అభ్యర్థులను ప్రకటించేశారు. వారిచేత నామినేషన్లు వేయించి ఎన్నికల ప్రచారానికి రోడ్డున పడ్డారు.  ప్రచార సమయం కూడా పెద్దగా ఏమీలేదు. ప్రధాన పార్టీల అధినేతలు కూడా చాలా నియోజకవర్గాలకు వెళ్లనేలేదు. చంద్రబాబు రోజుకు నాలుగైదు నియోజకవర్గాలను కవర్‌ చేశారు. జగన్‌ మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున తిరిగారు. అలా పక్షంరోజుల పాటు గట్టిగా ప్రచారం చేశారు. దీంతో వారు సరిగ్గా యాభై అరవై నియోజకవర్గాలను కూడా కవర్‌ చేయలేదు.

-ఆసక్తిని రేపుతున్న పోలింగ్‌
-మిస్టరీగా మారిన ఫలితం
-ఎవరి లెక్కలు వారివి!
-ఫలితం కోసం నిరీక్షణలో ప్రజానీకం

ఏపీ ప్రజలకు ఎన్నడూ ఇలాంటి అనుభం లేదు!
గత కొన్ని పర్యాయాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే.. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను ఒకేసారి ఫేస్‌ చేసే ఏపీకి ఏనాడూ పోలింగ్‌కు, ఫలితానికి మధ్యన ఇంత విరామంలేదు. రెండువేల తొమ్మిది, రెండు వేల పద్నాలు ఎన్నికల ప్రక్రియలను గమనించినా.. ఈ విషయం స్పష్టం అవుతుంది. ఏపీలో పోలింగ్‌ చివరాఖరి దశల్లో జరుగుతూ ఉండేది. ఆ తర్వాత వారం పదిరోజుల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలన్నీ విడుదలఅయిపోయేవి. దీంతో పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే భావన ఉండేది. అయితే ఈసారి మాత్రం ఏపీ ఎన్నికల పోలింగ్‌ అనూహ్యంగా తొలి విడతలోనే జరిగిపోయింది.

ఎవ్వరూ ఊహించలేదు!
పోలింగ్‌ తొలి విడతలోనే జరగడం ఒక వింతగా నిలిచింది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తొలిదశ పోలింగ్‌లోనే ఏపీ, తెలంగాణలలో ఓటింగ్‌ పూర్తి అవుతుందని ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు రాజకీయ నేతలుఅయితే అవాక్కయ్యారు కూడా. ఏపీలో పోలింగ్‌ ఏ ఆఖరి విడతలోనే ఉంటుందని అనుకుంటే.. తొలి దశలోనే అది జరగడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికి ఇంకా ఏపీలో రాజకీయ పార్టీ కనీసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయితీలు సాగుతూ ఉండేవి. నేతలు అటూ ఇటూ.. మారుతూ ఉన్న దశలో ఎన్నికల షెడ్యూల్‌ రావడం, టక్కున పోలింగ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ అయిపోవడం జరిగింది. దీంతో అన్నీ సర్దుకోవడానికి నేతలకు సమయం తక్కువగా కనిపించింది.

అయితే అప్పటికే ఏపీలో ఎన్నికల వేడి పతాకస్థాయికి వెళ్లి ఉండటం.. నియోజకవర్గాల స్థాయిలో నేతలు ప్రచారాన్ని హోరెత్తించి ఉండటంతో ప్రత్యేకంగా అధినేతల ప్రచార పర్వం సాగకపోయినా.. నేతలు పోరాడారు. అయితే ప్రస్తుత ఏపీ రాజకీయంలో అధినేతల ప్రచారం అత్యంత కీలకం అనే సంగతి చెప్పనక్కర్లేదు. అక్కడకూ పోలింగ్‌ తేదీ ముందుగా ముంచుకురావడం కుట్ర అని చంద్రబాబు నాయుడు వాపోయారు కూడా, తమపై మోడీ కుట్ర చేశారని.. అందుకు ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు వచ్చాయని బాబు అన్నారు. అయితే ఆ మాట మరీ ఎక్కువగా వాడితే తను ఎన్నికలంటే భయపడుతున్నట్టుగా జనాల్లోకి వెళ్తుందనే భావనతో చంద్రబాబు నాయుడు ఆ వాదన పక్కనపెట్టి ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయారు.

