Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : చర్చించాలా? తిప్పి పంపాలా?

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరింది. కొందరు ఔనన్నా, మరి కొందరు కాదన్నా ప్రవేశపెట్టబడింది అన్నారు. ఇప్పుడు దాన్ని చర్చించాలా? వద్దా అని సమైక్యవాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. చర్చించడానికి ఒప్పుకుంటే విభజనకు అంగీకరించినట్టే కాబట్టి, ఆ వచ్చినదాన్ని అలాగే చుట్టచుట్టి వెనక్కి పంపేయాలి అని వీరసమైక్యవాదుల వాదన. బిల్లులో చాలా లోపాలున్నాయని, వాటిని అంగీకరిస్తే సీమాంధ్రకు శాశ్వతమైన హాని జరుగుతుందని వారి భయం. అది జరగకుండా చేయాలంటే అసలు దాని కేసి చూడనుకూడా చూడకూడదని జనాలకు చెపుతున్నారు.

రాష్ట్రపతి యిచ్చిన అవకాశం

సంకల్పమాత్రం చేత తెలంగాణ బిల్లు పరుగులు పెట్టి సోనియా పుట్టినరోజు నాడు తెలంగాణ ఆవిర్భావ ప్రకటన జరుగుతుందని కొన్నాళ్లు, పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే బిల్లు పాస్‌ అయిపోయి, జనవరి 1 వేడుకలను కొత్త రాష్ట్రంలోనే జరుపుకోవచ్చని మరి కొన్నాళ్లు, ఆంగ్ల సంవత్సరాది ఎందుకు తెలుగు సంక్రాంతి తెలంగాణలోనే జరుపుకుందాం అని యింకొన్నాళ్లు - యిలా అనేకమంది టి-నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. అల్లాటప్పా వాళ్లే కాదు, తెలంగాణ విధాతగా తనను తాను చెప్పుకుంటున్న జయపాల్‌రెడ్డిలాటి సోనియా సన్నిహితులు కూడా యివి చెప్పారు. అలా ఎలా జరుగుతుంది, రాష్ట్రపతి చూడాలి, బిల్లు అసెంబ్లీకి పంపాలి, అసెంబ్లీలో ఓటింగు కాకపోయినా తీర్మానం జరగాలి, అది చూసుకుని పార్లమెంటులో సవరణలపై చర్చ జరగాలి, మార్పులు చేర్పులు చేశాక ఆపై బిల్లు పాసవాలి.. యింత తతంగానికి నాలుగైదు వారాలైనా పట్టదా అని సందేహమనస్కులు అడిగితే, 'రాష్ట్రపతి మూడు రోజుల గడువు మించి యివ్వరు. అసెంబ్లీ అభిప్రాయానికి ఎటూ విలువ లేదు కాబట్టి, జస్ట్‌ ఫార్మాలిటీ కోసం పంపించి బిల్లు చేత అసెంబ్లీ గడప ముట్టించి వెనక్కి పట్టుకుని వచ్చేస్తారు.' అంటూ చెప్తూ వచ్చారు. 'మేధావి చిదంబర మహాశయుల ఆధ్వర్యంలో తయారైన బిల్లు కాబట్టి రాష్ట్రపతి కూడా ఎలాటి సంశయాలు పెట్టుకోకుండా బిల్లు వీధి గుమ్మం నుండి రాగానే పెరటిగుమ్మం నుండి హైదరాబాదు పంపించేస్తారు. సొంతంగా చదివి కుడీఎడమా పరామర్శించే పని పెట్టుకోరు. ఎవర్నీ న్యాయపరమైన సలహాకోసం అడగరు. అందువలన రాష్ట్రపతి భవన్‌లో బిల్లు వుండేది కొన్ని గంటలు మాత్రమే...' అని ధైర్యం చెప్పారు.

