Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లడ్డుబాబు

సినిమా రివ్యూ: లడ్డుబాబు

రివ్యూ: లడ్డు బాబు
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: మహారథి ఫిలింస్‌
తారాగణం: అల్లరి నరేష్‌, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు తదితరులు
మాటలు: నివాస్‌
సంగీతం: చక్రి
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: ఎన్‌. సుధాకర్‌ రెడ్డి
నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర
రచన, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ: ఏప్రిల్‌ 18, 2014

దర్శకుడిగా రవిబాబు, హీరోగా నరేష్‌ ఒకే సినిమాతో కెరీర్‌ స్టార్ట్‌ చేసారు. ఆ సినిమాతో ‘అల్లరి’ని ఇంటిపేరు చేసేసుకున్నారు ఈ ఇద్దరూ. అల్లరి నరేష్‌ ఆ తర్వాత కామెడీ హీరోగా ఎంత సక్సెస్‌ అయ్యాడో... చిన్న చిత్రాలతో రవిబాబు కూడా దర్శకుడిగా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఇద్దరూ కలిసి మళ్లీ అల్లరి లాంటి పాత్‌ బ్రేకింగ్‌ మూవీ చేయలేకపోయారు. లడ్డుబాబుతో అల్లరి రిపీట్‌ చేస్తారని ఆశిస్తే... వీక్‌ స్క్రిప్ట్‌పై భారీ కాయంతో అల్లరి నరేష్‌ అలరించలేక చతికిల పడిపోయాడు.

కథేంటి?

ఏదో దోమ కుట్టి స్లిమ్‌గా ఉన్న లడ్డు బాబు (నరేష్‌) ఒక్కసారిగా ఊబకాయంతో రెండొందల ఎనభై కిలోలకి పెరిగిపోతాడు. ఎలాగైనా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది లడ్డుబాబు కల. అయితే అతని తండ్రి (కోట) మాత్రం లడ్డుబాబుని ఎవరో ఒకర్ని ఇచ్చి పెళ్లి చేసేసి అతని పేరు మీదున్న ఆస్తి కొట్టేయాలని చూస్తుంటాడు. అనుకోకుండా లడ్డుబాబుకి మాధురి (భూమిక) అనే విడోతో పరిచయం అవుతుంది. అలాగే అతను ప్రేమిస్తున్న మాయ (పూర్ణ) కూడా దగ్గరవుతుంది. ఆ తర్వాత లడ్డుబాబు లైఫ్‌ ఏమవుతుంది?

కళాకారుల పనితీరు!

అల్లరి నరేష్‌ ఈ చిత్రం కోసం నటించడాని కంటే ఆ మేకప్‌ వేసుకోవడానికి, దానిని మోయడానికి ఎక్కువ కష్టపడి ఉంటాడు. ఆ మేకప్‌ మాటున అల్లరి నరేష్‌ ఏం ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టినా పెద్దగా కనిపించలేదు కూడా. అతను పడ్డ కష్టాన్ని మెచ్చుకోవచ్చు కానీ అనవసరంగా అది వృధా అయిపోయినందుకు మాత్రం బాధ పడడం మినహా ఏం చేయలేం.

భూమిక వయసుకి తగ్గ పాత్రలో కనిపించింది. బాగా చేసింది. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎన్నో సినిమాల్లో లోభి పాత్ర చేసిన ఆయన ఇందులో తన పిసినారితనంతో నవ్వించలేకపోయారంటే అందుకు దర్శక, రచయితలనే నిందించాలి. పూర్ణ పెద్దగా చేసిందేమీ లేదు. సినిమాలో సీరియస్‌గా తీసుకోవాల్సిన క్యారెక్టర్స్‌ ఇంకెవరూ చేయలేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

చక్రి సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. పాటల చిత్రీకరణలో రవిబాబు తన ప్రత్యేకత నిలుపుకోవాలని చూసినా చక్రి బాణీలు మాత్రం వినసొంపుగా లేవు. నేపథ్య సంగీతం అయితే ఏమాత్రం బాలేదు. ఛాయాగ్రహణం ఫర్వాలేదు. అల్లరి నరేష్‌ మేకప్‌కి కష్టపడ్డ ఆర్టిస్టులని మెచ్చుకోవాలి. నరేష్‌లాంటి అల్ట్రా స్లిమ్‌ హీరోని నమ్మశక్యం కానంత లావుగా తీర్చిదిద్దారు. ద్వితీయార్థంలో అవసరం లేని వేస్టేజ్‌ చాలా ఉంది. ఎడిటర్‌ డిలీట్‌ చేసుకోవడానికి చాలా స్టఫ్‌ ఉన్నా మొహమాటం కొద్దీ వదిలేసినట్టున్నాడు.

