మప్లర్ మెడకు చుట్టుకున్న ఆ అబ్బాయి సోఫాలో కూచున్న ఆ అమ్మాయి కేసి మళ్ళీ చూపుసారించాడు. ఆమె ఓ రుమాలు కేసి అతి దీర్ఘంగా చూస్తోంది. జన్మలో అదే మొదటిసారి రుమాలు చూసినట్టు దాని అంచులను, ఆ రుమాలు మీద డిజైన్‌ను, తెగ స్టడీ చేసేస్తోంది. అతను గొంతు సవరించుకున్నాడు, అవసరం లేకుండానే. ఆ కార్యక్రమం కూడా సవ్యంగా సాగినట్టు లేదు. అతను మాట్లాడినప్పుడు మాటలు సగం వినబడలేదు. వినబడినంత వరకూ….
''చాక్లెట్ కావాలా''
''అక్కర్లేదు, కానీ అడిగినందుకు థాంక్స్'' అందామె.
''సారీ, నా దగ్గర ఇదే బ్రాండ్‌ది ఉంది. నీ దగ్గర వేరేది ఉందా?''
''ఉందేమో, తెలీదు. అయినా థ్యాంక్స్''
''నీ దగ్గర లేదేమో, వెళ్ళి పట్టుకురానా..? వీధి చివరే షాపు, ఐదు నిమిషాలు పట్టదు.''
''థ్యాంక్యూ, నీకంత శ్రమ ఇవ్వడం నా కిష్టం లేదు. ఎనీ వే, నా గురించి ఇంత ఆలోచించినందుకు థ్యాంక్స్''.
''ఆ థాంక్యూలు కాస్త అపుతావా. దణ్ణం పెడతాను.''
''ఏం, అంత బాధగా ఉన్నాయా, సారీ నీ మనస్సు నొప్పించానని తెలియదు. మనసు బాధపడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా వల్ల నీకు కష్టం తోస్తే అది నా పొరబాటే. ఎవరికైనా థాంక్స్ చెప్పడం తప్పని నాకు తెలియదు. ఇంతకుముందు ఎవరూ నన్ను థాంక్స్ చెప్పినందుకు గాను తిట్టలేదు. అందువల్ల….''
''నేను తిట్టానా?''
''ఓహో తిట్టలేదా.., తెలియలేదులే''.
''మహాప్రభో, బయటకు వెళ్ళి నీకిష్టమైన చాక్లెట్లు తెచ్చిపెట్టనా అని అడిగేనంతే! అది తిట్టడమైందా? దాని గురించి రాద్ధాంతం చేయాలా?''
''అలా వెళ్ళక్కర్లేదు అనడం రాద్ధాంతం చేయడమా…? నాకు తెలియదులే, నేనో స్టుపిడ్‌ని….''
''వాదనలెందుకు గాని. నేను వెళ్ళి చాక్లెట్లు తెస్తాను. నువ్వింకేం అనకు.''
''నీ కిక్కడ నుండి వెళ్ళిపోవాలని ఉంటే మహరాజులా వెళ్లు. ఎవరైనా సరే, నాకోసం బలవంతంగా ముళ్ల మీద కూచున్నట్టు కూచుంటే నాకు నచ్చదు.''
''నువ్వలా మాట్లాడకు.''
''ఎలా మాట్లాడకూడదు?''
''అసలు సంగతేమిటి?''
''సంగతా? సంగతేమిటి?''
''నువ్వు అదోలా ఉన్నావు. నేను వచ్చిన దగ్గర్నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.''
''పాపం…. నువ్వు సరదాగా గడపాలని వచ్చినట్టున్నావు. ఇక్కడే కూచుని బోరు కొట్టించుకోవాలని అనుకోకు. నువ్వు వెళ్ళదలచుకుంటే ఇక్కడ కంటే బోల్డు చోట్లున్నాయి – ఖుషీగా గడపడానికి. నాకు ముందే తెలియకపోవడం నా తప్పు. సారీ, ఇవాళ చాలా పన్లున్నా నువ్వు వస్తావని ఉంటే మానుకుని కూచున్నాను. పర్వాలేదులే. నా పొరబాటుకి నువ్వేం చేస్తావ్, వెళ్ళు. వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయి. నా కారణంగా ఓ మానవుడు బోరు ఫీలవుతున్నాడని అనుకొనే ఖర్మ నాకెందుకు?''
''నాకే బోరూ లేదు. నేనెక్కడికి వెళ్ళను. డార్లింగ్, సంగతేమిటి చెప్పు, ప్లీిజ్''.
''సంగతా.., ఏ సంగతీ లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం తెలియటం లేదు.''
''లేకపోవడమేం, నిక్షేపంలా ఉంది. నేనేదైనా తప్పు చేస్తే.. నా వల్ల ఏదైనా పొరబాటు జరిగితే చెప్పేయ్.''
''నువ్వు అలా మాట్లాడం కాస్త ఆపుతావా''
''ఎలా మాట్లాడడం…..?''