చివరకు ఏం జరిగింది? రాష్ట్రపతి కక్షుణ్ణంగా చదివారు, న్యాయకోవిదులను సంప్రదించారు. ప్రతీ క్లాజుపై అసెంబ్లీలో శాసనసభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. దాని వలన బిల్లు మొత్తాన్ని అంగీకరించవలసిన, లేక తిరస్కరించవలసిన అగత్యం లేకుండా చేశారు. ప్రతి స్టెప్‌లో 'ఇంతవరకు మాకు సమ్మతం, యిది మాత్రం కాదు' అని చెప్పవచ్చు. ప్రతీ అంశం అమలు చేయడంలో గల కష్టాలను చెప్పవచ్చు. దాదాపు 280 మంది సభ్యులున్నారు. ఒక్కో అంశంపై వారికి ఒక్కో అభిప్రాయం వుండవచ్చు. వీరందరూ వాటిని వెలిబుచ్చి, యితరులతో వాదించి, చర్చించి, తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు వీలుగా మొత్తం ప్రక్రియకు ఆరువారాలు టైము యిచ్చారు. స్టేట్స్‌మన్‌ అనే వర్ణనకు తగినట్టు ప్రణబ్‌ వ్యవహరించారు. దీనికి 6 వారాల సమయం పడుతుందని అని లెక్క వేసి మరీ యిచ్చారు. ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని విభజన ప్రక్రియ ఎంత కష్టమో, ఎంత క్లిష్టమో తెలియపరచవలసిన బాధ్యత సమైక్యవాదులది.

చర్చ అక్కరలేదన్న తెలంగాణవాదులు

'దీనికోసం 6 వారాల చర్చ ఎందుకు? ఇంతదూరం వచ్చాక యింకా వాదోపవాదాలు దేనికి? వీరిలో సిపిఎం తప్ప తక్కిన పార్టీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు విభజనకు ఒప్పుకున్నవే. వారికి సమస్యపై పూర్తి అవగాహన వుంది కాబట్టి అంతకాలం సాగదీయవలసిన పని లేదు. అయినా ఆరువారాల లోపు పంపమన్నారు కానీ ఆరువారాలూ చర్చించి తీరాలని చెప్పలేదు. విభజనకు ఓకే అనడానికి ఒక్క రోజు చాలు. పోనీ మా ప్రాంతానికి ఐఐటి కావాలి, ఐఐఎమ్‌ కావాలి అని చెప్పుకోవాలంటే కొన్ని గంటలు చాలు. ఓ రోజు కావాలంటే అర్ధరాత్రి దాకా కూర్చుందాం. బిల్లుపై చర్చ ముగించేసి వెనక్కి పంపేద్దాం.' అని హరీశ్‌రావు వంటి నేతలు వాదించారు. ఆయన కంటె ఆతృత సోనియాది. తెలంగాణ బిల్లును ఆగమేఘాలమీద పంపించామని చెప్పుకోవడానికో ఏమో ప్రత్యేక విమానంలో హైదరాబాదుకి పంపించారు. మర్నాడు పొద్దున్న కల్లా అది అసెంబ్లీకి వచ్చేయాలని, ఓకే స్టాంపు కొట్టి వెనక్కి పంపేయాలని టి-వాదులు మహా ఉబలాటపడ్డారు. ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి పంపించడంలో జరిగిన ఆలస్యానికి చీఫ్‌ సెక్రటరీపై సభాహక్కుల తీర్మానం పెట్టేయడానికి రెడీ అయ్యారు. అసలు యిది సభాహక్కుల భంగంగా ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాదు. చివరకు అది సభ వాయిదా పడ్డాకనే ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. ఘోరం జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టారు. అది గడిచి ఎన్ని రోజులైంది. ఆ తర్వాత మాత్రం బిల్లు కథ ముందుకు సాగిందా? ఆ ఒక్కరోజు గురించి అంత హంగామా దేనికి? తెలంగాణ గురించి ఏదో చేస్తున్నాం అని తెలంగాణ ప్రజలకు చెప్పుకోవాలన్న తాపత్రయంతోనేగా?

