Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లక్ష్మీ రావే మా ఇంటికి

సినిమా రివ్యూ: లక్ష్మీ రావే మా ఇంటికి

రివ్యూ: లక్ష్మీ రావే మా ఇంటికి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: గిరిధర్‌ ప్రొడక్షన్స్‌ హౌస్‌
తారాగణం: నాగశౌర్య, అవికా గోర్‌, రావు రమేష్‌, నరేష్‌, విద్య, వెన్నెల కిషోర్‌, వేణు, సప్తగిరి తదితరులు
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్‌
కూర్పు: రామాంజనేయులు
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: గిరిధర్‌ మామిడిపల్లి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: నంద్యాల రవి
విడుదల తేదీ: డిసెంబర్‌ 05, 2014

చాలా మంది రచయితలు దర్శకులుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో కొన్ని చిత్రాలకి మాటలు రాసిన అనుభవం ఉన్న నంద్యాల రవి ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరపై కూడా మెరిసిన టీవీ సెన్సేషన్‌ అవిక ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేసింది. చిన్న సినిమాలతో యమ బిజీగా ఉంటోన్న నాగశౌర్య ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు చేసిన హీరోగా క్రెడిట్‌ కొట్టేసాడు. 

కథేంటి?

తండ్రి (రావు రమేష్‌) మాట జవదాటని బుద్ధిమంతురాలు లక్ష్మి (అవిక). తన తండ్రి కుక్కని చేసుకోమంటే చేసుకుంటా అంటుంటుంది. లక్ష్మికి నిశ్చితార్ధం కూడా అయిపోయిన తర్వాత ఆమెని చూస్తాడు సాయి (శౌర్య). చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమెకి ఎంగేజ్‌మెంట్‌ అయిందని తెలిసినా కానీ ప్రేమిస్తున్నా అంటూ వెంట పడతాడు. తండ్రి మాటే వేదంగా బతికే లక్ష్మి మరి సాయి ప్రేమని ఎలా అంగీకరిస్తుంది. అతడు ఆమెనీ, ఆమె తండ్రినీ ఎలా కన్విన్స్‌ చేస్తాడు? 

కళాకారుల పనితీరు:

నాగశౌర్య పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు ఎంచుకుంటూ తన జోన్‌లో తాను కంఫర్టబుల్‌గా ఉంటున్నాడు. ఇందులో అవసరం లేని రెండు ఫైట్లు కూడా చేసాడనుకోండి. పక్కింటి కుర్రాడి టైప్‌ క్యారెక్టర్స్‌ చేయడంలో యాక్టర్స్‌కి ఓ అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఆ పాత్రల్ని రక్తి కట్టించేయడానికి తెగ నటించేయాల్సిన అవసరం ఉండదు. శౌర్య వీలయినంత నేచురల్‌గా ఉండడానికి కృషి చేసాడు. క్యారెక్టర్‌కి యాప్ట్‌ అనిపించుకున్నాడు. 

అవిక సిల్వర్‌ స్క్రీన్‌పైకి రాకముందే టీవీలో పెద్ద స్టార్‌ కావడం వల్ల చాలా యావరేజ్‌ లుక్స్‌ ఉన్నా, అంతే యావరేజ్‌ పర్‌ఫార్మర్‌ అయినా కానీ పాస్‌ అయిపోతోంది. అయితే ఆ టీవీ ఇమేజ్‌ని దాటి హీరోయిన్‌గా నిలదొక్కుకుని ఇక్కడో లెవల్‌కి చేరాలంటే మాత్రం ఈమాత్రం నటన ఎంతమాత్రం సరిపోదు. గ్లామర్‌ పరంగా ఎలాగో లిమిటేషన్స్‌ ఉన్నాయి కాబట్టి!