''అది నీకూ తెలుసు. నేను ఫోన్ చేసినప్పుడు కూడా అంతే. ఎంత ఏడుపుగొట్టుగా మాట్లాడావంటే అసలు నీతో మాట్లాడడానికే భయం వేసింది''.
''ఎలా మాట్లాడాను…..? ఏదీ, మళ్లీ అను''.
''సారీ, నా ఉద్దేశం అది కాదు. నీ ధోరణి ఎంత చిర్రెత్తించిదంటే….''
''ఇక చాలు. నాతో ఇప్పటివరకు అలా మాట్లాడినవాళ్లు లేరు''.
''సారీ అన్నానుగా, నా ఉద్దేశం అది కాదన్నానుగా, అసలా మాట ఎలా అన్నానో నాకే తెలీటం లేదు. క్షమించు…. క్షమిస్తావుగా.''
''నీ అంతటివాళ్లు అడిగేక క్షమించకపోవడమా.., తప్పుకదూ, అయినా ఒక విషయం తెలుసుకో, నువ్వు క్షమాపణ అడిగినా అడక్కపోయినా ఒకటే. ఏమీ తేడా లేదు. ఎట్లీస్ట్- నాకు సంబంధించినంత వరకూ! తమాషా ఏమిట్రా అంటే ఇతను జంటిల్మన్రా అనుకుంటూ ఉంటాం. అంతలోనే ఉన్నపళాన మన ఇంటికి వచ్చి నోటి కొచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇదేమిట్రా అని తెల్లబోతాం. అంతే! ఎనీ వే, డోంట్ వర్రీ, ఏమీ డిఫరెన్స్ పడదులే.''
''నాకూ తెలుసు ఏమీ కాదని, నీతో ఎంత ప్రేమగా మాట్లాడినా ఏమీ డిఫరెన్స్ పడదు. నువ్వు నేనంటే మండిపడుతున్నావు ఇవాళ.''
''నేను….! నువ్వంటే….!! మండిపడుతున్నానా? అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది?''
''అదే నేనూ అడుగుతున్నాను. అసలు నా మీద కోపం తెచ్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందని. అసలు నీతో ఫోన్లో మాట్లాడేక, నువ్వు మాట్లాడిన తీరు విన్నాక, నాకు ఆఫీసులో పని చేయ బుద్ధి కాలేదనుకో.''
''అయ్యో, నా వల్ల నీ పని పాడవడం నా కిష్టం లేదు. అలాటి మాటలు వింటే నాకు కష్టం తోస్తుంది కూడా. చాలామంది అమ్మాయిలు అలాటి మాటలు వింటే విని సంతోషిస్తారు గానీ నేను అలా అనుకొనే రకాన్ని కాదు. నా వల్ల ఇంకొకరి పని పాడవుతోందకోవడం వినడం నా మట్టుకు నాకు ఆనందాన్ని ఇవ్వదు.''
''నేను అలా అనలేదే…..!''
''అనలేదా……? నాకు ఏదీ సరిగ్గా అర్థం కాలేదులే. నేనొట్టి మొద్దుని.''
''నేనింక కదిలితే మంచిదేమో, నేను ఏం మాట్లాడినా నువ్వు వేరేలా అర్థం తీస్తున్నావు. నేను ఇక్కడ ఉన్న కొద్దీ నీకు చికాకు పెరుగుతోంది.''
''నీ ఇష్టం వచ్చినట్టు చేయి. నా మీద నెపం పెట్టకు. నువ్విక్కడ కూచుని నన్ను ఉద్ధరించినట్టు పోజు పెట్టడం నాకు సుతరామూ ఇష్టంలేదు. నువ్వు హాయిగా, కావాలన్న చోటుకు….. కావాలనుకున్నవారి….. చోటుకు వెళ్లచ్చుగా. రీటా దగ్గరకు వెళితే సంతోషిస్తుంది కూడా.''
''రీటా లేదు, పీటా లేదు. నేనెందుకు వెళ్ళాలి? పెద్ద తలకాయనొప్పి.''
''అలాగా, మరి నిన్న రాత్రి పార్టీలో మాత్రం తలకాయ నొప్పి వచ్చినట్టు కనబడలేదే, నీకు పాపం వేరేవరితోనూ మాట్లాడే తీరిక కూడా లేకపోయింది.''
''అవునా..! మరి అంతసేపు తనతో ఎందుకు మాట్లాడానో నీకు తెలుసా?''
''నాకేం తెలుస్తుంది, అందంగా ఉంది కాబట్టేమో! అందంగా ఉన్న వాళ్లతో మాట్లాడాలని అందరూ ఉబలాట పడతారు. దానిలో తప్పుపట్టుకోవాల్సింది ఏమీ లేదులే. రీటా అందగత్తేగా.''
''రీటా అందగత్తో, మందగత్తో, నాకు తెలియదు. మళ్ళీసారి చూస్తే గుర్తుపడతానో లేదో కూడా తెలియదు. నేను మాట్లాడినది ఎందుకురా అంటే నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి. నేను నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడబోయాను. నువ్వు పెద్ద గొప్పగా 'హలో, కులాసానా', అని ఊరుకున్నావు. హలో, కులాసానా.., అంతే, ఆ తర్వాత నన్ను కన్నెత్తి చూడలేదు.''
''నేను నీకేసి చూడలేదా, అలాగా….! భలే జోక్. నవ్వనా, నవ్వితే నీకేం అభ్యంతరం లేదు కదా?''
''హాయిగా పగలబడి నవ్వుకో. కానీ యధార్థం మాత్రం అదే''.
''ఆగు, నువ్వు పార్టీ జరిగే హాల్లోకి వస్తూనే రీటా వెంటబడ్డావు. ఇక ఎవర్నీ పలకరించే ఉద్దేశంలో ఉన్నట్టు కనబడలేదు. మీ ఇద్దరూ అంత ఆనందంలో తేలిపోతూంటే మధ్యలో పానకంలో పుడకలా నేనెందుకని…..''
''హారి భగవంతుడా, ఆ పిల్ల, దాని పేరేమిటి, రీటా….. మహాతల్లి! నేను వస్తూండగానే నన్ను పట్టుకుంది. అసలు అటూ ఇటూ బుర్ర తిప్పనివ్వలేదు. ఒకటే వాగుడు. అలాటి పరిస్థితుల్లో నేనేం చేయాలని….. పిడికిలి బిగించి ముక్కు మీద ఒక్కటిచ్చుకోవాలా?''
''అలా చేద్దామని ప్రయత్నించినట్టు నాకేం అనిపించలేదులే''
''అదలాగుంచు. నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని ప్రయత్నించడం గమనించావు కదా. అది మాత్రం నిజమే కదా, నువ్వేం చేసావ్? హలో, కులాసానా… అంతే! అప్పుడేమయింది. ఆ పిల్ల.., దాని పేరేమిటి చెప్మా.., వెధవది మర్చిపోతూనే ఉంటాను. ఆఁ… రీటా… అది వచ్చింది. బంకపిశాచంలా పట్టుకుంది. నా దృష్టిలో అదో పూల్.''
''నాక్కూడా దాని గురించి అదే అభిప్రాయమనుకో. అఫ్కోర్స్, అది నా పర్సనల్ వ్యూలే! కొంతమంది కంటికి అది అందంగానే కనబడుతుంది. కొంతమంది అనగా విన్నాను కూడా.''
''అందమా, పాడా… నువ్వూ అదీ ఒకే గదిలో ఉంటే దాన్ని కన్నెత్తి చూసేవాళ్లుండరు''
''దాని ముక్కు బండముక్కు. అసలు ఆడపిల్లకు అలాటి ముక్కుంటే పెళ్లెలా అవుతుందానిపిస్తుంది నాకు''.
''కరెక్టుగా చెప్పావు. బండముక్కు! ముక్కంటే నీ ముక్కులా ఉండాలి. చూడు ఎంత సూటిగా ఉందో''.
''చాల్లే, నీదో వెర్రి''
''కళ్లు మాత్రం… నీలాంటి అందమైన కళ్లెందరికి ఉంటాయి? జుట్టుతో పోటీి పడుతూంటాయి. ఆ చిన్నినోరుకి సరైన కంపెనీ ఇచ్చినట్టు. అసలు నీ అందమంతా నీ చేతుల్లో ఉంది. చూడు ఎంత నాజూకుగా ఉన్నాయో, ముట్టుకుంటే కందిపోతుందన్నట్టు. ఏదీ ముట్టుకు చూడనీ….. లోకంలో కల్లా అందగత్తె ఎవరో చెప్పుకో చూద్దాం….''
''ఎవరో నాకేం తెలుసు''.
''తెలీదూ…?, తెలుసులే, నీకు తెలుసని నాకు తెలుసు''
''నిజంగా తెలియదు. రీటాయా?''
''ఒహ్హో, మళ్ళీ ఆ పిశాచం పేరెత్తావంటే ఊరుకోను. నువ్వు నిన్నరాత్రి మాట్లాడనందుకు నాకు రాత్రంతా నిద్రలేకపోవడం, పొద్దున్న ఆఫీసులో పని చేయలేకపోవడం. ఫోన్‌చేస్తే నువ్వు కోపగించుకోవడం. ఎందుకొచ్చిన గొడవ? అసలు నీలాంటి అపురూపసుందరి, రీటా లాటి బండముక్కుదాని గురించి బుర్రబద్దలు కొట్టుకోవడమా…..?ఛ,ఛ.''
''నేనేం బుర్రబద్దలు కొట్టుకోలేదు, నువ్వు ఎందుకలా అనుకుంటావ్! నువ్వో పిచ్చాడివి. ఏ వెర్రి పడితే ఆ వెర్రే! ఆగాగు, ముత్యాల హారం తెగిపోతుంది. మా అమ్మ తిడుతుంది. కాస్త ఆగమంటూంటే…..
(డరోతి పార్కర్ ''ది సెక్సెస్'' కు అనువాదం)
– ఎమ్బీయస్ ప్రసాద్
('హాసం' అక్టోబరు 2001లో ప్రచురితం)