నిజానికి ఒక్క రోజులో చర్చ పూర్తవుతుందా? బిల్లు ముసాయిదా కాపీ రాగానే కెసియార్‌ తమ అభిప్రాయం ఏమిటో చెప్పగలిగారా? లేదే! నిపుణుల బృందానికి అప్పగించి, వారు అధ్యయనం చేసి దానిలోని సాంకేతిక విషయాల గురించి వివరించిన తర్వాత నాలుగు రోజులకు ఫలానా క్లాజ్‌ మాకు ఒప్పందం కాదు, ఫలానాది ఫర్వాలేదు.. అంటూ చెప్పగలిగారు. నిపుణులు కాబట్టి విషయాన్ని అంత త్వరగా అర్థం చేసుకోగలిగారు. అదీ బృందంగా ఏర్పడి... ! మరి శాసనసభ్యులు!? వారికి ఏ సాంకేతిక విద్య వచ్చి వుండకపోవచ్చు. నిరక్షరాస్యులను కూడా ప్రజాప్రతినిథులుగా ఎన్నుకునే వెసులుబాటు మన రాజ్యాంగం కల్పించింది. వారి మాతృభాషలో బిల్లు చదువుకుని యిలాటి విషయాలలో వారికి నమ్మకమున్న నిపుణుల చేత ఆ వివరాలన్నీ చెప్పించుకుని, దానిపై సొంత అభిప్రాయం ఏర్పరచుకుని మాట్లాడాలి. కెసియార్‌ అయితే మేధావి. రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వారు. స్వయంగా చాలా విషయాలపై పట్టున్నవారు. ఆయన అర్థం చేసుకున్నంత త్వరగా యితరులు చేసుకుంటారనుకోవడం అవివేకం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఓ చోట కృష్ణ బదులు గోదావరి రాస్తే ఆ తప్పు ఎత్తి చూపించి, ఈ తప్పులతడక నివేదికపై మాట్లాడడమే వేస్టు అని తీసిపారేశారు తెరాస వారు. మరి యిప్పుడు యీ బిల్లులో ఓ చోట 'తెలంగాణ'కు బదులు 'తమిళనాడు' అని రాశారు. (బిల్లు తయారీలో తమిళుల పాత్ర ఎక్కువ కావటం వలనే యిలా జరిగి వుంటుంది. చిదంబరం మహాశయుడు, నారాయణస్వామి యిద్దరూ తమిళులే. జయరాం రమేష్‌ కర్ణాటక రాష్ట్రీయుడైనా అయ్యంగారే, భార్య అయ్యర్‌! తక్కినవాళ్లు నలుగురున్నా వాళ్లెవరూ సరిగ్గా మీటింగులకు రాలేదనీ, యీ అరవ్వాళ్లే ఓవరాక్షన్‌ చేశారనీ అందరం గమనించాం. అందుకే తమిళనాడు పదం పడడంలో ఆశ్చర్యం లేదు) కానీ ఆ పేరు చెప్పి బిల్లు పక్కన పడేద్దాం అనటం లేదు తెరాస.  

