క్వార్టర్‌ ఫైనల్స్‌: కష్టాల్లో లంక

వరల్డ్‌ కప్‌ పోరులో కీలక దశ.. అదే క్వార్టర్‌ ఫైనల్స్‌. ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. గెలిచిన మ్యాచ్‌ ముందుకి.. ఓడిన మ్యాచ్‌ ఇంటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం…

వరల్డ్‌ కప్‌ పోరులో కీలక దశ.. అదే క్వార్టర్‌ ఫైనల్స్‌. ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. అన్నీ నాకౌట్‌ మ్యాచ్‌లే. గెలిచిన మ్యాచ్‌ ముందుకి.. ఓడిన మ్యాచ్‌ ఇంటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. ఇక వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌ సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక, ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 4 ఓవర్లు 4 పరుగులు 2 వికెట్లు. శ్రీలంక ఎంత స్లోగా బ్యాటింగ్‌ ప్రారంభించిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? మూడో వికెట్‌ కోల్పోకుండా కాస్త జాగ్రత్తపడ్డారు సంగక్కర, తిరిమన్నె. కానీ, ధాటిగా ఆడిన తిరిమన్నె 41 పరుగులు వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔట్‌ అవడంతో లంక మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ వరల్డ్‌ కప్‌లో నాలుగు వరుస సెంచరీలు బాదిన సంగక్కర మీదనే శ్రీలంక ఆశలన్నీ వున్నాయిప్పుడు. అయితే సంగక్కర ఆచి తూచి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 51 బంతులు ఎదుర్కొని 15 పరుగులు మాత్రమే చేశాడు సంగక్కర, తిరిమన్నె ఔటయ్యే సమయానికి. జట్టును ఆదుకోవాల్సిన సమయంలో అనుభవజ్ఞుడైన జయవర్దనే బ్యాటింగ్‌కి వచ్చినా.. 4 పరుగులకే వికెట్‌ పారేసుకోవడంతో లంక మరింతగా కష్టాల్లో మునిగిపోయింది.

సౌతాఫ్రికా బౌలర్లు ఖచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో లంక బ్యాట్స్‌మన్‌ని ముప్పుతిప్పలు పెడ్తున్నారు. బంతితో నిప్పులు చెరిగే స్టెయిన్‌ 5 ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్‌ నేలకూల్చాడు. స్టెయిన్‌ వేసిన 5 ఓవర్లలో 2 మెయిడెన్లు కావడం గమనార్హం. అబోట్‌కి ఓ వికెట్‌, తాహిర్‌ 2 వికెట్లు పడగొట్టాడు.