చారుదత్తుడు, మైత్రేయుడు పుష్పకరండకం అనే ఉద్యానవనంలో వసంతసేన కోసం వేచి చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. గతంలో వ్యాపారం చేసి వున్న చారుదత్తుడికి ఆ వనంలో చెట్లు వ్యాపారుల్లా, వాటి పువ్వులు అమ్మకానికి పెట్టిన వస్తువుల్లా, అటూయిటూ సందడిగా ఎగిరే తుమ్మెదలు అమ్మకం పన్ను వసూలు చేసే రాజోద్యోగులుగా అనిపించాయి. వసంతసేన ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తూండగా వర్ధమానకుడు బండితో వచ్చాడు. లోపల వున్న ఆర్యకుడు 'అమ్మయ్య, ఉజ్జయినీ నగరం వెలుపలకి వచ్చేశాను కాబట్టి ఫర్వాలేదు. చాటుగా దిగి చెట్ల చాటున దాక్కుంటే మంచిదా? లేక చారుదత్తుడు శరణాగతవత్సలుడని అంటారు కాబట్టి ఎదుట పడి శరణు కోరనా' అని ఆలోచించసాగాడు. ఏం యింత ఆలస్యం అని మైత్రేయుడు వర్ధమానకుడు గద్దించి బండి లోపలకి తొంగి చూసి 'మిత్రమా, లోపల వున్నది వసంతసేన కాదు, వసంతసేనుడు!' అని అరిచాడు. 'పరిహాసానికి యిదా సమయం' అంటూ మందలించి చారుదత్తుడు బండి వద్దకు వచ్చి తనూ తొంగి చూశాడు. అతన్ని చూస్తూనే ఆర్యకుడు 'ఇతను మహనీయుడే' అని నిశ్చయించుకుని నిజం చెప్పి శరణు కోరాలనుకున్నాడు.
శృంఖలాలతో వున్న అతన్ని చూసి చారుదత్తుడు ఎవరు నువ్వు అని అడిగాడు. 'నేను ఆర్యకుణ్ని, శరణు, శరణు' అనగానే 'రాజు పట్టి తెచ్చి చెఱలో పెట్టినది నిన్నేనా?' అని అడిగాడు. 'నీ అదృష్టం బాగుండి నా కంటపడ్డావు. నా ప్రాణాలు అడ్డు వేసి నిన్ను రక్షిస్తాను' అని ధైర్యం చెప్పి 'వర్ధమానకా, యితని సంకెల తీసివేయి' అన్నాడు. సంకెల నుండి విడివడ్డాక ఆర్యకుడు 'మీరు నన్ను వీటి కంటె దృఢమైన స్నేహబంధంతో బంధించారు' అంటూ నమస్కరించాడు. 'మీ అనుమతి లేకుండా మీ బండి ఎక్కాను. పట్టుబడి వుంటే మీకు ముప్పు తెచ్చి వుండేవాణ్ని. క్షమించండి. అనుమతిస్తే వెళ్లి వస్తాను' అంటూ కాలినడకన వెళ్లబోయాడు. 'ఇప్పటిదాకా కాలికి గొలుసులు వున్నాయి కాబట్టి నీ అడుగులు వడిగా పడవు. ఈ ఉద్యానప్రాంతంలో తిరిగే వారి కళ్లల్లో పడతావు. ఈ గూడుబండిలో వెళితే ఎవరో కులస్త్రీ అనుకుని ఎవరూ తొంగి చూడరు. ఇదే నీకు క్షేమం. వెళ్లి నీ బంధుమిత్రులను క్షేమంగా కలుసుకో.' అన్నాడు చారుదత్తుడు. 'మీరు చేసిన మేలు జన్మలో మరువను' అని చెప్పి ఆర్యకుడు వెళ్లిపోయాడు.
