cloudfront

Advertisement


Home > Politics - Political News

తెలంగాణ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందా..?

తెలంగాణ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందా..?

అధికారాన్ని అడ్డంపెట్టుకుని పాలకులు ఎంతకైనా తెగిస్తారనేది వాస్తవం. తెలంగాణ ఎన్నికల్లో కూడా అధికార పక్షం ఇలా అక్రమాలకు పాల్పడిందని, ఓటమి భయంతో క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటింగ్ కి కొన్నిగంటలు మాత్రమే సమయం ఉండగా కాంగ్రెస్ విమర్శల దాడిపెంచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ బయలుదేరారు నేతలు.

నకిలీ ఓట్లను తొలగించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న 20 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అర్హుల ఓటు హక్కు తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా తప్పైపోయింది క్షమించాలని కోరాడని అన్నారు.

అర్హుల ఓట్లన్నీ తొలగించిన అధికారులు, ఒక్కొకరికి రెండు ఓట్లను ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో రెండు ఓట్లు ఉన్నాయంటూ సాక్ష్యాలను బైటపెట్టారు. దీనిపై అధికారులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ పూర్తిచేశాకే ఓట్ల లెక్కింపు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సిబ్బందికి, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అందలేదని, దాదాపు 15వేలమంది ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని వివరించారు.

అధికార పక్షం కావాలనే పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఆరోపణలు ఎలా ఉన్నా.. ఓట్ల గల్లంతు మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విషయమే. లిస్ట్ లో ఉన్న ఓట్లు, బూత్ కి వెళ్లేసరికి మాయం అయిపోతే ఓటు వేయడానికి వెళ్లిన వారికి ఎలా ఉంటుంది.

ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో చాలామందికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలు వీచే ప్రాంతాల్లోనే  ఓట్ల గల్లంతు ఎక్కువ కావడం గమనించాల్సిన విషయం. అయితే ఫలితాలు  విడుదలయ్యే వేళ ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతాయనేది మాత్రం వాస్తవం.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?