రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ఆ క‌ధని కాపీకొట్టాడా?

ఒకే ఏడాదిలో అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్ లో సెన్సేష‌న్ సృష్టించిన రెండు సినిమాల‌కు క‌ధ‌లు అందించిన తెలుగు క‌ధార‌చ‌యిత కె.వి. విజ‌యేంద్ర ప్రసాద్‌. మ‌రెవ‌రికీ ద‌క్కని ఘ‌న‌త‌ను స్వంతం చేసుకున్నాడు. తెలుగువారి క‌ధా…

ఒకే ఏడాదిలో అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్ లో సెన్సేష‌న్ సృష్టించిన రెండు సినిమాల‌కు క‌ధ‌లు అందించిన తెలుగు క‌ధార‌చ‌యిత కె.వి. విజ‌యేంద్ర ప్రసాద్‌. మ‌రెవ‌రికీ ద‌క్కని ఘ‌న‌త‌ను స్వంతం చేసుకున్నాడు. తెలుగువారి క‌ధా బ‌లాన్ని న‌లుదిశ‌లా చాటాడు. అలా అని తెలుగువారంతా సంతోషిస్తుంటే… కంట్లో న‌లుసులా విజ‌యేంద్ర కాపీ ర‌చ‌యిత అనే ఆరోప‌ణ మొద‌లైంది.

భ‌జ‌రంగి భాయీజాన్ సినిమా క‌ధ‌కు మూలం త‌న క‌ధ అని హిందీ ర‌చ‌యిత,  టివి నిర్మాత‌, ద‌ర్శకుడు అయిన మహీమ్ జోషి ఆరోపించాడు. కేవ‌లం ఆరోప‌ణ‌ల‌తోనే ఊరుకోకుండా ఆయ‌న ఈ వివాదంపై కోర్టుకు ఎక్కాడు కూడా. స‌ద‌రు క‌ధ‌ను తానెప్పుడో రాసుకున్నాన‌ని, అంతేకాకుండా దానిని 2007లో ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో దాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నాన‌ని ఆయ‌న చెప్పాడు. అసోసియేష‌న్ ఆఫ్ మోష‌న్ పిక్చర్స్‌, టివి ప్రోగ్రామ్ ప్రొడ్యూస‌ర్స్ సంఘంలో కూడా న‌మోదు చేయించాన‌న్నాడు. త‌న అనుమ‌తి లేకుండా త‌న క‌ధ‌ను వాడుకున్నందుకు గాను రూ.50కోట్ల న‌ష్టప‌రిహారం ఇవ్వాల్సిందిగా ఆయ‌న డిమాండ్ చేస్తున్నాడు. 

భ‌జ‌రంగి భాయిజాన్ సినిమా క‌ధ దాదాపు త‌న క‌ధ‌నే పోలి ఉంద‌న్న ఆయ‌న వాజ్యాన్ని, అందులోని ప్రాధ‌మిక సాక్ష్యాధారాల్ని ప‌రిశీలించి, మ‌హిమ్ స్క్రిప్ట్ ను భ‌జ‌రంగి భాయిజాన్ సినిమా స‌న్నివేశాల్ని పోల్చి చూసిన  న్యాయ‌స్థానం ప్రతివాదుల‌కు నోటీసులు జారీచేసింది. వాటిని అందుకున్న వారిలో భ‌జ‌రంగి భాయీజాన్ నిర్మాత ద‌ర్శకుల‌తో పాటు క‌ధా ర‌చ‌యిత విజ‌యేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. త‌మ నోటీసుల‌కు అక్టోబ‌రు 21లోగా స‌మాధానం ఇవ్వాల‌ని బోంబే హైకోర్టు ఆదేశించింది. 

అయితే తానేమీ త‌ప్పు చేయ‌లేద‌ని విజ‌యేంద్ర అంటున్నాడు. ప్రస్తుతం వ్యవ‌హారం కోర్టు ప‌రిధిలో ఉన్నందున అంత‌కు మించి వ్యాఖ్యానించ‌బోన‌ని చెప్పాడు.