ఎమ్బీయస్‌: గుబులు పుట్టిస్తున్న లలిత్‌గీతం

దేశంలోని రాజకీయనాయకులందరూ యిప్పుడు 'లలితగీతం' వినడానికి బెదురుతున్నారు. లలిత్‌ మోదీ ఎప్పుడు ఏం ట్వీట్‌ చేస్తాడోనని భయపడుతున్నారు. అతనికి అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. ఇంతమంది వుండి కూడా తనకు ఎవరూ ఏమీ…

దేశంలోని రాజకీయనాయకులందరూ యిప్పుడు 'లలితగీతం' వినడానికి బెదురుతున్నారు. లలిత్‌ మోదీ ఎప్పుడు ఏం ట్వీట్‌ చేస్తాడోనని భయపడుతున్నారు. అతనికి అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. ఇంతమంది వుండి కూడా తనకు ఎవరూ ఏమీ చేయటం లేదన్న లేదా కావలసినంత చేయటం లేదన్న ఉక్రోషంతో వున్నాడతను. తనంతట తనే అనేక విషయాలు బయటపెడుతున్నాడు. ఎప్పుడేం బయటకు వస్తుందో, వస్తే ఎలా సమాధానం చెప్పుకోవాలో అని అందరూ గుబులుగా వున్నారు. 2.8 బిలియన్‌ డాలర్ల మోదీ ఎంటర్‌ప్రైజెస్‌కు అతను చైర్మన్‌. క్రికెట్‌ ద్వారా అనేక సక్రమ, అక్రమ వ్యాపారాలు నడిపి స్టార్‌లా వెలిగిన లలిత్‌ మోదీ సునంద పుష్కర్‌తో వచ్చిన తగాదా వలన ఆవేశానికి లోనై యింతవరకు తెచ్చుకున్నాడు. 

ఒక టైములో అతను చాలా పొగరుగా వుండేవాడు. 2009లో ఐపియల్‌ సెకండ్‌ సీజన్‌ షెడ్యూల్‌ గురించి యుపిఏ ప్రభుత్వంతో మాట్లాడడానికి యిద్దరు బిసిసిఐ అధికార్లను, ఒక కాంగ్రెసు నాయకుణ్ని వెంట పెట్టుకుని హోం సెక్రటరీ మధుకర్‌ గుప్తాతో మాట్లాడడానికి వెళ్లాడు. ''మీరు షెడ్యూల్‌ మార్చుకోండి, ఆ సమయంలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి'' అన్నారు గుప్తా. ''కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోండి, అవి లేకపోయినా ఏమీ కాదు. ఐపియల్‌కు మాత్రం ఏ అవాంతరం రానీయకండి'' అన్నాడు లలిత్‌ పెద్ద పోజుగా. అలాటివాణ్ని కోచీ ఫ్రాంచైజీలో అవతలకి పొమ్మనమని సునంద సన్నిహితులు అనడంతో కినిసి కోచీ ఫ్రాంచైజీ గురించి 2010 ఏప్రిల్‌లో ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత శశి థరూర్‌కు ఉద్వాసన జరిగింది. తీగ లాగితే డొంక కదిలింది. ఏప్రిల్‌ – మేలో ఐపిఎల్‌లో జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 

దాంతో తన ప్రాణానికి ముప్పు వుందని ఆరోపించి లలిత్‌ దేశం విడిచి పారిపోయాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) రంగంలోకి దిగి బిసిసిఐకు విదేశీ విరాళాలు ఎలా వచ్చాయో చెప్పమని నోటీసులు యిచ్చింది. అందరూ లలిత్‌పైకి నెట్టేశారు. అతనే అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు అని చెప్పి తప్పించుకున్నారు. లలిత్‌పైన అనేక ప్రభుత్వ ఏజన్సీలు మనీ లాండరింగ్‌ (నల్ల ధనాన్ని సక్రమంగా చేసే ప్రక్రియ)తో సహా రెండు డజన్లకు పైగా కేసులు మోపాయి. ఇడి రూ.1600 కోట్ల మేరకు 16 కేసులు పెట్టి 2010లో అతనిపై ''లుక్‌ ఔట్‌'' నోటీసు యిచ్చింది. అయినా అతను బ్రిటనులోనే నివాసముంటూ స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో అక్కడే కొనసాగాడు. అక్కణ్నుంచే బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై, యింకా అనేకమందిపై యుద్ధం చేస్తూ వున్నాడు. లండన్‌కు వచ్చిన పోలీసు అధికారులను, భారత రాజకీయ నాయకులను కలుస్తూనే వున్నాడు. విందులు, విలాసాలు కొనసాగుతూనే వున్నాయి. సుష్మ, వసుంధరల సహాయంతో 2014 సెప్టెంబరులో ట్రావెల్‌ డాక్యుమెంట్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి లలిత్‌ సోషల్‌ మీడియాలో అతి చురుగ్గా వున్నాడు. తను హాజరవుతున్న ఫంక్షన్లవి, ఫ్యామిలీ హాలిడేస్‌వి, యూరోప్‌లో తిరుగాడిన ప్రదేశాలవి ఫోటోలు తెగ అప్‌లోడ్‌ చేస్తున్నాడు.