బిల్లు విలక్షణత 

ప్రతి బిల్లు గురించి, శాసనసభ్యులందరూ యింత లోతుగా అధ్యయనం చేస్తున్నారా? అని అడగవద్దు. ఏం చేయకపోయినా నడిచిపోతోంది. కానీ యీ బిల్లు అలాటిది కాదు. ఈ బిల్లు లాటిది దేశంలో ముందెన్నడూ తయారవ్వలేదు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గపు ప్రజలు దీనిపై సెన్సిటైజ్‌ అయ్యారు. 'విడిపోతున్నపుడు మనకు దక్కినదేమిటి? మన హక్కుల కోసం నువ్వు చేసినదేమిటి?' అని తమ ఎమ్మెల్యేలను నిలదీయబోతున్నారు. అందువలన తప్పకుండా విస్తృతమైన చర్చ జరగాల్సిందే. దానికి టైము పట్టి తీరుతుంది. ఒక్కరోజులో ఎస్‌ ఆర్‌ నో అనడానికి వీల్లేదు. ఇది సీమాంధ్ర ప్రాంతపు ఎమ్మేల్యేలకే కాదు, తెలంగాణ ప్రాంత ఎమ్మేల్యేలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు ఆంధ్రలో మిగిలే విద్యుత్‌ తెలంగాణకే అమ్మాలి, తెలంగాణవాళ్లు అక్కరలేదు అంటేనే వేరేవాళ్లకు అమ్మాలి అనే క్లాజ్‌ వుంది. అదీ ఏకంగా పాతికేళ్లపాటు! ఉమ్మడి రాజధాని పదేళ్లే కానీ యిది మాత్రం పాతికేళ్లుట! తెలంగాణ ప్రభుత్వం ఎంత రేటు ఆఫర్‌ చేసినా, లేక బకాయి పడినా వాళ్లకే అమ్మాలా? దాన్ని సీమాంధ్ర ప్రభుత్వం ఖాతరు చేస్తుందన్న నమ్మకం ఏముంది? చంద్రబాబు యిప్పడికే రంకెలు వేస్తున్నారు. రేపు సీమాంధ్రలో ఆయన ప్రభుత్వం వస్తే మేం దీన్ని రద్దు చేసుకుంటాం అంటే? భవిష్యత్తులో ఏదైనా రాష్ట్రం సీమాంధ్రకు వచ్చి 'మీ రాష్ట్రంలో తీరప్రాంతంలో పెట్టుబడులు పెడతాం, కానీ మీ మిగులు విద్యుత్‌ మాకు అమ్మండి' అంటే, ఆంధ్ర ప్రభుత్వం అమ్మలేదు కదా! ఆ మేరకు దానికి నష్టమే కదా! తెలంగాణలో రాబోయే ప్రభుత్వం ఎలా వుంటుందో? విద్యుత్‌ ఉత్పాదనకై పెట్టుబడులు పెట్టి స్వయంసమృద్ధి సాధించుకుని యీ ఒప్పందాన్ని వదులుకుంటుందన్న గ్యారంటీ ఏమిటి? తన నిధులను ప్రజాకర్షక పథకాలపై , ఉద్యోగులకు జీతాల పెంపుపై, ప్రతీ యింటికీ ఉద్యోగంపై, ప్రతి పౌరుడికి పక్కా యిల్లుపై ఖర్చు పెట్టేస్తే..?

బిల్లులో అనేక అంశాల్లో 'ఫలానా సంస్థ/పరిశ్రమ/జోన్‌ అక్కడ పెట్టడానికి పరిశీలన జరుగుతుంది' అన్నదే మాటిమాటికీ కనబడుతోంది. బజెట్‌లో శాంక్షన్‌ అయిన రైల్వే లైన్లే అమలు కావటం లేదు. పరిశీలిస్తాం అంటే ఎలా కుదురుతుంది? పరిశీలిస్తున్నాం అని ఓ కమిటీ వేశారనుకోండి, వాళ్లు 'ఇక్కడ అనువుగా లేదు, పరిశ్రమ పెడితే పక్కనున్న చెట్టుమీద పిట్టలకు శబ్దకాలుష్యం పెరిగిపోతుంది, వాటికి పునరావాసం కల్పించాలి. 20 ఏళ్లల్లో ఓ అరణ్యాన్ని తయారుచేసి, పిట్టలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఆలోచిద్దాం' అని నివేదిక యిచ్చారనుకోండి. ఈ పిట్టలగోలతో ఆ హామీ అక్కడికి బుట్టదాఖలు. ఈ ప్రాజెక్టుకు యిన్ని నిధులు కేటాయించాం అని ఎక్కడా లేదు. 'పోలవరం కట్టడం మా బాధ్యత' అంటారు. తెలంగాణ పట్ల నిర్ణయం కూడా మా బాధ్యతే అన్నారు, అది ఎంత లక్షణంగా నిర్వహించారో చూశాం. నాలుగేళ్లగా నానబెట్టి, బెట్టి చివర్లో పరుగులు పెట్టించి, జులై 30 ప్రకటన తర్వాత మూణ్నెళ్లు నిద్రపోయి, విభజన వంటి తీవ్రమైన అంశాన్ని టేబుల్‌ ఐటంగా ప్రవేశపెట్టి, అందరిలో అనుమానాలు రేకెత్తించి, ఓ పక్క విమానంలో పంపి, మరో పక్క తన పార్టీ ఎమ్మేల్యేలనే అదుపులో పెట్టకుండా విచ్చలవిడిగా మాట్లాడనిచ్చి... యిదీ వీరు బాధ్యత నిర్వర్తించే విధానం! 