రవిబాబు అయితే మంచి చిత్రాలు లేదా నాసి రకం సినిమాలు తీస్తుంటాడు. అతని దర్శకత్వంలో టూ ఎక్స్‌ట్రీమ్స్‌ ఉన్నాయి. అతడి నుంచి మంచి సినిమా వస్తుందా లేక నస పెట్టే సినిమా వస్తుందా అనేది ముందే చెప్పడం కష్టం. లడ్డు బాబు ప్రామిసింగ్‌గా కనిపించినా కానీ రవిబాబు తీసిన బ్యాడ్‌ సినిమాల లిస్ట్‌లోకే చేరేట్టుగా తయారైంది. స్క్రిప్ట్‌ చాలా సిల్లీగా ఉండడంతో రవిబాబు దీనిని ఎంత ఫన్నీగా తీద్దామని చూసినా వర్కవుట్‌ కాలేదు.

హైలైట్స్‌:

  • లడ్డుబాబు గెటప్‌

డ్రాబ్యాక్స్‌:

  • రవిబాబు స్క్రిప్ట్‌

విశ్లేషణ:

ఇలా ఒక భారీ కాయుడ్ని హీరోగా పెట్టి తీసిన సినిమాల్లో ఎంత సేపు వారి ‘ఊబ కాయం’ మీదే జోకులు వేయడానికి చూస్తారు. కామెడీ బాగా పేలితే చూడొచ్చు కానీ అది శృతి మించితే మాత్రం భరించడం కష్టం. కేవలం ఊబకాయం ఉన్నవారి మీదే కాకుండా వివిధ అంగ వైకల్యాలు ఉన్న వారిపై కూడా జోకులు వేయడం దురదృష్టకరం. అవిభక్త కవలల గురించి ‘కామెడీ’ చేయాలని చూడడం మరింత దౌర్భాగ్యం. పోనీ అలాంటి సన్నివేశాలని పక్కన పెట్టి మిగతాది ఆస్వాదిద్దామన్నా ఇందులో ఏమీ లేదు. లడ్డుబాబుని అందరూ వెనక్కి తిప్పి కొడుతూ ఉండడమే కామెడీ అనుకోమని దర్శకుడు ఫిక్స్‌ అయిపోయాడు. రచయిత కూడా మరీ నాసి రకం సంభాషణలతో విసిగించి పారేసాడు. ఇక అసలు కథ మొదలైన తర్వాత ముందేమి జరుగుతుందో ముందే తెలిసిపోతూ ఉంటుంది కనుక ఇక లడ్డుబాబు చూడ్డానికి ఓ కారణమంటూ కనిపించదు.

సింగిల్‌ సిట్టింగ్‌ సర్జరీతో లడ్డుబాబు సన్నబడిపోవడం, మళ్లీ ఒక బాటిల్‌ నెయ్యి తాగేసి తిరిగి లావైపోవడం... లాంటి సీన్లు చూస్తే రవిబాబు ఈ సినిమాని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తుంది. సినిమాలో కాస్తో కూస్తో బాగున్న సీన్‌ని డిలీట్‌ చేసి రోలింగ్‌ టైటిల్స్‌ దగ్గర పెట్టారు. నిజానికి ఆ ఒక్క సీనే సినిమాలో ఉంచి మిగతాదంతా ‘డిలీటెడ్‌’ అని చెప్పి రోలింగ్‌ టైటిల్స్‌ దగ్గర వేసుండాల్సింది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని మనకి జరిగిన మంచిని తలచుకుంటే మనసు ప్రశాంతంగా అయిపోతుందని ఇందులో చెప్పారు. కాబట్టి లడ్డుబాబు ప్రేక్షకులకో చిట్కా. థియేటర్లోకి వెళ్లిపోయి కళ్లు మూసుకుని అల్లరి నరేష్‌ నటించిన మంచి కామెడీని ఏదైనా ఊహించుకుని వచ్చేయండి. వెళ్లని వాళ్లు లడ్డుబాబుని చూడ్డానికి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ ఉండే సదుపాయం వచ్చేవరకు వేచి చూడండి.

బోటమ్‌ లైన్‌: మహా జిడ్డు బాబు!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?