ముందస్తు పోలింగ్‌ ఫలితాన్నే మార్చేసేలా?
ఏపీలో తొలి విడతలోనే పోలింగ్‌ జరగడం ఫలితాలను కూడా బాగా ప్రభావితం చేసింది అనేది ఒక వాదన. ప్రత్యేకించి చంద్రబాబుకు అది మైనస్‌ పాయింట్‌ అని కొంతమంది వాదించారు. దానికి కారణం ఏమిటంటే.. బాబు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ అమల్లో పెట్టడానికి తగినంత సమయం లేదనేది వారి వాదన. బాబు ఆఖరి నిమిషంలో పరిస్థితులను పూర్తిగా మార్చేస్తారని, గతంలో అలాగే జరిగిందని.. ఈసారి కూడా అలాగే జరిగేదని అయితే తొలి దశలోనే పోలింగ్‌ రావడంతో బాబుకు అంత సమయం లేకపోయిందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఆఖరి విడతలో పోలింగ్‌ ఉండి ఉంటే బాబుకు బోలెడంత సమయం ఉండేదని.. అయితే తొలి దశలోనే ఎన్నికలు రావడంతో బాబు తన మేనేజ్మెంట్‌ స్కిల్స్‌ను అమల్లో పెట్టేంత సమయం లేకపోయిందని అంటున్నారు. అయితే ఈ వాదన లాజిక్‌ లెస్‌. బాబు మీద భారీ అంచనాలు ఉన్నవారే ఈ వాదన వినిపిస్తున్నారు.

క్యాండిడేట్ల పరిస్థితి ఏమిటి?
అప్పటికే జనాల్లోకి వెళ్లిన వారికి ఏ ఇబ్బంది లేకుండా పోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వాళ్లు ఎన్నికలకు చాలా ముందు నుంచినే ఏదో ఒక ప్రోగ్రామ్‌తో జనాల్లో ఉంటూ వచ్చారు. పీకే టీమ్‌ ద్వారా ఒత్తిళ్లు తీసుకు వస్తూ వారిని నిత్యం జనాల్లో ఉండేలా చూసుకున్నారు జగన్‌. మామూలుగా అయితే అభ్యర్థులు అంతగా జనాల్లోకి వెళ్లేవారు కాదేమో., ఖర్చులకు, కష్టానికి వెనుకడుగు వేసే వాళ్లేమో. అయితే వాళ్లకు ఎప్పటికప్పుడు పీకే టీమ్‌ ప్రొగ్రెస్‌ రిపోర్టులు జారీచేస్తూ వచ్చింది. దీంతో నేతలు కదలక తప్పలేదు.

ఇక ఎటొచ్చీ ఆఖరి నిమిషంలో ఫిరాయించిన నేతల సంగతే తెలియాల్సి ఉంది. అటువాళ్లు ఇటు, ఇటువాళ్లు అటు వెళ్లారు.. కొందరు ఫిరాయింపు నేతలు మళ్లీ తిరిగి వైఎస్సార్సీపీలోకి చేరిపోయారు. అలాంటి వారెవరికీ టికెట్‌ అయితే దక్కలేదు. కర్నూలుజిల్లా పాణ్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌరు చరితారెడ్డి ఎన్నికల  ప్రచారంలో భాగంగా 'జై జగన్‌' అని నినదించిందంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో జంపింగ్‌కు పాల్పడిన వారి పరిస్థితి అలా ఉంది!

ఇంతకీ పోలింగ్‌ చెబుతున్న పరమార్థం ఏమిటి?
నెలరోజుల వ్యవధిలో మొత్తం కథ అయిపోయింది. అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి పోలింగ్‌ వరకూ కేవలం ఒక్కనెల వ్యవధిలోనే అంతా అయిపోయింది. అలా జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్‌ పర్సెంటేజ్‌ బ్రహ్మాండమైన స్థాయిలో నమోదైంది. నేతలు నెలల తరబడి ప్రచారం చేయకపోయినా ఏకంగా ఎనభైశాతం పోలింగ్‌ నమోదు అయ్యిందంటే అది చిన్న విషయం కాదు. మరి భారీగా నమోదైన పోలింగ్‌ ఎవరిని గెలిపిస్తుంది? ఎవరిని ఓడిస్తుంది? అనే అంశం గురించి థియరీల గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోగలం. ఎగ్జిట్‌పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ ప్రస్తుతానికి నిషేధం. ఆఖరి విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసేంత వరకూ కూడా ఏపీ విషయంలో కూడా అలాంటి పోల్స్‌ను ఎవ్వరూ అధికారికంగా ప్రకటిచడానికి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎనభైశాతం చేరిన పోలింగ్‌ ఎవరికి పట్టం కడుతుందనేది మరింత మిస్టరీగా మారుతూ ఉంది.

భారీ పోలింగ్‌ నమోదు కావడం అనేది సాధారణంగా అధికారంలో ఉండిన వారికి నెగిటివ్‌ పాయింట్‌ అని చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలను గద్దెదించాలని అనుకున్నప్పుడే ఓటర్‌ అలా కదులుతాడనేది జనరల్‌ థియరీ. అది చాలావరకూ నిజంకాదు. ఏవో కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే మిగతా సందర్భాలన్నింటిలోనూ భారీ స్థాయిలో నమోదు అయిన పోలింగ్‌ అధికార పార్టీలను గద్దెదించింది. ఏపీ విషయానికి వస్తే ఈ స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడం వెనుక రెండు కారణాలు కనిపించవచ్చు. ఒకటి తీవ్రంగా ఉందన్న ప్రభుత్వ వ్యతిరేకత. రెండు త్రిముఖపోరు. మూడు పార్టీలు రంగంలోకి దిగి జనాలను పోలింగ్‌ బూత్‌లకు కదిలించాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమవంతుగా ఎంతోకొంత ఓట్ల శాతాన్ని పొంది ఉంటాయి. దీంతో అంతా గట్టిగా ప్రయత్నించి ఓట్లశాతం పెంచేందుకు కృషి చేశారని చెప్పవచ్చు.

ఓటు ఎవరికి పడ్డట్టు?
-భారీగా నమోదైన పోలింగ్‌ శాతంలో ఎవరి పాజిటివ్‌ పాయింట్లను వారు తీసుకొంటూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే ఈ స్థాయిలో పోలింగ్‌ పర్సెంటేజ్‌ నమోదు అయ్యేలా చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు అంటున్నారు.

-తాము ఈ ఎన్నికల్లో ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీని సాధిస్తామని జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలింగ్‌ పర్సెంటేజీని కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పారాయన.

-తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ అనుకూల వాదనలను తాము వినిపిస్తూ ఉన్నారు. పోలింగ్‌ పర్సెంటేజీలో ఆడవాళ్లు, వద్ధుల వాటా గణనీయంగా ఉందని.. వారి ఓట్లు తమకే అని టీడీపీ క్లైమ్‌ చేసుకొంటూ ఉంది.

-డ్వాక్రాలో ఉన్న ఆడవాళ్లకు పసుపు-కుంకుమ డబ్బులు అందాయని, పెంచిన పెన్షన్‌ మొత్తం వద్ధుల ఓట్లనుతమకే వేయించిందని టీడీపీవారు అంటున్నారు.

-ఒకవైపు పోలింగ్‌ సాగుతుండగానే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ ప్రచారాన్ని ముమ్మరంగా సాగించింది. తద్వారా పోలింగ్‌ను ప్రభావితం చేసే టెక్నిక్స్‌ను ప్రదర్శించారు.

-ఇలా ఎవరి లాజిక్కులతో వాళ్లదే హవా అంటూ ఉన్నారు. జనసేన కూడా తమ అంచనాలను భారీగానే పెట్టుకుంది.

గమనించదగిన అంశాలు ఏమిటంటే!
-ప్రస్తుతానికి చెప్పదగిన ప్రముఖమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఎన్నికల పోలింగ్‌ ముగిసింది అనేమాటే కానీ రాజకీయం విషయంలో పోలింగ్‌కు ముందు, పోలింగ్‌కు తర్వాత ఒకే పరిస్థితి ఉంది. అంటే గెలుపు ఎవరిది అనే అంశంలో పరిస్థితి అంతా గుంభనంగా ఉంది.

-ఈసారి పోల్‌ మేనేజ్‌ మెంట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తనసత్తాను చూపించింది. నియోజకవర్గాలకు దూరంగా ఉండిన ఓటర్లను రప్పించి ఓటు వేయించడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాగా పని చేసుకుంది.

-పోల్‌ మేనేజ్‌మెంట్లో తెలుగుదేశం పార్టీకి ధీటుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనిచేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

-గత ఎన్నికల్లాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ఈసారి అతి విశ్వాసానికి పోకుండా.. అప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటూ పని చేసుకున్నారు.

-జగన్‌ దగ్గర నుంచి అభ్యర్థుల వరకూ చాలానే కష్టపడ్డారు. వంద ఓట్లు తీసుకురాగలరు అనే నేతలందరికీ తనే దగ్గరుండి పార్టీ కండువా వేశారు జగన్‌ మోహన్‌ రెడ్డి.

-అదే ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. వాళ్లకూ నియోజకవర్గాల స్థాయిల్లో పరిణామాలు కలిసివచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం తీరుతో విసిగిపోయిన అనేకమంది ఆయా నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను కలిసి ఆ పార్టీలోకి చేరిన వైనాలు కనిపించాయి. పోలింగ్‌ ముందువరకూ అదో హోరులా సాగింది.

-ఇక తెలుగుదేశంతో అన్ని రకాలుగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీపడింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఆఫ్‌ ద రికార్డు విషయాలను ఇక్కడ ప్రస్తావించలేకపోవచ్చు కానీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన వారికి ఆ విషయం అర్థం అయ్యింది.

