హీరో సచిన్ జోషికి, నిర్మాత బండ్లగణేష్ కు మధ్య ఏదో జరుగుతోందంటూ వస్తున్న వార్తల వెనుక కాస్త ఆసక్తికరమైన విషయమే వుందనిపిస్తోంది. సచిన్ తనకు ఓ సినిమా తీసిపెట్టమని ఆషికి 2 రీమేక్ కోసం కొందరు నిర్మాతలను సంప్రదించినట్లు తెలిసింది. ఆఖరికి ఆ డీల్ బండ్ల గణేష్ దగ్గరకు వచ్చింది. ఆయన సరే అన్నారు.
పెట్టుబడి సచిన్ ది, బ్యానర్ బండ్లది. సరే, దానికి సంబంధించి లావాదేవీలు ఎప్పుడో పూర్తయిపోయాయి. వాస్తవానికి నీజతగా నేనుండాలి సినిమా జనాన్ని ఆకట్టుకోలేదు. దానికి వచ్చిన ఆదాయం, థియేటర్ ఖర్చులు సరిపోయినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.
అయితే సచిన్ కు ఈ విషయంలో ఎవరో కావాలని రాంగ్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చారని వినికిడి. సినిమా బాగానే ఆడిందని, కాస్త ఆదాయం వచ్చిందన్నది ఆ సమాచారం. దాన్ని నమ్మిన సచిన్ ఈ విషయమై బండ్లను అడిగినట్లు, ఆయన క్లారిఫై చేసినట్లు తెలుస్తోంది. అయితే దీంతో ఎన్ని కథలు పుట్టాలో అన్నీ పుట్టేసాయి.
నాకు ఇదొక్కటే వ్యాపారం కాదు
ఈ విషయమై బండ్లను ప్రశ్నిస్తే, తనకు సినిమా ఒక్కటే వ్యాపారం కాదని, ఇంకా చాలా వ్యాపారాలున్నాయని, తను ఎదుగుదల కిట్టని వారు తరచు తనపై ఏదో ఒకటి పుట్టిస్తూ వుంటే తాను సమాధానాలు ఇచ్చుకుంటూ పోవాలా అని ప్రశ్నించారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ టైపు వ్యవహారాలన్నారు.
ఇప్పటి వరకు రవితేజ నుంచి ఎన్టీఆర్ వరకు అందరితో సినిమాలు తీసానని, మహేష్ మినహా అందరూ తన సినిమాల్లో నటించారని, తనకు ఓ స్టేచర్ వుందని, వంద కోట్ల టర్నోవర్ వుందని, కానీ తనపై వచ్చేవదంతులు వస్తూనే వున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
గోవిందుడు సినిమా సమయంలో కూడా ఎన్ని పుకార్లు పుట్టించాలో అన్నీ పుట్టించారని, సినిమా విజయవంతంగా అనుకున్న తేదీకి విడుదల చేసానని, ఇప్పుడు టెంపర్ కూడా త్వరలో పూర్తి చేసి, ఫిబ్రవరిలో విడుదల చేసి, హిట్ కొట్టి చూపిస్తానని అన్నారు.