2011లో అతని పాస్‌పోర్టు రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ పెట్టుకున్నాడు. సుష్మా స్వరాజ్‌ కూతురు బాన్సురీ అతని తరఫున వాదించింది. అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఏడాది క్రితం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 ఆగస్టులో మళ్లీ అభ్యర్థన పంపుకున్నాడు. అదే కోర్టు, అదే లాయరు, వేరే బెంచ్‌, యీసారి మాత్రం పాస్‌పోర్టు పునరుద్ధరించేశారు. కోర్టులో వున్న ఇడీ అధికారులు నోరిప్పి అభ్యంతరం తెలపలేదు. లలిత్‌ భార్యకు కాన్సర్‌ వ్యాధి. పోర్చుగల్‌లో ఆసుపత్రిలో వైద్యం. అక్కడకు వెళ్లాలనుకున్నాడు. వెళ్లాలంటే బ్రిటన్‌ అనుమతించి వీసా యివ్వాలి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సాయం అడిగాడు. కాదనలేక పోయింది. సుష్మ భర్త స్వరాజ్‌ కౌశల్‌ లలిత్‌కు యిరవై ఏళ్లగా లాయరు. ప్రస్తుతం కూతురు కూడా లలిత్‌ తరఫున వాదిస్తోంది. 2014 ఆగస్టులో స్వరాజ్‌ కౌశల్‌ మేనల్లుడికి ఇంగ్లండులోని ససెక్స్‌ యూనివర్శిటీలో సీటు కావలసి వచ్చినపుడు లలిత్‌ను అడిగితే అతను బ్రిటన్‌ లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌ వాజ్‌కు చెప్పి సీటు యిప్పించాడు. ఇన్ని మొహమాటాలున్నపుడు సుష్మ ఎలా కాదనగలదు? బ్రిటిష్‌ హై కమిషనర్‌కు 'లలిత్‌ అభ్యర్థనను మీరు బ్రిటిష్‌ నియమాలకు అనుగుణంగానే పరిశీలించండి. ఒకవేళ మీరు అతనికి వీసా యిచ్చినా మన యిరుదేశాల సంబంధాలు చెడిపోవు' అని లేఖ రాసి పంపింది. మరో పక్క కీత్‌ వాజ్‌ యుకె వీసా డైరక్టర్‌ జనరల్‌కు లలిత్‌ మోదీ ట్రావెల్‌ పేపర్లను త్వరగా యిప్పించమని అభ్యర్థిస్తూ లేఖ రాశాడు. తన లేఖ గురించి సుష్మ కాబినెట్‌ సహచరులతో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు బయటపడ్డాక 'మానవతా దృక్పథంతో చేశా' అని చెప్పుకుంటోంది. గట్టిగా నిలదీస్తే కోర్టు అతని పాస్‌పోర్టు పునరుద్ధరించిందిగా అని వాదిస్తుంది. కోర్టు పాస్‌పోర్టు మళ్లీ యిచ్చింది కానీ వేరే దేశాలకు వెళ్లడానికి వీసా సిఫార్సు చేయమని చెప్పలేదుగా. 

సుష్మతో లలిత్‌కు స్నేహబాంధవ్యం అలాగే వున్నా వసుంధరా రాజేతో బెడిసికొట్టినట్టుంది. దశాబ్దాలుగా వారు మిత్రులు, వసుంధర కొడుకు దుష్యంత్‌ కంపెనీకి లలిత్‌ మారిషస్‌ కంపెనీ ద్వారా పెట్టుబడులు కూడా సంపాదించి పెట్టాడు. అందుకే వసుంధర లలిత్‌ ఇమ్మిగ్రేషన్‌ అప్లికేషన్‌ సపోర్టింగ్‌ డాక్యుమెంట్లపై సంతకం పెట్టింది.  తను చేసే పని సక్రమమైనది కాదని తెలుసు కాబట్టి యిలా పెట్టిన విషయం భారత అధికార్లకు చెప్పకూడదు అనే షరతు విధించింది. 2013 డిసెంబర్లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యక్షంగా వెళ్లడం కుదరలేదు – తనేం చేసినా అందరూ గమనిస్తారని తెలుసు. అయినా తను ముఖ్యమంత్రి అయ్యాక  లలిత్‌ భార్యకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం రాజస్థాన్‌లో ఒక ఆసుపత్రి పెట్టడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకుంది. ఆ టెర్మ్‌స్‌ బయటకు వస్తే లలిత్‌ ప్రయోజనాలు కాపాడడానికి రాజస్థాన్‌ ఎంత భూమి అప్పగిస్తోందో తెలుస్తుంది. ఇంత చేసినా లలిత్‌ వసుంధర పై అలక పూనాడు. అతనికి మళ్లీ క్రికెట్‌లో ఒక వెలుగు వెలగాలని ఆశ. వసుంధర ముఖ్యమంత్రి కాగానే రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి పోటీ పడ్డాడు. మనిషి యిక్కడ లేకపోయినా  యిన్‌ఆబ్సెన్షియా గెలిచేశాడు. అయితే బిసిసిఐలోని లలిత్‌ శత్రువులు యీ ఎన్నికను గుర్తించడానికి నిరాకరించి, రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను సస్పెండ్‌ చేశారు.  రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి వున్నా తన కింత అన్యాయం జరుగుతూంటే వసుంధర ఏమీ చేయకుండా వుందని లలిత్‌కు ఒళ్లు మండిపోయింది. అందుకే వసుంధరను దీనిలోకి తనే లాగాడు. 'నేను పోర్చుగల్‌ వెళ్లలేదు' అని ఆమె అంటూ వుంటే 'అబ్బే నా భార్య చికిత్స జరుగుతూంటే ఆమె నాతో పాటు పక్కనే వుంది' అంటాడు లలిత్‌. ఎవరి మాట నిజమో కొన్నాళ్లకు కానీ తెలియదు. 

అసలు యిదంతా బయటకు ఎలా వచ్చింది? ఒక కథనం ప్రకారం – బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లలిత్‌ పాస్‌పోర్టు పునరుద్ధరింపబడడంతో అతను ఏ క్షణాన్నైనా దేశానికి తిరిగి వచ్చి తమ పని పడతాడని బిసిసిఐలో లలిత్‌ శత్రువులకు, క్రికెట్‌ వ్యాపారంలో ఆసక్తి కలిగిన ఒక కేంద్రమంత్రికి భయం పట్టుకుంది. వాళ్లు ఒక ఇజ్రాయేల్‌ గూఢచారి సంస్థను నియమించి, లలిత్‌ ఈమెయిల్‌ను హ్యేక్‌ చేయించారు. దాంట్లో కీత్‌ వాజ్‌ ద్వారా యితను పోర్చుగల్‌ వీసా సంపాదించడం వగైరా బయటకు వచ్చాయి. ఆ సమాచారాన్ని లలిత్‌కు గతవిరోధాలున్న ముర్దోక్‌ బ్రిటన్‌నుంచి వెలువరించే ''సండే టైమ్స్‌'' పత్రికకు రహస్యంగా అందించారు. భారతదేశం నేరస్తుడిగా పరిగణిస్తున్న వ్యక్తికి కీత్‌ వాజ్‌ ఎలా సాయపడుతున్నాడో చూడండి అంటూ జూన్‌ 7 న ఆ కథనం వెలువడింది. అయితే క్రికెట్‌ బాల్‌ లాగే అది మధ్యలో స్పిన్‌ తిరిగి, భారతీయ రాజకీయ నాయకులకు తగిలింది. లలిత్‌ మౌనంగా వున్నా పోయేది. కానీ అతనే అన్నీ బయటపెట్టసాగాడు. సుష్మా భర్త, కూతురు తన లాయర్లని, ఫ్యామిలీ ఫ్రెండ్సనీ, శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, రాజీవ్‌ శుక్లా – యిలా అన్ని పార్టీల వాళ్లూ తనకు స్నేహితులేననీ, చిదంబరం ఒక్కడే తనపై పగబట్టాడనీ యింటర్వ్యూ యిచ్చి చెప్పాడు, ట్వీట్లు చేస్తున్నాడు. 