అదే ఉద్యానవనంలో మరో మూల తన బండివాణ్ని రమ్మన్నచోటికి శకారుడు తన స్నేహితుడైన విటుడితో చేరాడు. వాళ్లు వచ్చే వేళకు బౌద్ధభిక్షువుగా మారిన సంవాహకుడు తన కౌపీనాన్ని అక్కడి చెరువులో ఉతుక్కుంటున్నాడు. అది చూసి శకారుడు మండిపడ్డాడు. 'ఈ వనం నాకు మా బావగారైన రాజుగారు యిచ్చినది. ఈ చెరువులో నా అంతటివాడే స్నానం చేయడు. అలాటిది ముక్కిపోయిన ఉలవల పొట్టులా రంగుమారిన నీ గోచీని ఉతుకుతావా? ఇలాటి పని చేసిన నిన్ను ఒక్క దెబ్బతో చావగొడితే తప్పేముంది?' అని విరుచుకుపడ్డాడు. విటుడు 'ఇతని గోచీ మరీ అంత పాతదానిలా లేదు. రంగు మాయలేదు చూశావా, కొత్త సన్యాసి అయి వుంటాడు, వదిలేయ్' అని నచ్చచెప్పబోయాడు. శకారుడు వదలలేదు 'ఏరా, నువ్వు యిప్పుడే సన్యసించేవేం? ఇంతకు ముందే ఆ పని ఎందుకు చేయలేదు?' అని తగులుకున్నాడు. భిక్షువుకి భయం వేసింది. వెళ్లి వస్తానన్నాడు. 'నువ్వు వెళ్లడానికి వీల్లేదు, నువ్వు యిక్కడే వుండాలని నా అంతరాత్మ చెపుతోంది' అని శకారుడు ఠలాయించాడు. భిక్షువు వాణ్ని లోపల తిట్టుకుంటూ పైకి మంచి మాటలు చెపుతూ అక్కణ్నుంచి జారుకున్నాడు.
అతను వెళ్లాక శకారుడు ఒక బండ మీద కూర్చుని 'రావలసిన బండి యింకా రాలేదు. సూర్యుడు నడిమింటికి చేరుకుని అలిగిన కోతిలా భీకరంగా వున్నాడు. నడిచి వెళ్లడం కష్టం. బండివాడికి ఏ పోయేకాలం వచ్చిందో' అని ఉస్సురస్సురంటూ వుంటే బండివాడు వచ్చి 'బండి తెచ్చా' అన్నాడు. ఇక్కడకు తీసుకురా అన్నాడు శకారుడు. ఇక్కడకు రావడానికి దారి లేదు కదా అంటే యిదిగో యీ మొండిగోడ వుందిగా దీని మీద నుంచి దూకించి తీసుకురా అన్నాడు. ఎద్దులో, బండో, నేనో చస్తామండి అంటే ఏం ఫర్వాలేదు, కొత్త ఎద్దులు, కొత్త బండి కొంటా. నువ్వు పోతే మరొకణ్ని బండివాడిగా తెచ్చుకుంటాను. దూకించు అని ఆజ్ఞ వేశాడు. గతిలేక స్థావరకుడు గోడ దూకించి బండిని తెచ్చాడు. అది ఖాళీ బండి అనుకుని ఎక్కబోయిన శకారుడికి దానిలో కూర్చున్న వసంతసేన కనబడింది. అతను గందరగోళపడిపోయి గబుక్కున బండి దిగి విటుడి వద్దకు వచ్చి ''బావా లోపల రాక్షసో, దొంగో వున్నారు. రాక్షసైతే మనల్ని దోచుకుంటుంది, దొంగైతే మనల్ని తినేస్తాడు ('స్పూనరిజం') కావాలంటే నువ్వూ చూడు' అని వాపోయాడు.