రావు రమేష్‌ అక్కడక్కడా గీత దాటినట్టు అనిపించినా మొత్తమ్మీద తన పాత్రని బాగానే పండించాడు. నరేష్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది. తన పాత్రకి హండ్రెడ్‌ పర్సంట్‌ జస్టిస్‌ చేసాడు. వెన్నెల కిషోర్‌, వేణు, సప్తగిరి, సత్యం రాజేష్‌ కామెడీని పండించే బాధ్యతని షేర్‌ చేసుకున్నారు. ఎవరి స్టయిల్లో వారు ఫర్వాలేదనిపించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

చాలా గ్యాప్‌ తర్వాత కె.ఎం. రాధాకృష్ణన్‌ సంగీతమందించిన చిత్రమిది. ఆయన మార్కు క్లాసిక్‌ టచ్‌ కొన్ని పాటల్లో వినిపించింది కానీ సంగీత పరంగా చెప్పుకోతగ్గ గొప్ప పాటలేమీ లేవిందులో. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరీ పాతికేళ్ల నాటి చిత్రాల్ని తలపించింది. ఈ విధంగా నచ్చిన సీన్లు తీసేసుకుని ఎడిటర్‌ చేతిలో పెడితే దానిని ఒక దారిన పెట్టి పర్‌ఫెక్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వడం ఏ ఎడిటర్‌కి అయినా కష్టమే. ఎడిటింగ్‌ లోపాలకి దర్శకుడే కారకుడు అనుకోవాలి. సినిమాటోగ్రఫీ పరంగా కూడా మెప్పించేవి, ఎంచేవీ ఏమీ లేవు. 

Video: Lakshmi Raave Maa Intiki Public Talk

రచయిత నంద్యాల రవి దర్శకుడైనా కూడా మాటల మీదే డిపెండ్‌ అయినట్టు అనిపించింది. సినిమా అంతటా డైలాగుల ప్రవాహమే. ప్రాస కోసం ప్రయాస పడుతూ ఆ డైలాగులు అర్థవంతంగా ఉన్నాయా లేదా అనేది కూడా లెక్క చేయలేదు. సీరియస్‌ సీన్లలో కూడా అర్థం పర్ధం లేని డైలాగులెన్నో రాసేసి సన్నివేశం ఇంపాక్ట్‌ తగ్గించేసి... అన్‌ఇంటెన్షనల్‌ కామెడీ సృష్టించాడు. కామెడీ కోసం రాసిన డైలాగులకి ప్రేక్షకులు నవ్వితే రచయిత సక్సెస్‌ అయినట్టే కానీ... సీరియస్‌ సీన్‌లో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌కి నవ్వొచ్చిందంటే రచయిత మాటలు నవ్వుల పాలయినట్టే. ఎంతసేపు సంభాషణల మీదే తప్ప సన్నివేశాలపై, భావోద్వేగాలపై దర్శకుడు దృష్టి పెట్టలేదు. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ కొత్త దర్శకుడి ప్రతిభ కనిపించిన సన్నివేశం మచ్చుకి ఒక్కటీ లేదు. 

హైలైట్స్‌:

  • ఆరంభంలో కాసేపు సరదాగా ఉంది
  • రాజ్‌ తరుణ్‌ (ఉయ్యాల జంపాల ఫేమ్‌) వాయిస్‌ ఓవర్‌

డ్రాబ్యాక్స్‌:

  • పాయింట్‌లెస్‌ స్క్రీన్‌ప్లే
  • సెన్స్‌లెస్‌ డైలాగ్స్‌

విశ్లేషణ:

పనీ పాటా లేకుండా తిరిగే హీరో.. క్రమశిక్షణ కోరుకునే హీరోయిన్‌ తండ్రి.. నిశ్చితార్ధం అయిపోయిన హీరోయిన్‌. చాలా సినిమాల్లో చూసేసిన ఫార్ములాని, క్యారెక్టర్లనే తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రానికి ఎంచుకున్నాడు నంద్యాల రవి. ముఖ్యంగా ఈ చిత్రంలో ‘నువ్వే నువ్వే’ ఛాయలు ఎక్కువ కనిపిస్తాయి. అదే కథని కాస్త అటు ఇటు చేసి ఇంకో రకంగా చెప్పేందుకు దర్శకుడు ట్రై చేసాడు కానీ కీలక ఘట్టాలు అన్నిట్లోను ఆ చిత్రం గుర్తు రాకుండా పోదు. ప్రధానంగా హీరో, హీరోయిన్‌ ఫాదర్‌ కాన్‌ఫ్రంటేషన్‌ సీన్స్‌ అన్నీ ‘నువ్వే నువ్వే’ని తలపిస్తాయి. 

