రివ్యూ: రారా.. కృష్ణయ్య
రేటింగ్: 2/5
బ్యానర్: ఎస్.వి.కె. సినిమా
తారాగణం: సందీప్ కిషన్, జగపతిబాబు, రెజీనా, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి, రవిబాబు, రాజేష్ తదితరులు
సంగీతం: అచ్చు
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మహేష్ బాబు పి.
విడుదల తేదీ: జులై 4, 2014
రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటించిన ‘తేరే నాల్ లవ్ హో గయా’ అనే హిందీ చిత్రానికి ఫ్రీమేక్ అయిన ఈ చిత్రానికి కథ, కథనం తనదే అని కార్డు వేసుకున్నాడు దర్శకుడు మహేష్‌బాబు. హిందీలో ఆ చిత్రం విజయవంతం కావడానికి రితేష్, జెనీలియాల మధ్య రియల్ లైఫ్ లవ్‌స్టోరీ కూడా ఒక ఫ్యాక్టర్‌గా పని చేసింది. రారా.. కృష్ణయ్య సినిమా విషయంలో అలాంటి ఎక్స్‌టర్నల్ ఎట్రాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి.. ఈ కాపీ కథని వర్కవుట్ చేసే బాధ్యత పూర్తిగా దర్శకుడి మీదే పడింది. కానీ దురదృష్టవశాత్తూ… ఈ డైరెక్టర్ మహేష్‌బాబు ఈ సినిమా పాలిట సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాలేకపోయాడు. ఆదిలోనే చేతులెత్తేసి… ఆడియన్స్‌కి రెండున్నర గంటల పాటు నరకం చూపించాడు.
కథేంటి?
తను క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడి దగ్గరే తను పొదుపు చేసిన డబ్బు దాచుకుంటాడు కిట్టు (సందీప్ కిషన్). సొంతంగా కారు కొనుక్కుందామని అనుకుంటే తన బాస్ తనని మోసం చేస్తాడు. తన డబ్బులెలాగైనా వసూలు చేయాలని వెళ్లిన కిట్టు అనుకోకుండా అతని కూతురు నందీశ్వరిని (రెజీనా) కిడ్నాప్ చేసుకుని తీసుకొస్తాడు. ఇష్టం లేని పెళ్లి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్న నందుకి ఈ కిడ్నాప్ కలిసి వస్తుంది. కిట్టుతో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయిస్తే తాను కూడా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటుంది. ఈ క్రమంలో కిట్టు, నందు ప్రేమలో పడతారు. కానీ జీవితాంతం కిడ్నాపర్ అనే ముద్ర పడిపోతుందనే భయంతో నందుని ఆమె తండ్రికి అప్పగించేద్దామని అనుకుంటాడు కిట్టు. సరిగ్గా ఆ టైమ్‌లోనే నందుని కిడ్నాప్ చేస్తారు జగ్గుభాయ్ (జగపతిబాబు) మనుషులు. అసలు ఈ జగ్గుభాయ్ ఎవరు? నందుని ఎందుకు కిడ్నాప్ చేసాడు?
కళాకారుల పనితీరు:
సందీప్ కిషన్ బాగానే చేసాడు కానీ దీనిని తన భుజాలపై మోసే శక్తి అతనికి లేకపోయింది. ఎంత క్రేజ్ ఉన్న హీరో అయినా కానీ ఇలాంటి కథని నిలబెట్టడానికి ఇబ్బంది పడాలి. ఎమోషనల్ సీన్స్‌లో సందీప్ రాణించాడు. జగపతిబాబు ద్వితీయార్థంలో ఎంటర్ అవుతాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా కానీ జగపతిబాబు కోసం రాసిన సీన్స్ ఆకట్టుకోవు. ఆ క్యారెక్టర్‌ని ఫన్నీగా తీర్చిదిద్దాలని చూసారు కానీ కుదర్లేదు. రెజీనా మరోసారి తన టాలెంట్ చూపించింది. వంక పెట్టలేని విధంగా నటించి మంచి ఈజ్‌తో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి క్యారెక్టర్ రొటీన్ అనిపించింది. తాగుబోతు రమేష్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. బీహార్ కిడ్నాపర్‌గా వేణు, చనిపోయిన తండ్రితో మాట్లాడే పాత్రలో రవిబాబు కాస్త కామెడీ చేసారు. కళ్యాణి, రాజేష్ తదితరులు తమకి ఇచ్చిన పాత్రల్లో చేతనైంది చేసారు.
సాంకేతిక వర్గం పనితీరు:
అచ్చు స్వరపరిచిన బాణీల్లో టైటిల్ సాంగ్ ఒక్కటే వినడానికి ఓకే అనిపిస్తుంది. నేపథ్య సంగీతం బానే ఉంది. టెక్నికల్ క్రూలో సినిమాటోగ్రాఫర్ కూడా బాగానే రాణించాడు. రేపు థియేటర్లలో కత్తిరించుకున్నోళ్లకి కత్తిరించుకున్నంత స్టఫ్ ఫైనల్ కట్‌లో ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
దర్శకుడు మహేష్‌బాబు హిందీ సినిమా కథకి చేసిన మార్పు చేర్పులు చాలా తక్కువ. ఆ మాత్రం మార్పులు చేసి ఇది కాపీ అని ఎవరూ కనిపెట్టరని అనుకున్నాడేమో కానీ ‘తేరే నాల్..’ చూసిన వారికి ఇది ఎక్కడ్నుంచి కాపీ చేసారనేది కనుక్కోవడానికి ఆట్టే టైమ్ పట్టదు. కాపీ కొట్టడం మాట అటుంచితే దీనిని ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా మొత్తమ్మీద ద్వితీయార్థం ఆరంభంలో కాస్త వినోదం పండించగలిగాడు. మిగతాదంతా భరించలేనంత నస.
హైలైట్స్:
- రెజీనా పర్‌ఫార్మెన్స్
డ్రాబ్యాక్స్:
- స్క్రీన్‌ప్లే
- సాంగ్స్
- డైరెక్షన్
విశ్లేషణ:
సినిమా మొదలైన దగ్గర్నుంచి కాసేపట్లో ఆసక్తికరంగా మారుతుందేమో అనుకుంటూ వేచి చూడడంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. చెన్నయ్ నుంచి కేరళకి షిఫ్ట్ అయినా… మధ్యలో ఛేజింగులు గట్రా జరిగినా.. ఎక్కడా కృష్ణయ్య ఆకట్టుకోడు సరికదా బాగా బోరు కొట్టిస్తాడు. ఏదో ఒక పాయింట్‌లో కృష్ణయ్య అలరిస్తాడని కూర్చుంటే.. ఇంటర్వెల్ ఇచ్చేస్తారు కానీ కృష్ణయ్య అల్లరి మొదలు కాదు.
జగపతిబాబు కథలోకి ప్రవేశించాక ఏమైనా మార్పు ఉంటుందనే ఆశ పుడుతుంది. కిడ్నాపింగ్ వంశ వృత్తిగా గడిపే జగపతిబాబు పరిచయ సన్నివేశాలు, ఫెయిల్డ్ కిడ్నాపర్‌గా రవిబాబు కామెడీ సంభాషణలతో కృష్ణయ్య గాడిన పడుతున్నాడని అనుకునేలోపే మళ్లీ నాన్‌స్టాప్ నస స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ లవ్‌ని యాక్సెప్ట్ చేయడానికి హీరోకున్న కాన్‌ఫ్లిక్ట్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ పుట్టించలేకపోతుంది. నెక్స్‌ట్ సీన్‌లో ఏమి జరుగుతుందనేది ముందే తెలిసిపోతూ (దీనికి ఒరిజినల్ చూసి ఉండాల్సిన అవసరం లేదు) రోలింగ్ టైటిల్స్ కోసం డెస్పరేట్‌గా ఎదురు చూసేట్టు చేస్తుంది.
మరో గంట సినిమా బ్యాలెన్స్ ఉందనగా మొదలయ్యే టార్చర్ చివరి వరకు నాన్‌స్టాప్‌గా సాగిపోవడంతో కృష్ణయ్యతో హారిబుల్ ఎక్స్‌పీరియన్స్ మిగులుతుంది. మంచి కథలు ఎంచుకుని చేసే సందీప్ కిషన్ ఈసారి కమర్షియల్ అంశాలపై మోజు పడ్డాడో ఏమో కానీ తన కెరీర్‌లో వెయ్యకూడని టైమ్‌లో రాంగ్ స్టెప్ వేసాడు. లెజెండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు సినిమాలో ఉన్నా కేర్ చేయని పూర్వపు పొజిషన్‌కి చేరిపోవడానికి ఇలాంటి పాత్రలో రెండు చాలు.
మేటర్ లేకుండా రెండున్నర గంటల పాటు సినిమాని నడిపించడం ఎలాగో తెలుసుకోవడానికి మినహా ఈ కృష్ణయ్య మరే విధమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి పనికి రాడు. రారా అని పిలిచాడని థియేటర్లోకి వెళ్లినా… ఎందుకొచ్చాంరా దేవుడోయ్ అని పరుగందుకునేట్టు చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోని ఈ కృష్ణయ్య ఎంత కాలం థియేటర్లలో కొలువుదీరతాడో చూడాలి. రెండవ వారానికల్లా పోరా కృష్ణయ్య అని తిప్పి పంపించకపోతే ఈ కృష్ణుడు చాలా అఛీవ్ చేసినట్టే అనుకోవాలి.
బోటమ్ లైన్: కష్టంరా కృష్ణయ్య!
-జి.కె.