శకారుడి గొంతు వింటూనే లోపల వున్న వసంతసేన వులిక్కిపడింది. వీడు దాపురించేడే అని భయపడింది. విటుడు బండి ఎక్కి వసంతసేనను చూసి ఆశ్చర్యపడ్డాడు. లేడి పులిని వెతుక్కుంటూ వచ్చిందే అనుకుంటూ 'ఆరోజు గర్వాతిశయంతో వీణ్ని తిరస్కరించి, యీ రోజు వేశ్యాబుద్ధితో ధనం కోసం యీ పనికి పూనుకున్నావా? తల్లి చెప్పడం చేత ఒప్పుకున్నావా?' అని అడిగాడు. 'బళ్లు తారుమారవడంతో యీ బండిలో వచ్చాను. నిన్ను శరణు వేడుతున్నాను, కాపాడు' అంది వసంతసేన. విటుడు ఆమెకు సాయపడదలచుకుని బండి దిగి శకారుడితో 'అవును బావా, లోపల వున్నది రాక్షసే.' అన్నాడు. 'మరి నిన్ను తినివేయలేదేం?' అని శకారుడి ప్రశ్న. 'ఆ చర్చ ఎందుకు? మనం యీ వనంలో నడుచుకుంటూ కాస్త దూరం వెళదాం. వ్యాయామం చేసినట్లవుతుంది. ఎడ్లకు కాస్త విశ్రాంతి యిచ్చినట్లవుతుంది' అన్నాడు విటుడు. 'నా అంతటివాడు కాలినడకన వెళితే పరువుంటుందా?' అని మారాం చేశాడు శకారుడు. ఇక గతిలేక విటుడు 'బావా, లోపల వున్నది వసంతసేన, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.' అని చెప్పేశాడు.
దాంతో శకారుడు ఉబ్బిపోయాడు. వసంతసేన దగ్గరకు వెళ్లి 'ఇది వరకు అనుచితంగా ప్రవర్తించి కోపం తెప్పించాను. దానికి నీ కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇప్పణ్నుంచి నేను నీ దాసుణ్ని' అన్నాడు. వసంతసేన ఛీత్కరించి 'అవతలికి పో' అంటూ ఒక్క తన్ను తన్నింది. శకారుడికి కోపం వచ్చింది. 'చచ్చిన జంతువు తలను అడవిలో నక్క తన్నినట్లు తన్నావు. దీనికి తగిన శాస్తి అనుభవిస్తావు' అంటూ బండివాడి కేసి తిరిగి 'ఇది నీకెక్కడ దొరికిందిరా?' అని అడిగాడు.
'చారుదత్తుడి పెరటి గుమ్మం దగ్గర బండి ఆపి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు యీవిడ వేరే బండి అనుకుని మన బండి ఎక్కినట్టుంది' వాడు చెప్పడంతో శకారుడికి అర్థమై పోయింది. 'ఓహో, ఆ దరిద్ర చారుదత్తుడికి అభిసారికయై వస్తూ నా బండి ఎక్కావా? నీకు నేను అక్కరలేదు కానీ నా బండి కావలసి వచ్చిందా? దిగుదిగు' అని యీసడించాడు.
'అవును చారుదత్తుణ్ని చేరుకోవడానికే వస్తున్నాను.' అని వసంతసేన ధీమాగా చెపుతూ బండి దిగబోతూ వుండగా 'జటాయువు వాలి భార్యను జుట్టుపట్టుకుని యీడ్చినట్లు యీడ్చేస్తా' అంటూ శకారుడు ఆమె జుట్టు పట్టుకోబోయాడు. మధ్యలో విటుడు కలగజేసుకుని వారించాడు. వసంతసేన బండి దిగి ధైర్యంగా నిలబడింది. శకారుడు కోపం ఎగదోసినట్లయింది. విటుణ్ని 'ఈమెను చంపివేయి' అన్నాడు. 'ఉజ్జయిని నగరానికే అలంకారప్రాయమైన స్త్రీ, వేశ్యాకులంలో పుట్టినా సదాచారాలు కలిగినది అయిన యీ వసంతసేనను చంపితే నాకు నరకంలో వైతరణీనది దాటడానికి తెప్ప దొరుకుతుందా? నేను చంపను' అన్నాడతను.
