cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆ నలుగురికీ టికెట్లు.. జగన్ కు హ్యాట్సాఫ్!

ఆ నలుగురికీ టికెట్లు.. జగన్ కు హ్యాట్సాఫ్!

ఎంపీలు అంటే.. వాళ్లు వేలకోట్ల రూపాయలకు అధిపతులు అయ్యుండాలి, పారిశ్రామికే వేత్తలు అయ్యుండాలి. లాబీయిస్టుల్లాంటి వాళ్లు అయ్యుండాలి... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయమే సాగుతూ ఉంది. ఈ సంప్రదాయాన్ని ఎవరు మొదలుపెట్టారనేది బహిరంగ రహస్యమే. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గలేని వ్యాపార వేత్తలను రాజ్యసభకు నామినేట్ చేస్తూ.. ఒకరకంగా రాజకీయాన్ని వ్యాపారమయంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని అంటారు పరిశీలకులు. 

తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం లేనప్పుడు కూడా సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి వాళ్లను చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పంపించారు రాజ్యసభ సభ్యులుగా. వారిలో సుజనా చౌదరి భారీఎత్తున బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వార్తల్లోకి వచ్చారు. అంతేకాదు.. ఢిల్లీ లెవల్లో ఏపీ ఎంపీలు చాలామంది వ్యాపారవేత్తలు.. అనే అంశాన్ని నేషనల్ మీడియా కూడా హెలెట్ చేస్తూ వచ్చింది.

ఇలాంటి నేపథ్యంలో... ఈదఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకొచ్చిన ఎంపీల జాబితా ఆశ్చర్యకరంగా ఉంది. ఏమాత్రం ఆర్థికశక్తి లేనివాళ్లు, ఇంకా చెప్పాలంటే తాము ఒకదశలో కడుపు నిండా భోజనం దొరక్క ఇబ్బందిపడ్డామని ఇప్పుడు కూడా చెబుతున్న వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబితాలో ఉండటం గమనార్హం. ఆర్థికశక్తిని మరింతగా పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినవారు కాదు, తమ వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం ఎంపీలుగా వెలగాలని అనుకుంటున్న వారు కాదు. అత్యంత సామాన్యులు వారు.

అరకు ఎంపీ సీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గొడ్డేటి మాధవి, అనంతపురం బరిలో ఉన్న తలారి రంగయ్య, బాపట్ల బరిలో నిలుస్తున్న నందిగామ సురేష్, హిందూపురం బరిలో ఉన్న గోరంట్ల మాధవ్.. ఈ పేర్లు వినడానికే వింతగా అనిపిస్తున్నాయి కొంతమందికి! ఎందుకంటే.. వీళ్లెవరూ వ్యాపారవేత్తలు కాదు, ఆర్థిక శక్తిమంతులు కాదు. చాలా సామాన్యులు.

తలారి రంగయ్య మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయిలో పనిచేశారు. పీడీ అనే పేరును ఇంటిపేరుగా చేసుకున్నారు. ఈయన ఢీకొడుతోంది మరెవరినో కాదు.. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేపీ పవన్ ను! జేసీ కుటుంబం లాంటి రాజకీయ మదగజాన్ని తలారి రంగయ్య అనే సామాన్య బోయ కుటుంబీకుడు ఢీకొట్టబోతూ ఉన్నారు. 

ఇక అరకు నుంచి గత ఎన్నికల్లో గీతను గెలిపించుకుంటే ఆమె ఏం చేసి వెళ్లిందో తెలిసిన సంగతే. అందుకే ఈసారి అతి సామాన్యురాలు అయిన గొడ్డేటి మాధవికి జగన్ టికెట్ కేటాయించారు. ఈమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా.. అది కోట్లకు పడగలెత్తిన రాజకీయం కాదు. ఒక సామాన్య గిరిజన రాజకీయ కుటుంబం. అలాంటి సామాన్యురాలికి జగన్ కేటాయించడం నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిన విషయమే.

బాపట్ల నుంచి పోటీలో ఉన్న నందిగామ సురేష్ పరిస్థితి కూడా ఇంతే. తమది ఆర్థికంగా అత్యంత దుర్భర స్థాయిలో ఉండిన కుటుంబం అని సురేష్ ఓపెన్ గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. తను సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఉండి చదువున్న వాడినని, పురుగుల భోజనం తిరిగి పెరిగిన వాడిని అని ఆయన తన నేపథ్యం గురించి వివరించిన సామాన్య ఎస్సీ అభ్యర్థి సురేష్. 

ఇక గోరంట్ల మాధవ్ రాయలసీమలో రాజకీయంగా నిరాదరణకు గురి అయిన వెనుకబడిన కురుబ కులానికి చెందిన వ్యక్తి. పోలీసు ఉద్యోగమే అయినా.. ఇతడు ఏదో సంపాదించేయడానికి ఏ ఎస్పీ క్యాడర్ అధికారి కూడా కాదు. సీఐ స్థాయి ఉద్యోగి మాత్రమే.

వీరు మాత్రమే కాదు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జాబితాలో మరి కొందరు సామాన్యులు ఉన్నారు. వారిలో కూడా..ఈ నలుగురూ మాత్రం అత్యంత సామాన్యులు. వెనుకబడిన కులాల నుంచి వచ్చి ఉన్న కొద్ది పాటి గుర్తింపుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను సంపాదించుకున్నారు. ఇలాంటి వారి గెలుపు ప్రతి ఒక్కరూ ఆకాంక్షించదగిన అంశం. ఇలాంటి సామాన్యులు రాజకీయ శక్తిగా ఎదిగడమే.. ప్రజాస్వామ్య గొప్పదనం అవుతుంది. ఇలాంటి వారితో అమ్ముడుపోయే రాజకీయాలు కూడా ఉండవు సుమా!

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు