పవన్‌కళ్యాణ్‌ని జనం రాళ్ళతో కొడతారంటూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత పిడమర్తి రవి అంటున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతుగా పవన్ ప్రచారం చేయడం తగదన్నది పిడమర్తి రవి వాదన. ఇప్పటికే తెలంగాణ ప్రజలు పవన్‌కి బుద్ధి చెప్పారని పిడమర్తి రవి చెబుతున్నారు. అసలు బీజేపీ తమ ప్రత్యర్థే కాదని అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ చెబుతున్నప్పుడు.. బీజేపీ విషయంలోనూ, పవన్ విషయంలోనూ టీఆర్‌ఎస్ కనుసన్నల్లో పనిచేస్తోన్న ఓయూ జేఏసీ గుస్సా అవడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు.
ఇక, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా పవన్‌పై గుస్సా అయ్యారు. పవన్‌కి ఇప్పటికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని కవిత ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసినా, టీడీపీ – బీజేపీకి తెలంగాణలో ఒరిగిందేమీ లేదని కవిత వ్యాఖ్యానించడం.. ఆ వెంటనే ఓయూ జేఏసీ పవన్ మీద ఫైర్ అవడం విశేషమే మరి.
మెదక్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా పవన్ పెదవి విప్పలేదు. జగ్గారెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టం.. అని మాత్రం పవన్ గతంలో.. అంటే 2014 ఎన్నికల తర్వాత వ్యాఖ్యానించారు. అప్పటికి జగ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే వున్నారు. ఆయనిప్పుడు బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు కూడా. ఇక, పవన్ ప్రచారం విషయమై బీజేపీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మరీ ఈలోగానే టీఆర్‌ఎస్ ఎందుకు తొందరపడ్తున్నట్టు.? ఏమో మరి.. ఆ పార్టీకే తెలియాలి.