'ఆ తెప్పేదో నేను పట్టుకుని వచ్చి యిస్తాను. నువ్వు దీన్ని చంపితే చూసేవాడెవడు?' అని మండిపడ్డాడు శకారుడు. 'దిక్పాలకులు లేరా? వారు చూడరా?' అని అతనంటే 'కావాలంటే ముసుగు వేసి చంపేయి' అని సలహా యిచ్చాడు శకారుడు. అయినా విటుడు వినకపోవడంతో యిక బండివాడైన స్థావరకుణ్ని పిలిచి చంపేయమన్నాడు. బంగారు మురుగులు, ఆసనం యిస్తానని ఆశపెట్టాడు. 'మీరు నా శరీరానికే ప్రభువులు తప్ప నా శీలానికి కాదు. నేను ఆమెను యిక్కడికి తెచ్చి పాపం చేశాను. ఇంతకు మించి చేయను' అని కచ్చితంగా చెప్పేశాడు వాడు. శకారుడికి కోపం వచ్చి వాణ్ని కసితీరా తన్నాడు. 'గతజన్మలో ఏ పాపం చేశానో, యీ జన్మలో పుట్టుసేవకుడిగా పుట్టాను. మీరు చెప్పిన పాపం చేసి మరుజన్మ కూడా పాడు చేసుకోను' అన్నాడు వాడు.
వాళ్లిద్దరినీ చూసి విటుడు అనుకున్నాడు – 'స్థావరకుడు పేదవాడు, సేవకుడు. డబ్బు యిస్తానన్నా పాపభీతితో తప్పు చేయడానికి ఒప్పుకోవటం లేదు. దుర్మార్గుడైన శకారుడి లాటి వాళ్లకు ఏ నష్టమూ వాటిల్లకపోగా అధికారం సిద్ధిస్తోంది. ధర్మపరులపై ఆధిపత్యం లభిస్తోంది. ఇదంతా దేవుడి విపరీతచేష్ట' అని. బండివాడు తన మాట వినటం లేదని గ్రహించిన శకారుడు అతన్ని అక్కణ్నుంచి వెళ్లిపోమన్నాడు. తర్వాత నడుముకి ఉత్తరీయం బిగించి వసంతసేన వద్దకు వచ్చి నువ్వు నిన్ను చంపేస్తాను అని అరిచాడు. అప్పుడు విటుడు ఎదురు తిరిగాడు. నా ఎదుటే చంపుతావా అంటూ అతని మెడ పట్టుకున్నాడు. నా తిండి తిని బలిసిన నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? అని శకారుడు గద్దించి అంతలోనే కపటంగా 'ఉత్తమవంశంలో పుట్టిన నేను స్త్రీని చంపుతానా? ఆమెను లొంగదీసుకోవడానికి ఉత్తినే బెదిరించానంతే' అని నచ్చచెప్పి 'మీరంతా వుంటే వసంతసేన సిగ్గుపడి నన్ను అంగీకరించటం లేదు. నువ్వు కూడా అవతలికి తప్పుకుని, వెళ్లి స్థావరకుణ్ని వెతకరాదా' అన్నాడు. విటుడు ఆ మాట నమ్మాడు 'ఆభిజాత్యం కొద్దీ వసంతసేన నా సమక్షంలో వీడికి లొంగటం లేదు. నేను తప్పుకుంటే మంచిది' అనుకుని వెళ్లిపోతూ శకారుడితో 'వసంతసేన బాధ్యతను నీ చేతిలో వుంచుతున్నాను' అని చెప్పి మరీ వెళ్లాడు. వెళ్లాడే కానీ శకారుడిపై అనుమానంతో పొదల్లో దాగి ఏమైందో చూడసాగాడు.
శకారుడు అతని కంటె తెలివైనవాడు. 'ఈ బ్రాహ్మడు మోసగాళ్లకు మోసగాడు, ముసలి నక్క. ఎక్కణ్నుంచో నన్ను గమనిస్తూ వుంటాడు' అనుకుని పూలు కోస్తూ 'వసంతసేనా, యిటు రా, యివన్నీ నీ కోసమే' అంటూ శృంగారసంభాషణలు చేయసాగాడు. అది చూసిన విటుడు 'అమ్మయ్య శకారుడు శృంగారంలో పడ్డాడు తప్ప ఆమెను చంపే వుద్దేశంలో లేడు' అనుకుని వెళ్లిపోయాడు. అప్పుడు శకారుడు వసంతసేన వద్దకు వచ్చి 'తలవంచి కాళ్లపై పెడుతున్నాను. నన్ను అంగీకరించు' అన్నాడు. 'సొమ్ములతో నన్ను కొనాలని చూశావ్. ఈరోజు నేను చారుదత్తుని దాసి నయ్యాను. అతన్ని విడువను, నిన్ను అంగీకరించను' అని ఆమె స్పష్టంగా చెప్పింది. శకారుడికి కోపం వచ్చింది – 'ఆ చారుదత్తుడు ఇంద్రుడా, అంగదుడా, రంభాసుతుడైన కాలనేమియా? మహాభారతయుద్ధంలో సీతను చాణక్యుడు చంపినట్లు, జటాయువు ద్రౌపదిని చంపినట్లు నేను నిన్ను చంపితే వచ్చి అడ్డుపడగలడా?' అని పీక పట్టుకుని నులమసాగాడు. ఆమె కళ్లు తేలవేసి, నేలకు జారింది.
శకారుడు అక్కణ్నుంచి జారుకుందా మనుకుంటూండగానే స్థావరకుణ్ని వెంటపెట్టుకుని విటుడు వచ్చాడు. అక్కడ చాపచుట్టుగా పడి వున్న వసంతసేనను చూసి నువ్వేనా యీమెను చంపినది అని శకారుణ్ని అడిగాడు. 'ఈ ప్రతాపం మరి యింకెవరిది? చూడడానికి మా నాన్న, అన్న లేకపోయారని బాధపడుతున్నాను' అన్నాడు శకారుడు. 'అయ్యో వసంతసేన చనిపోయిందంటే ఒక దయాజలప్రవాహం యింకిపోయినట్లే, ఉజ్జయినీ నగరశోభ మలిగిపోయినట్లే' అని చింతించి విటుడు యిక యిక్కడ వుంటే ప్రమాదం అనుకుని వెళ్లిపోబోయాడు. వెంటనే శకారుడు అతన్ని పట్టుకుని 'వసంతసేనను చంపివేసి ఎక్కడకి పారిపోతావు?' అని బెదిరించాడు. తర్వాత 'మనం ఒక పని చేద్దాం. గుర్తు తెలియని వ్యక్తులెవరో గుంపుగా వచ్చి చేసిన హత్యగా నేను ప్రకటిస్తాను. నువ్వు సాక్ష్యం పలుకు. నీకు బంగారం యిస్తాను.' అని ప్రతిపాదించాడు.
కానీ విటుడు దానికి ఒప్పుకోలేదు. నీకూ నీ స్నేహానికి దణ్ణం అంటూ వసంతసేన శవం వద్దకు వచ్చి 'నువ్వు వచ్చే జన్మలో కులస్త్రీగా జన్మించుగాక' అని ప్రార్థించి అంటూ వెళ్లిపోబోయాడు. అతను తన ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో శకారుడు హత్యాపరాధం అతనిపై తోసేద్దామనుకున్నాడు. 'వసంతసేనను చంపి ఎక్కడకు వెళ్లిపోతున్నావురా? మా బావ గారి దగ్గర వచ్చి సంజాయిషీ చెప్పు' అని ఆపబోయాడు. దాంతో విటుడు 'ఏం కూశావురా నీచుడా' అంటూ కత్తి దూశాడు. దాంతో శకారుడు వెనక్కి తగ్గాడు. విటుడు 'సజ్జనులైన శర్విలకుడు, చందనకుడు వెళ్లిన దారిలోనే నేనూ ఆర్యకుడి దగ్గరకు చేరతాను' అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఇక శకారుడు స్థావరకుడిపై దృష్టి పెట్టాడు. 'నీకు నగలిస్తాను. ఎవరికీ చెప్పకు. వెళ్లి నా భవంతిలో మిద్దెగదిలో నాకోసం వేచి వుండు' అని పంపించివేశాడు. తర్వాత 'తనమీదకు హత్యానేరం వస్తుందన్న భయంతో విటుడు బయటకు రాడు. ఈ స్థావరకుణ్ని నా మిద్దెగదిలో బంధించివేస్తాను. ఇక వసంతసేన శవం మాయం చేస్తే నా నేరం ఎవరికీ తెలియదు' అనుకుని శవాన్ని ఉత్తరీయంతో కప్పబోయాడు. అది తనను పట్టిస్తుందన్న భయం వేసి, అక్కడ ఎండుటాకులు కనబడితే వాటిని ఆమె శవం మీద కుప్పగా పోసి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)