వైసీపీలో దుష్ట‌చ‌తుష్టయంతో జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో త‌న ప్ర‌భుత్వంపై క‌క్ష క‌ట్టి వ్య‌తిరేక‌త పెంచాల‌ని త‌పిస్తున్న‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన, ఎల్లో మీడియా అధిపతుల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విరుచుకుప‌డుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం మంచి చేస్తున్నా జీర్ణించుకోలేక…

ఇటీవ‌ల కాలంలో త‌న ప్ర‌భుత్వంపై క‌క్ష క‌ట్టి వ్య‌తిరేక‌త పెంచాల‌ని త‌పిస్తున్న‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన, ఎల్లో మీడియా అధిపతుల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విరుచుకుప‌డుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం మంచి చేస్తున్నా జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్‌, టీవీ5తో పాటు చంద్ర‌బాబు క‌లిసి దుష్ట‌చ‌తుష్ట‌యంలా, దొంగ‌ల ముఠాలా ఏర్ప‌డి అడ్డుకుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డుతున్నారు.  

జగ‌న్ ఆవేశాన్ని, ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే శ‌త్రువులెవ‌రో జ‌గ‌న్‌కు తెలుసు కాబ‌ట్టి, తాను దుష్ట‌చ‌తుష్ట‌యంగా భావిస్తున్న వాళ్ల‌తో జ‌గ‌న్‌కు పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చు. మీడియా ఒక మేర‌కు మాత్ర‌మే వ్య‌తిరేక‌త పెంచుతుంది. గెలుపోట‌ముల‌ను ఎల్లో మీడియా డిసైడ్ చేసే కాలం చెల్లింది. ప్ర‌ధాన‌ మీడియా దురుద్దేశాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో సోష‌ల్ మీడియా విజ‌యం సాధించింది. 2019లో జ‌గ‌న్‌పై ఎప్ప‌ట్లాగే ఎల్లో మీడియా విష ప్ర‌చారం చేసింది. అలాగే జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్నా అంటూ కీర్తిస్తూ, జాకీలు పెట్టి లేపినా… ఘోర ఓట‌మిని అడ్డుక‌ట్ట లేక‌పోయింది. ఈ ఓట‌మి కేవ‌లం చంద్ర‌బాబుదే కాదు, మీడియా విశ్వ‌స‌నీయ‌త‌ది కూడా.

ఇదిలా ఉంటే వైసీపీలోనే ఉంటూ పార్టీకి న‌ష్టం క‌లిగించే దుష్ట‌శ‌క్తుల సంగ‌తేంటి? ఇప్పుడీ ప్ర‌శ్న పార్టీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగు తోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్యంగా నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకున్న వాళ్ల‌ను చూస్తే, కేవ‌లం జ‌గ‌న్‌కు దగ్గ‌రున్న వాళ్ల‌కు త‌ప్ప‌, ప్ర‌జానాయ‌కులెవ‌రికీ త‌గిన న్యాయం జ‌ర‌గ‌లేద‌నే ఆవేద‌న వైసీపీలో బ‌లంగా ఉంది. కొంద‌రు సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌, వైసీపీ గురించి పాజిటివ్ పోస్టులు పెడుతూ, అదే పెద్ద సేవ చేస్తున్న బిల్డ‌ప్‌లు ఇస్తున్న వాళ్ల సంఖ్య పెరిగింది. ఇదే నిజ‌మ‌నుకుని అంద‌లాలు ఎక్కించిన ఉదంతాలున్నాయి.

ప్ర‌జ‌ల్లో తిరిగి పార్టీని బ‌లోపేతం చేసి, అధికారం వ‌ర‌కూ న‌డిపించిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఎక్క‌డున్నారో తెలియని ప‌రిస్థితి. ఫేస్‌బుక్ లైవ్‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌ది బూతు మాట‌లు, వైసీపీ పెద్ద‌ల‌పై రెండు భ‌క్తి మాట‌లు చెబితే చాలు ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని గ్ర‌హించి, అందులో స‌క్సెస్ అయిన వారున్నారు. దీని వ‌ల్ల పార్టీకి న‌ష్టం. గ‌తంలో త‌న చుట్టూ తిరిగిన వాళ్లే నిజ‌మైన నాయ‌కుల‌ని అనుకుని పొర‌బ‌డ్డాన‌ని, ఇక‌పై అలా జ‌ర‌గ‌ద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు ఇటీవ‌ల ప‌దేప‌దే చెబుతున్నారు.

దీన్నుంచి వైసీపీ కూడా గుణ‌పాఠం నేర్చుకుంటే మంచిదే. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ లేదా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి…. ఇలా పార్టీలో కీల‌క నేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటే చాలు, ప్ర‌జ‌ల‌తో ప‌నే ముంద‌ని భావించిన ఓ సెక్ష‌న్, చ‌క్క‌గా వాళ్ల వ‌ద్ద‌కు బొకేల‌తో వెళుతూ ప‌నుల‌ను చ‌క్క‌దిద్దుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. వైసీపీని, వైఎస్సార్ కుటుంబాన్ని, జ‌గ‌న్‌ను నిజంగా అభిమానిస్తూ, పార్టీ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేని వారి ప‌రిస్థితి ఏంటి? ఈ సంఖ్యే ఎక్కువ ఉంద‌ని గ్ర‌హించి పార్టీ నేత‌లు వెళ్లి క‌లుసుకుంటేనే మ‌ళ్లీ అధికారంలోకి రాగ‌లుగుతారు.

ఏ మాత్రం ప్ర‌జ‌లతో సంబంధం లేకుండా ప‌ద‌వులు ద‌క్కించుకున్న వాళ్లను ఇప్ప‌టికైనా జ‌నంలోకి పంపాల్సి వుంది. అలాగే పార్టీ కోసం ప‌ని చేసి, ఏమీ ద‌క్క‌క నిరుత్సాహంలో ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ పెద్ద‌లు నేరుగా క‌ల‌వాలి. వాళ్ల ఆవేద‌న‌ను ఓపిక‌గా వినాలి. భ‌విష్య‌త్‌పై భ‌రోసా ఇవ్వాలి. ఎటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీకి పిలుపునిచ్చారు. దీన్ని నాయ‌కులు సద్వినియోగం చేసుకోవాలి. 

పార్టీని, ప్ర‌భుత్వాన్ని చాక‌చ‌క్యంగా వాడుకుంటున్న వాళ్లే నిజ‌మైన దుష్టుల‌నే టాక్ వైసీపీలో అంత‌ర్గ‌తంగా న‌డుస్తోంది. అలాంటి వాళ్ల నుంచి పార్టీని కాపాడుకునేందుకు నిజ‌మైన సైన్యాన్ని గుర్తించాలి. ఇది అన్ని స్థాయిల్లో జ‌ర‌గాలి.