లలిత్‌ వ్యవహారంపై నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారన్నదే కుతూహలం కలిగిస్తోంది. వసుంధర రాజే మోదీ గ్రూపు మనిషి కాదు. ఎంపీగా వున్న తన కొడుకు దుష్యంత్‌కు మంత్రిపదవి యివ్వనందుకు ఆమెకు కోపం వచ్చిందని కూడా వినికిడి. ఇప్పుడు ఆమెను రక్షించడానికి మోదీ ప్రయత్నించకపోవచ్చని అంటున్నారు. అమిత్‌ షా కూడా ఆమె పట్ల సానుభూతి చూపటం లేదు. ఆమె ఢిల్లీ పర్యటనలు కూడా రద్దవుతున్నాయి. ఆమెను పదవి నుంచి తప్పించకపోవచ్చు కానీ, ఆమెను వెనకేసుకుని వచ్చే పని కూడా చేయకపోవచ్చు. ఆరెస్సెస్‌ కూడా ఆమెను సమర్థించటం లేదట. లలిత్‌ మోదీ రాజకీయబాధితుడని, అతను యిమిగ్రేషన్‌ను నేను సమర్థిస్తున్నానని 2011 ఆగస్టు 18 న రాజస్థాన్‌ ప్రతిపక్ష నాయకురాలుగా వుండే రోజుల్లో వసుంధర సంతకం పెట్టిన డాక్యుమెంటును కాంగ్రెసు బయటపెట్టాక ఎవరు సమర్థించాలన్నా కష్టమే!  ఇక సుష్మ. ఒకప్పుడు ఆమె మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన మాట వాస్తవమే. కానీ మోదీ బలపడుతున్నకొద్దీ అతని నాయకత్వాన్ని ఆమె అంగీకరించింది. తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూన్న కొద్దిమంది మంత్రులలో ఆమె ఒకరు. మోదీ విదేశీ పర్యటనలు విపరీతంగా చేస్తూ ఖ్యాతి తెచ్చుకుంటున్నా ఏమీ అనకుండా, నేపథ్యంలోనే వుండి సహకరిస్తూ మోదీ సానుభూతి గెలుచుకుంది. పైగా సుష్మను ఆరెస్సెస్‌ నాయకులు యిప్పటికే సమర్థించారు. అందువలన సుష్మపై ఏ చర్యా వుండదని అనుకుంటున్నారు. 'మానవత్వం వలన యిచ్చామంటున్నారు, రేపు దావూద్‌ ఇబ్రహీంకు కూడా యిలాటి పరిస్థితుల్లో యిస్తారా?' 'ఇది బయటపడేవరకూ మౌనంగా వుండడమేమిటి?' 'హోం శాఖకు చెప్పకుండా మీరే నిర్ణయం తీసుకోవడ మేమిటి?' లాటి ప్రశ్నలు ప్రతిపక్షాలు ఎన్నయినా వేయవచ్చు. కానీ సుష్మకు ఏమీ కాదనే ప్రస్తుతానికి అనిపిస్తోంది. 

సుష్మకే కాదు, లలిత్‌కు కూడా అంతిమంగా ఏమీ కాకపోవచ్చు. అధికారంలో వున్నది యుపిఏ కానీ, ఎన్‌డిఏ కానీ, వాటి డిఎన్‌ఏ ఒకటే – డబ్బున్న నేరస్తులను చట్టం నుంచి కాపాడడం! ఆ విషయాన్ని లలిత్‌ చాటి చెపుతున్నాడు. సుష్మ, వసుంధరలతో వదలలేదు. ఒక్కోరి పేరు బయట పెడుతున్నాడు. రాష్ట్రపతి ప్రణబ్‌ సెక్రటరీ అమితా పాల్‌కు దేశంలోనే అతి పెద్ద హవాలా వ్యాపారి వివేక్‌ నాగ్‌పాల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయన్నాడు. స్విస్‌లో ఓ పెద్ద బ్యాంకుకు ఎండీగా వున్నాయన భార్య మన దేశంలో మనీ లాండరింగ్‌ వ్యవహారాల యిన్‌చార్జిగా పని చేస్తున్నారన్నాడు. ఒకప్పటి విలేకరి రాజీవ్‌ శుక్లా యిప్పుడిన్ని కోట్లు ఎలా గడించాడని అడిగాడు. బిసిసిఐ మాఫియాను బద్దలు కొడతానన్నాడు. 'మీ అంతట మీరే బయటకు వస్తారా, లేక నన్ను చెప్పమంటారా?' అని ఛాలెంజ్‌ చేస్తున్నాడు. అతనిచ్చిన వూపుతో కాబోలు బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్‌ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లేకి చెందిన క్రికెట్‌ క్లబ్‌పై ఆరోపణలు గుప్పించాడు. తప్పుడు డిగ్రీ ఆరోపణలతో తమ మంత్రిని అరెస్టు చేయించిన కేంద్రప్రభుత్వంపై యిప్పుడు ఆప్‌ తిరగబడింది – స్మృతి ఇరానీ డిగ్రీపై కూడా విచారణ జరుగబోతోంది కాబట్టి అలాటి చర్య తీసుకుంటారా? అని అడుగుతోంది. స్వచ్ఛపాలనపై లెక్చర్లు దంచిన మోదీ వీటిపై మాట్లాడరేమి అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇలాటి సందర్భాల్లో మౌనం పాటించి మన్‌మోహన్‌ సింగ్‌ మౌనమోహన్‌ సింగ్‌గా పేరు ఎలా తెచ్చుకున్నారో చూశాం. ఇప్పుడు నరేంద్రుడు మూకేంద్రుడు (మూగకు సంస్కృతం – మూక) అవుతున్నాడు.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015) 

[email protected]