-ఇక తెలుగుదేశం పార్టీకి కూడా కొన్ని సానుకూల అంశాలున్నాయి. ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఆఖరి నిమిషంలో ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పడేలా చూసుకోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఊరట.

-డ్వాక్రా మహిళలకు డబ్బులు ఆఖరి నిమిషంలో అందాయి. అది ఎవరూ కాదనలేని అంశం. అయితే అదంతా ఒకరకమైన గేమ్‌. కానీ ఏదేమైనప్పటికీ.. ఆఖరి నిమిషంలో డబ్బులు తమ తమ ఖాతాల్లోకి పడటంతో ఎంతోకొంత తెలుగుదేశం పార్టీకి మేలే జరిగి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. టీడీపీ ఆశకూడా ఇప్పుడు దాని మీదే ఉంది.

-ఇక మోడీ వేసిన పెట్టుబడి సాయానికి కలిపి రైతులకు కూడా టీడీపీ ప్రభుత్వం డబ్బులు జమచేసింది. అది కూడా ఆఖరి నిమిషంలో జరిగినదే, పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు అందుకు సంబంధించి ఒక్కో రైతుకు మూడు నాలుగు వేల రూపాయలను అకౌంట్లోకి జమచేశారు. ఐదు ఎకరాల లోపు భూములున్న రైతులకు ఆ డబ్బులు పడ్డాయి.

-ఇక రుణమాపీ నిధులు కూడా జమ చేసినట్టుగా ప్రకటించారు కానీ, ఆ డబ్బులు అయితే పోలింగ్‌కు ముందు రైతుల చేతికి అందలేదు. నాలుగో విడత రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్టుగా పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్నారు. అయితే బ్యాంకులకు వెళ్లిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఊరించి మరోసారి ఊసురుమనిపించాడు చంద్రబాబు నాయుడు అనే కామెంట్‌ రుణమాఫీ విషయంలో మరోసారి వినిపిచిందలా.

-ఇక జగన్‌ ఇచ్చిన హామీలన్నింటికీ కాస్త కొసరును యాడ్‌ చేసి చంద్రబాబు నాయుడు ప్రకటించుకొంటూ వచ్చారు. ఆఖరికి జగన్‌ కొన్నాళ్లుగా ప్రకటిస్తూ వచ్చిన 'అమ్మ ఒడి' హామీని కూడా బాబు కాపీకొట్టారు. అలా కాపీ కొట్టడం ఓటర్లను ప్రభావితం చేయడం మాట అటుంచితే.. బాబుకు సొంతంగా ఏమీ ఆలోచించడం రాదు అనే అభిప్రాయం మాత్రం జనాల్లోకి బాగా వెళ్లింది. అది తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ను కొంతవరకూ తగ్గించిన అంశం.

-ఇక మీడియా ద్వారా కూడా ఇరువర్గాలూ పోటీలు పడ్డాయి. ఆడియో, వీడియో ఫైళ్లు విడుదల చేసుకుని బురద జల్లుకున్నాయి.

-ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ దూకుడుగా వెళ్లి డిఫెన్స్‌లో పడింది. విజయసాయి రెడ్డి ఆడియో టేప్‌ అని మొదట హడావుడి చేశారు. తర్వాత ఆ ఆడియోను డిలీట్‌ చేసుకుని కామ్‌ అయ్యారు. ఇక లక్ష్మీపార్వతి విషయంలో వేసిన చీప్‌ట్రిక్‌ బాగా ఎదురుతన్నింది. తెలుగుదేశం వాళ్లే చివరకు ఆ విషయంలో కామ్‌ అయిపోయారు.

-నటుడు శివాజీతో తెలుగుదేశం పార్టీ వాళ్లు తమవంతు ప్రయత్నం చేయించారు, పోసానిని రంగంలోకి దించి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎదురుదెబ్బ గట్టిగానే కొట్టింది తెలుగుదేశానికి.

స్థూలంగా ఇదీ పోలింగ్‌ ముందు వరకూ జరిగిన రాజకీయం. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలు. అయితే ఇవేమీకావు, ఎన్నికలకు చాలా ముందుగానే జనాలు ఒక అభిప్రామానికి వచ్చేసి ఉంటారు... ఆఖరి నిమిషం రాజకీయాల ప్రభావం పెద్దగా ఉండదు అనే థియరీ కూడా ఒకటి ఉంది!

ఇక పోలింగ్‌ లెక్కలను పరిశీలించిన వారు, అంతకు ముందు పరిణామాలను విశ్లేషించిన వారు.. వార్‌ వన్‌ సైడే అని, ఈ వార్‌ విన్నర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే అంటున్నారు. మరి వార్‌ వన్‌ సైడేనా కాదా.. అనే అంశంలో సస్పెన్స్‌కు తెరపడేందుకు మరికాస్త సమయం పడుతుంది!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!

 


×