ఎమ్బీయస్‌ : గురుద్వారా ద్వారా రాజకీయాలు

శిఖ్కులకు మతవిషయాలలో మార్గదర్శకత్వం వహించడానికి శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జిపిసి) ఏర్పడింది. దాని ఆదేశాలను ప్రపంచంలోని శిఖ్కులందరూ మన్నిస్తారు. కొంతకాలానికి అది రాజకీయాలను కూడా నిర్దేశించసాగింది. శిఖ్కుల ప్రయోజనాలు కాపాడడానికి అంటూ శిరోమణి…

శిఖ్కులకు మతవిషయాలలో మార్గదర్శకత్వం వహించడానికి శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జిపిసి) ఏర్పడింది. దాని ఆదేశాలను ప్రపంచంలోని శిఖ్కులందరూ మన్నిస్తారు. కొంతకాలానికి అది రాజకీయాలను కూడా నిర్దేశించసాగింది. శిఖ్కుల ప్రయోజనాలు కాపాడడానికి అంటూ శిరోమణి అకాలీ దళ్‌ అనే పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ కొన్నాళ్లకు అధికారంలోకి రావడంతో, కొన్నాళ్లు పోయేసరికి కమిటీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, కమిటీ ఎన్నికలలో తమకు అనుకూలమైనవారు నెగ్గేట్లు చూసుకోవడం మొదలైంది. రాజకీయాలకు, మతానికి సంబంధం లేదంటున్నా, 1996లో అకాలీ దళ్‌ తాము శిఖ్కులకే కాక యితర మతస్థుల కోసం కూడా పాటుపడే సెక్యులర్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అని ప్రకటించుకున్నా, కమిటీలో యిప్పటికే అకాలీ దళ్‌ పార్టీవారిదే పై చేయి. అకాలీ దళ్‌కు సొంత రాజకీయ ప్రయోజనాలున్నాయి. వారు కాంగ్రెసు వ్యతిరేకులు. బిజెపికి అనుకూలురు. వివిధ నగరాలలో వున్న గురుద్వారాలలో తమ వారిని నియమించుకుని, వారి చేత స్థానికంగా వున్న శిఖ్కులను తమకు అనుకూలంగా ఓటు వేయమని ప్రచారం చేయించుకుంటూ వుంటారు. కితం ఏడాది ఢిల్లీలో వున్న గురుద్వారాలో కమిటీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసుకు అనుకూలంగా వుండే ఓ ప్యానెల్‌, అకాలీ దళ్‌కు అనుకూలంగా వుండే మరో ప్యానెల్‌ పోటీ పడ్డాయి. అకాలీ దళ్‌ ప్యానెల్‌ నెగ్గింది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి ఓటేయమని గురుద్వారా ద్వారా శిఖ్కులకు ప్రచారం చేసింది. ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఇది చూసి హరియాణా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హూడాకు గుబులు పుట్టింది.

హరియాణాలో శిఖ్కులలో కొందరు కాంగ్రెసు మద్దతుదారులు. మరి కొందరు ఓం ప్రకాశ్‌ చౌటాలాకు చెందిన లోకదళ్‌ సమర్థకులు. అకాలీ దళ్‌ ఎస్‌జిపిసి ద్వారా హరియాణాలోని గురుద్వారాలను కైవసం చేసుకుని, వాటి ద్వారా అక్టోబరులో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో లోకదళ్‌ పార్టీకి అనుకూలంగా ఓట్లేయిస్తుందని భూపేందర్‌ భయం. దీన్ని నివారించాలంటే ఏకైక మార్గం – ఎస్‌జిపిసిపై అకాలీదళ్‌ పట్టు తగ్గించడం. అది సాధ్యం కావడం లేదు కాబట్టి ఎస్‌జిపిసి నుండి హరియాణాను విడిగా చీల్చడం. దానికి అతను వాడిన ఆయుధం – ప్రాంతీయతా వాదం. ఎస్‌జిపిసి హరియాణా గురుద్వారాల నుండి ఏటా దాదాపు రూ. 170 కోట్లు వసూలు చేసిన అదంతా పంజాబ్‌లోనే ఖర్చు పెడుతోందని, హరియాణాలో ఖర్చు పెట్టడం లేదని వెలుగులోకి తెచ్చాడు. ఎస్‌జిపిసి హరియాణాలో నడిపే విద్యాసంస్థల్లో, మతపరమైన సంస్థల్లో హరియాణావారికి ఉద్యోగాలు యివ్వడం లేదని, పంజాబీలకే యిస్తోందని కూడా ఆరోపణలున్నాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రయోజనాలకై ఎస్‌జిపిసి పనిచేస్తోందని, షాహాబాద్‌ (హరియాణా)లో తాము పెట్టిన మిరి పిరి ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌ను బాదల్‌ ఆధ్వర్యంలోని ట్రస్టుకు ఎందుకు అప్పగించడమే దీనికి ఉదాహరణ అనీ హరియాణా మంత్రి ఆరోపించాడు. 

ఇవన్నీ హరియాణా శిఖ్కులపై ప్రభావం చూపాయి. తమకంటూ వేరే గురుద్వారా కమిటీ ఏర్పడాలని భావించారు. నిజానికి హూడా దీనిపై ఎప్పణ్నుంచో కృషి చేస్తున్నాడు. 2005 ఎన్నికల మానిఫెస్టోలో దీన్ని ఒక హామీగా చేర్చాడు. 2007లో తన ఫైనాన్సు మినిస్టర్‌ ఎచ్‌ ఎస్‌ ఛట్టాతో ఒక ప్యానెల్‌ ఏర్పరచాడు. ''తమకు వేరే కమిటీ కావాలని రెండు లక్షలమంది హరియాణా శిఖ్కులు నాకు విజ్ఞాపనలు పంపారు.'' అంటూ ఛట్టా ప్రకటించి అలాటి కమిటీ వెంటనే వేయాలని ప్రభుత్వానికి సూచించాడు. అయితే కాంగ్రెసుకే చెందిన ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ స్వయంగా శిఖ్కు కావడం, ఎస్‌జిపిసి యిలా విడిపోయి బలహీనపడడం ఆయనకు రుచించకపోవడంతో అది ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆయన దిగిపోయాడు. హరియాణా ఎన్నికలలో అకాలీ దళ్‌ సాయంతో లోకదళ్‌ శిఖ్కు ఓట్లు పొందకుండా చూడాల్సిన అవసరం వుంది. అందుకని  హరియాణా ఎస్‌జిపిసిను జులై మొదటివారంలో ఏర్పాటు చేసి తర్వాతి వారంలో అసెంబ్లీలో హరియాణా శిఖ్క్‌ గురుద్వారా (మేనేజ్‌మెంట్‌) బిల్లు పాస్‌ చేసేశారు. 

ఇలా జరక్కుండా చూడాలని ఎస్‌జిపిసి అధ్యకక్షుడు అవతార్‌ సింగ్‌ మక్కర్‌ అకాలీ దళ్‌ ద్వారా చాలా ప్రయత్నించాడు. ఆయన అనుచరుడు హరియాణా శిఖ్కు నాయకులను చర్చలకు ఆహ్వానించినపుడు వాళ్లు వెళ్లలేదు. అలా నిరాకరించడం ద్వారా అకాల్‌ తఖ్త్‌ను అవమానించారని వీళ్లు నిందలు మోపారు. అప్పుడు ఓ కమిటీ వేసి హరియాణాలోని కురుక్షేత్రకు పంపారు. అక్కడ హరియాణా శిఖ్కులు వాళ్లని పంజాబ్‌కి, అకాలీ దళ్‌కు కొమ్ము కాస్తున్నారని తిట్టిపోశారు. ఇక లాభం లేదని పంజాబ్‌ ప్రభుత్వం తన మిత్రపక్షమైన బిజెపి ద్వారా కేంద్రంలోని హోం మంత్రికి చెప్పి హరియాణా ప్రభుత్వాన్ని ఆపాలని చూసింది. కానీ పంజాబ్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శిఖ్కుల్లో అభ్యుదయ వర్గాలైన దళ్‌ ఖాల్సా వంటి సంస్థలు హరియాణాకు విడిగా ఎస్‌జిపిసి వుండటంలో నష్టం లేదని వాదించాయి. అప్పుడు ఎస్‌జిపిసి అధ్యకక్షుడు అవతార్‌ సింగ్‌ హరియాణా గురుద్వారాల నిర్వహణకై ఒక సబ్‌ కమిటీ నియమిస్తున్నానని ప్రకటించాడు. కానీ దాని వలన లాభం లేకపోయింది. కొన్ని గంటలు తిరక్కుండానే హరియాణా అసెంబ్లీ యీ బిల్లు పాస్‌ చేసేసింది. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]