ఉమ్మడి రాజధాని

ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని అంటే కేంద్రపాలితమే అవుతోంది. కానీ హైదరాబాదును ఉమ్మడి రాజధాని అంటున్నారు, కానీ యూటీ కాదంటున్నారు. అదెలా సాధ్యం? రాజ్యాంగంలోనే లేని యిలాటి ఉమ్మడి రాజధాని ప్రయోగం ఎలా వుండబోతోంది? దానిపై స్పష్టత లేదు. రాష్ట్రపరిధిలోకి వచ్చే శాంతిభద్రతలు వంటి అంశంపై గవర్నరుకే సర్వాధికారాలు అంటున్నారు, దాన్ని రాష్ట్రప్రభుత్వమే గవర్నరుకు ధారాదత్తం చేయాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలుదొల్త చేయవలసిన పని ఏమిట్రా అంటే 'శాంతిభద్రతలు కాపాడడం మాకు చేతకాదు. మా పాలనలో సీమాంధ్రులు ప్రాణ, మాన, విత్తములకు భంగం కలుగుతుంది. అందువలన రాజధాని ప్రాంతం వరకు మా అధికారాలను గవర్నరు దోసిట్లో పోస్తున్నాం' అని తీర్మానం చేసి, ఆయనకు అప్పగించేయాలి. అలా అప్పగించడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటి? కేంద్రం సైన్యాన్ని పంపిస్తుందా? చేతులెత్తేసి కూర్చుంటుందా? అలా అయితే సీమాంధ్రులకు యిచ్చిన ఒట్టు తీసి గట్టున పెట్టినట్టేనా? 'ఇలాటి తీర్మానం చేయడానికి నిరాకరించే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రస్తుతం వున్న శాసనసభ్యుల్లో తెలంగాణ సభ్యుల్లో కాంగ్రెసు వారి సంఖ్య ఎక్కువ కాబట్టి వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. వారందరూ సోనియా వీరవిధేయులు కాబట్టి ఆమె చెప్పినట్టే చేస్తారు.' అని వాదించవచ్చు. 

వారెంత ఢిల్లీ విధేయులైనా యింకో రెండు, మూడు నెలల్లో ప్రజల ముందుకు వెళ్లి ఎన్నికలు ఎదుర్కోవలసినవారే! ఇలాటి తీర్మానం పాస్‌ చేయడమంటే తెలంగాణకు ద్రోహం చేయడమే అని రాజకీయప్రత్యర్థులు గోల చేస్తారు. అసెంబ్లీని స్తంభింపచేస్తారు. వాకౌట్‌ చేస్తారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడికి లొంగి యీ తీర్మానం చేస్తున్నారు అని రచ్చరచ్చ చేసి ప్రజల తలకు ఎక్కిస్తారు. అలాటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా తెగించగలదా? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కాంగ్రెసుదేనన్న గ్యారంటీ ఏమిటి? ఇప్పుడున్న టి-కాంగ్రెసు వారందరూ కాంగ్రెసులోనే వుంటారని ఎలా చెప్పగలం? తెలంగాణ వచ్చేదాకానే ఆమెతో పని కానీ  వచ్చేశాక ఏముంది? రాహుల్‌ని కాబోయే ప్రధానిగా చూపించి, తెలంగాణలో ఓట్లు దండుకోగలరా? సీమాంధ్రలో ఏం జరుగుతోంది? తెలంగాణను ఆపినంతకాలం ఓడసోనియా అన్నారు, యిప్పుడు బోడిసోనియా అంటున్నారు. విడిగా పార్టీ పెడతామంటున్నారు. ఈ విద్య టి-కాంగ్రెసు నాయకులకు రాదా? 'తెలంగాణ ప్రకటిస్తే కెసియార్‌ను పట్టుకుని వచ్చి మీ పాదాల చెంత పడేస్తామని చెప్పారు కదా, అలా జరగలేదేం?' అని సోనియా బృందం తాటిస్తూంటే తట్టుకోలేక, అంతా కలిసి తెరాసలో చేరిపోవచ్చు. అప్పుడు ప్రభుత్వమే తెరాసది అయిపోతుంది. గవర్నరుకి అధికారాలు అప్పగించడాన్ని యిప్పుడు వ్యతిరేకిస్తున్న తెరాస, ప్రభుత్వంలోకి వచ్చాక సరే ననగలదా? అంటే టి-టిడిపి యాగీ చేయదా?

పోనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యిలాటి తీర్మానం చేసిందనే అనుకుందాం. 2014లో గెలిచిన పార్టీ ఆ తీర్మానాన్ని రద్దు చేస్తే!? అసలు ఆ తీర్మానం రద్దునే తమ మ్యానిఫెస్టోలో ముఖ్యాంశంగా అనేక పార్టీలు చేర్చుకుంటే? 2014 ప్రభుత్వం కూడా చాలా బుద్ధిమంతురాలైన ప్రభుత్వం అనుకున్నా 2019లో గెలిచే ప్రభుత్వానికి కూడా అంతటి సద్బుద్ధీ వుండాలిగా! ఎందుకంటే యిది పదేళ్లపాటు సాగే వ్యవహారం మరి! కేంద్రం చేతిలో అన్నీ వదిలేస్తే జరిగే అనర్థాలు ఒక్కొక్కటి అవగతమవుతున్నకొద్దీ ప్రజల్లో కూడా స్థానిక పాలనకై డిమాండ్‌ పెరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ శాఖాధికారులను దారుణంగా చంపిన సంఘటన విషయంలో తెలియవచ్చిందేమిటంటే - అడవిలో కొట్టి పడేసిన దుంగలు అమ్ముకోవడానికి కేంద్రం అనుమతి కావాలట. దానికోసం ఎన్నిసార్లు మొత్తుకున్నా ఉలుకూ పలుకూ లేదట. పడేసిన దుంగలు పట్టుకుపోవడానికి స్మగ్లర్లు తెగించారట. ప్రతీదీ కేంద్రమే చూడబోతే యిలాగే తయారవుతుంది.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సమైక్యవాదులు

ఇలా ఒకటి రెండు క్లాజుల గురించి ఆలోచిస్తేనే యిన్ని సమస్యలు తోస్తున్నాయి. ఇలాటివి యింకా ఎన్ని వున్నాయో! వీటిపై ఆలోచించవలసిన అవసరం లేదా? అధ్యయనం చేయనక్కరలేదా? చర్చించి ప్రజలకు బోధపరచనక్కరలేదా? తెలుగుజాతికి సంభవించిన ఇటువంటి విషమఘట్టంలో మేం నిర్వహించిన భూమిక యిది అని భావితరాలకు చెప్పనక్కరలేదా? ఈనాటి యీ చర్చలన్నీ రికార్డయి, వీటి ఆధారంగానే రేపు పార్లమెంటులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రసంగించబోతారు. రెండు జాతీయ పార్టీలు తమ రాజకీయప్రయోజనాల కోసం చేతులు కలిపి, తమ సంఖ్యాబలంతో బిల్లును అంతిమంగా  గట్టెక్కించవచ్చు. అలా గట్టెక్కించడంలో కొన్ని సవరణలు చేయవచ్చు. ఎప్పుడు? దేశంలోని పార్టీల నాయకులు యీ బిల్లులోని అసమంజసత్వాన్ని గమనించి, వాటికి వ్యతిరేకంగా మాట్లాడి ఏమేం సవరించాలో చెప్పినప్పుడు! వారికి పాయింట్లు అందించేదెవరు? అందించవలసిన దెవరు? సంబంధిత రాష్ట్ర శాసనసభ్యుల ఉపన్యాసాలే వారికి ఆధారం అవుతాయి. పార్లమెంటులోని యితర రాష్ట్రీయులకు యిక్కడ ఏ జిల్లాలో ఏ నది పారుతుందో తెలియదు, మిగులు జలాలు, తరుగు జలాల సంగతి తెలియదు. అసలు మనవాళ్లకే సరిగ్గా తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది? అందుకే మనవాళ్లు చర్చించి రికార్డు చేసి పంపితే వాళ్లు చదువుకుని ధాటీగా వాదించగలుగుతారు. 

