NTR, SVR గెస్ట్‌లుగా న‌టించిన వేగుచుక్క‌

1957లో వేగుచుక్క అనే త‌మిళ డ‌బ్బింగ్ సినిమా వ‌చ్చింది. హీరో శ్రీ‌రామ్‌, హీరోయిన్ వైజ‌యంతిమాల‌. ఆ రోజుల్లో వైజ‌యంతి అంటే క్రేజ్‌. ఆమె చాలా సినిమాలు తెలుగులో డ‌బ్ అయ్యేవి. ఈ సినిమాకి ఎన్టీఆర్…

1957లో వేగుచుక్క అనే త‌మిళ డ‌బ్బింగ్ సినిమా వ‌చ్చింది. హీరో శ్రీ‌రామ్‌, హీరోయిన్ వైజ‌యంతిమాల‌. ఆ రోజుల్లో వైజ‌యంతి అంటే క్రేజ్‌. ఆమె చాలా సినిమాలు తెలుగులో డ‌బ్ అయ్యేవి. ఈ సినిమాకి ఎన్టీఆర్ సొంత సంస్థ నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్ (ఎన్ఏటీ) స‌హ‌క‌రించింది. 

ఇదే కార‌ణం ఏమో తెలియ‌దు కానీ, ఒక పాట‌లో NTR, SVR, శివాజిగ‌ణేష‌న్, జెమిని గ‌ణేష‌న్‌, ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు అతిథులుగా క‌నిపిస్తారు. ఇంత మంది ఆ రోజుల్లో పేరుగాంచిన న‌టులు గెస్ట్‌లుగా క‌నిపించ‌డం విశేషం.

వేగుచుక్క‌కి మాట‌లు పాల‌గుమ్మి ప‌ద్మ‌రాజు రాశారు. డ‌బ్బింగ్ ఘోరంగా వుంటుంది. లిప్ మూమెంట్‌కి , డైలాగ్‌కి సంబంధం వుండ‌దు. మార్కెట్ లేనందు వ‌ల్ల పెద్ద శ్ర‌ద్ధ తీసుకునేవాళ్లు కాదేమో. రెండు పాట‌లు చాలా బాగుంటాయి.

జాన‌ప‌ద సినిమాల్లో క‌థ‌లు రెండే ర‌కాలు. రాజ్యం కోసం కుట్ర‌లు, యుద్ధాలు, యువ‌రాణి కోసం విల‌న్‌తో ఫైటింగ్‌. వేగుచుక్క కూడా అదే. ఒక సీన్‌లో హీరో మారువేషంలో వ‌చ్చి త‌న పేరు వేగుచుక్క అంటాడు.

రాజ్యాన్ని సేనాధిప‌తి స్వాధీనం చేసుకున్న‌ప్పుడు యువ‌రాజు పిచ్చివాడిలా న‌టిస్తాడు. వేగుచుక్క‌లోని ఈ లైన్‌ని మెయిన్‌లైన్‌గా మార్చుకుని బిఎన్. రెడ్డి (1960) రాజ‌మ‌కుటం తీశారు. ఒకేసారి త‌మిళం, తెలుగులో నిర్మించారు. రెండు భాష‌ల్లో ఎన్టీఆర్ , రాజ‌సులోచ‌నే. సాత్విక పాత్ర‌లు వేసే గుమ్మ‌డిని విల‌న్ చేశారు. 

బిఎన్‌.రెడ్డి లాంటి క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడు తీసినా ఈ సినిమా పెద్ద ఆడ‌లేదు. కార‌ణం ఏమంటే హీరో పిచ్చివాడిగా ఎక్కువ సేపు క‌నిపించ‌డ‌మే. పిచ్చి ఎన్టీఆర్‌ని జ‌నం భ‌రించ‌లేక‌పోయారు. మాస్ట‌ర్ వేణు సంగీతంలో “స‌డిసేయ‌కో గాలి” పాట సూప‌ర్ హిట్‌. లీల గొంతులోంచి వ‌చ్చిన కోయిల పాట‌.

వేగుచుక్క‌లో మ‌హారాజుగా చిత్తూరు నాగ‌య్య వేశాడు. అయితే వెన్నుపోటు, లేదంటే గుండెపోటుకి గురి కావ‌డ‌మే ఆ రోజుల్లో ఆయ‌న పాత్ర‌లు. యూట్యూబ్‌లో వుంటుంది. వీలైతే స‌ర‌దాగా చూడండి.

జీఆర్ మ‌హ‌ర్షి