పాత కథల్ని రిపీట్‌ చేయడం ఇప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు. కాకపోతే ఆ కథనే ఆసక్తికరంగా చెప్పి ఉన్నట్టయితే బాగుండేది. పాత్రల నుంచి సన్నివేశాల వరకు అన్నీ బలహీనంగా తయారవడంతో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఎక్కడా ప్రేక్షకులకి కనెక్ట్‌ అవదు. ప్రేమకథా చిత్రంలో ప్రేమ జంట కలవాలనే ఉత్కంఠ కూడా లేకపోతే ఇక అది ఎలా అలరిస్తుంది. పైగా హీరోయిన్‌ చాలా బలహీనం అన్నట్టు దర్శకుడు చాలా సందర్భాల్లో చూపించేసాడు. హీరో హీరోయిన్లు ఒక్కటవడం అనేది ఎవరైనా ఊహించే క్లయిమాక్సే అయినా కనీసం పాత్రల మధ్య సంఘర్షణతోనో, క్యారెక్టరైజేషన్‌ కాన్‌ఫ్లిక్ట్‌తోనో టెన్షన్‌ బిల్డ్‌ చేయవచ్చు. కానీ ఎప్పటికప్పుడు హీరోని కౌగిలించుకోవడానికి రెడీ అయిపోతూ.. మా నాన్న మాటే వేదం అని హీరోయిన్‌ చెబుతున్నా కానీ ఈ వీక్‌ క్యారెక్టర్‌ ఏ క్షణంలో అయినా ప్లేట్‌ తిప్పేస్తుందని ముందే అర్థమైపోతుంది. 

అనుకున్న కథకి ఆది, మధ్యం, అంతం లేకుండా తోచింది తీసుకుంటూ వెళ్లిపోవడం దీనికి సంబంధించి మరో బలహీనత. ఉన్నపళంగా సినిమాలో ఎక్కడి నుంచైనా ఒక నాలుగైదు సన్నివేశాలు పూర్తిగా తొలగించి చూపించినా కానీ తేడా కనిపెట్టలేనంత బలమైన కథనం రాసుకున్నారు. ఒక స్ట్రక్చర్‌ అంటూ లేని ఈ స్టోరీ గాలివాటంగా ఎటు పడితే అటు పోతుంటుంది. అయితే అక్కడక్కడా కొన్ని కామెడీ దృశ్యాలు పండడం వల్ల ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ టోటల్‌గా వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌ అనిపించదు. బలవంతపు కామెడీ దృశ్యాల కంటే... శౌర్యని తమ వీధిలోని అమ్మాయి ఇంటికి నరేష్‌ తీసుకెళ్లే సీన్‌, శౌర్య తన తల్లిని డబ్బులు డిమాండ్‌ చేసే ముత్తయిదువ అంటూ పరిచయం చేసే సీన్‌లాంటివి బాగా పేలాయి. ఇలాంటివి కూడా లేకపోయినట్టయితే ఈ చిత్రం నాన్‌స్టాప్‌ నాన్సెన్స్‌గా తయారయ్యేది. కథనం సవ్యంగా ఉండి, సదరు నాన్‌స్టాప్‌ సెన్స్‌లెస్‌ డైలాగ్స్‌ని కత్తిరించి, ఎమోషన్స్‌ బాగా పండించినట్టయితే దీని దశ మరోలా ఉండేది. ఫైనల్‌గా అవికా గోర్‌కి ఉన్న బుల్లితెర ఫాలోయింగ్‌ మీదే ఈ చిత్రం లక్ష్మీ కళ ఆధారపడుతుంది. 

బోటమ్‌ లైన్‌: లక్ష్మీ... రాలేం మీ ఇంటికి!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?