ఇదంతా యిక్కడ చర్చించినప్పుడే సాధ్యమవుతుంది. అయితే యిక్కడ చర్చే సాగనీయటం లేదు - సమైక్యవాదులు! పైగా చర్చకు ఒప్పుకున్నవారు భ్రష్టులై పోయినట్టు ఆరోపిస్తున్నారు కూడా. దుర్మార్గం ఏమిటంటే - వీరందరూ మొన్నటిదాకా విభజనకు అభ్యంతరం లేదన్నవారే! కాంగ్రెసు పార్టీ రెండు నాలుకలతో మాట్లాడుతున్నపుడు ఆ పార్టీలోని సమైక్యవాదులెవరూ అడ్డుకోలేదు. టిడిపి అయితే యింకా ముందుకు వెళ్లి తెలంగాణకు అనుకూలం అని లేఖ కూడా యిచ్చింది. ఇప్పటికీ సమైక్యం అనలేదు. ఇప్పుడు సమైక్యం అంటున్న వైకాపా అయితే మొన్నటిదాకా విభజన చేయండి కానీ, తండ్రి వలె సమన్యాయం చేయండి అంది. ఈ పార్టీలలోని సీమాంధ్ర నాయకులెవరూ 'ఏమిటిది? మా విధానం సమైక్యం అని సిపిఎంలా, మజ్లిస్‌లా ఎందుకు ప్రకటించరు?' అని తమ నాయకత్వాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు పెద్ద పోటుగాళ్లలా బిల్లు చింపడాలు, తగలబెట్టడాలు, స్పీకరును చుట్టుముట్టడాలు. చర్చించకుండా వుండడం తప్పు. అంతకంటె విభజన అనే అంశం చేపట్టి - ఒక్కో అంశాన్ని బయటకు లాగి, దుమ్ము దులిపి, యిది అసాధ్యమైన, అమలకు వీలుకాని ప్రతిపాదన అని నిరూపించి, - 'యిందువలన విభజన సాధ్యం కాదు, యథాతథ పరిస్థితి కొనసాగించండి. ఏనాటికైనా విడిపోవాలి అనే భావన యిప్పుడు వచ్చింది కాబట్టి యికపై ఒకే ప్రాంతంపై నిధులు కుమ్మరించకుండా వివిధ ప్రాంతాలలోని వివిధ పట్టణాలలో పెట్టుబడులు పెట్టి సర్వత్రా అభివృద్ధి చేశాక, అప్పుడు విభజన గురించి మాట్లాడతాం' - అని నిరూపించాలి. ఓటింగు లేకపోయినా ప్రతీ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించే వీలు రాష్ట్రపతి యిచ్చారు. సద్వినియోగం చేసుకోవాలి.

కిరణ్‌ బహిరంగసమావేశాల్లో చేస్తున్నది అదే. విభజన వలన తెలంగాణ కూడా నష్టపోతుంది అని సోదాహరణంగా వివరిస్తున్నారు. ఈ సమైక్యవాదాన్ని కొత్తగా భుజానికి ఎత్తుకున్న నాయకులు కొందరు 'కిరణ్‌ కుట్రదారుడు, చాటుగా విభజనకు అంగీకరిస్తున్నాడు' అని ప్రచారం చేయడంలోనే సమయాన్ని వృథా చేస్తున్నారు. అంతరంగంలో ఏముందో అంతర్యామికే ఎఱుక! మనకు కావలసినది ఎక్స్‌రేలు కాదు, బహిరంగంగా రికార్డు కోసం విభజనవలన కలిగే నష్టాల గురించి అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసాలు!  వాటిస్థానంలో సమైక్యవాదులు చేస్తున్నవి - మర్కటవిన్యాసాలు! ఈ వికృతచేష్టలు యిలాగే జరిగితే 'బిల్లుపై చర్చ జరిగే అవకాశం శూన్యం. ఈ తెలుగువాళ్లెవరికీ వాదన వినిపించే విజ్ఞత, సామర్థ్యం లేదు. కేంద్రాన్ని తండ్రిగా భావిస్తారు. కాబట్టి పార్లమెంటులోనే ఏదో ఒకటి తేల్చిపడేయండి.' అని స్పీకరు, గవర్నరు సిఫార్సు చేసేస్తే మనకు తిక్క కుదిరిపోతుంది. ఆ రోజున చరిత్రలో దోషులుగా మిగిలిపోయేది యీ సోకాల్డ్‌ సమైక్యవాదులే.. విభజనవాదులు కాదు! 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?