ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 2

ఇదంతా ఇండియాలో టూర్ల సంగతి. ఫారిన్‌ టూర్ల దగ్గరకి వచ్చేసరికి ఆ గైడ్‌ ఉచ్చారణ మనం పట్టుకోగలగాలి. అది అంత సులభమైన పని కాదు. విదేశాల్లో పనిచేసేవారికీ, మహానగరాల్లో మంచి స్కూళ్లలో చదివిన యువతకు…

ఇదంతా ఇండియాలో టూర్ల సంగతి. ఫారిన్‌ టూర్ల దగ్గరకి వచ్చేసరికి ఆ గైడ్‌ ఉచ్చారణ మనం పట్టుకోగలగాలి. అది అంత సులభమైన పని కాదు. విదేశాల్లో పనిచేసేవారికీ, మహానగరాల్లో మంచి స్కూళ్లలో చదివిన యువతకు తప్ప నా బోటి అమాంబాపతు గాళ్లందరికీ ఇంగ్లీషు చదవడం ధారాళంగా వస్తుంది తప్ప విని అర్థం చేసుకోవడం కష్టమే. విదేశీయుల పేర్లు మనం తెలుగు పత్రికలలో ఒకలా కనబడతాయి, వాళ్లు మరోలా పలుకుతారు. చిన్నప్పటి నుంచి ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడి పేరు ఛార్లెస్‌ డీగోల్‌గానే చదివాను. అతని గురించి నాకు బాగానే తెలుసు. కానీ గత ఏడాది పారిస్‌లో అతని విగ్రహం చూపించి గైడ్‌ 'షాల్ద (షాల్‌ ద) గాల్‌' అని పలుకుతూంటే కన్‌ఫ్యూజ్‌ అయిపోయాను. కాస్సేపటికి యిద్దరూ ఒక్కరే అని వెలిగినా అప్పటికే చాలా సమాచారం చెప్పేయడం వలన మిస్సయిపోయాను. ఆ పైన కూడా ఈ కొత్త పేరును మనసులో పాత పేరుకు తర్జుమా చేసుకుంటూ వినడం వలన విన్నదానిలో కొంత మెదడుకు చేరలేదు. 

ప్రస్తుతం యుకె టూరు గురించి చెప్పాలంటే సెప్టెంబరు మూడోవారంలో లండన్‌ వెళ్లినపుడు మొదటి రోజు లోకల్‌ టూరులో గైడ్‌ ఇంగ్లీషు బాగానే అర్థమైంది. మర్నాడు వారిక్‌ కేసిల్‌, స్ట్రాఫోర్డ్‌ అపాన్‌ ఏవన్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ టూరుకి వచ్చిన గైడ్‌ ఉచ్చారణ చాలా వేగంగా వుంది. మైకు బాగా లేదు. మాకు సీట్లు వెనగ్గా వచ్చాయి. పైగా మా పక్క సీట్లలో కూర్చున్న ముగ్గురు జర్మన్‌ వృద్ధులకు ఏ ఆసక్తీ లేదు, వాళ్లలో వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. డాక్టరు నవుదాననుకుని యాక్టరయ్యాను అంటూంటారు మన నటులు. మా గైడ్‌ యాక్టరవుదామనుకుని గైడ్‌ అయ్యాడు. తను చాలా చమత్కారినన్న నమ్మకం ఒకటుంది. ఏ గైడూ వార్తలు చెప్పినట్లు చెప్పడు. హావభావాలతో చెప్పి రంజింప చేద్దామని చూస్తాడు. ఈయన మరీనూ. పైగా చూపిస్తున్నది షేక్‌స్పియర్‌ జన్మస్థలం. రెచ్చిపోయాడు. షేక్‌స్పియర్‌ నాటకాల సంభాషణలు గుప్పించాడు. ఏతావాతా బుర్ర వేడెక్కిపోయింది. బస్సు దిగి ముఖాముఖీ ఏదైనా వివరించినపుడు బాగానే అర్థమవుతోంది. కానీ ఏం లాభం? బస్సులో మాట్లాడినదంతా మా వరకు బధిరశంఖారావం అయింది.

అక్టోబరు మొదటివారంలో స్కాట్లండ్‌ వెళ్లాం. లాక్‌ నెస్‌, స్కాట్లండ్‌ హైల్యాండ్స్‌ కలిపి పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రిప్‌. డ్రైవరే గైడ్‌. పక్కన మైకు పెట్టుకుని డ్రైవ్‌ చేస్తూనే చెప్పుకుపోయాడు. ఉచ్చారణ అర్థమైంది. చాలా ఆసక్తికరమైన విషయాలే చెప్పాడు. కానీ తెగ చెప్పాడు. జాకోబైట్‌ తిరుగుబాటు గురించి గంటసేపు చెపితే ఓర్చుకోవటం ఎలా చెప్పండి. ఇలాటి ట్రిప్పులో భోజనానంతరం ప్రయాణీకుల్లో కాస్త మత్తు ఆవహిస్తుంది. అప్పుడో గంటా గంటన్నర గైడ్‌ మౌనంగా వుంటే శ్రోతలు ఓ కునుకు లాగి, ఫ్రెష్‌ అవుతారు. ఈ పెద్దమనిషి ఆ విరామం కూడా యివ్వలేదు. ఒకదాని తర్వాత మరొకటి స్కాట్లండ్‌ కథలు చెపుతూ పోయాడు. ఒక్కసారిగా అంత కొత్త సమాచారం గుప్పిస్తే బుర్రలో పట్టదు కదా. అన్నీ తెలియని పేర్లే. అందులో యీ దిక్కుమాలిన రాజులు వేరేవేరే పేర్లు పెట్టుకోకుండా జేమ్స్‌ ఒకటి, ఎడ్వర్డు మూడు, జార్జి ఐదు అంటూ అవే పేర్లు తిప్పితిప్పి పెట్టుకుంటారు. చిన్నప్పటినుంచి వాళ్ల కథలు వింటూ వుంటే కథలో యిన్వాల్వ్‌ కాగలం కానీ లేకపోతే పావుగంటలో తలనొప్పి వచ్చేస్తుంది. ఎవడెలా పోతే నాకేం అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే – టూరు పెట్టుకున్నప్పుడే అర్జంటుగా ఇంటర్నెట్‌లో ఆ దేశచరిత్ర తెలిసేసుకుందాం, గైడ్‌ చెప్పినది శ్రద్ధగా వినేద్దాం అనుకోవద్దు సుమా అని చెప్పడానికి. మనం ముందు నుంచే కాస్తకాస్త తెలుసుకుంటూ వుండాలి. అప్పుడు ఆ ప్రదేశంలో వున్న విశేషం ఏమిటో బోధపడుతుంది. 

కృష్ణదేవరాయలు గురించి మనకు తెలుసు కాబట్టి హంపీ విజయనగరం శిథిలాలు చూస్తే పులకింత కలుగుతుంది. మహాభారత యుద్ధం గురించి చదువుకున్నాం కాబట్టి కురుక్షేత్రం చూడాలనిపిస్తుంది. అర్జునుడు ఎవరో, భీష్ముడెవరో తెలుసు కాబట్టి ఇది అంపశయ్య, భీష్ముడి దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణం వేసినది యిక్కడే అంటే తెలుస్తుంది. మరి విదేశాలు వెళ్లినపుడు మనకేం తెలుస్తుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. పారిస్‌లో ఐఫిల్‌ టవర్‌ బ్యాక్‌డ్రాప్‌లో కనబడేలా ఫోటోలు తీసుకునే చోటు వుంది. దాని ఎదురుగా వున్న విగ్రహం చూపించి యిది 'ఫాష్‌'ది అన్నారు. అతనెవరో, అతని ప్రత్యేక లక్షణమేమిటో తెలుస్తే కదా ఆ విగ్రహం కేసి తేరిపార చూస్తాం. మొదటి ప్రపంచ యద్ధంలో ఫ్రాన్సు దళాలను నడిపిన సైన్యాధ్యక్షుడు, తన దూకుడు వలన అనేకమంది సైనికుల చావుకి కారకుడైనవాడు వున్నాడని అతని పేరు స్పెల్లింగు ఎఫ్‌ఓసిఎచ్‌ అని నాకు తెలుసు. ఆ పేరును యిలా పలకాలని తెలియదు. తెలిసేటప్పటికి విగ్రహం కంటికి దూరమై పోయింది. (సశేషం) –

ఫోటో – పారిస్‌లో షాల్‌ ద గాల్‌ విగ్రహం, గుఱ్ఱం మీద వున్నది ఫాష్‌

 ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives