మెదక్‌ హాట్‌ సీట్‌ ఎవరికి.!

మెదక్‌ ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. నోటిఫికేషన్‌ కూడా వచ్చింది. ఎవర్ని బరిలోకి దింపాలనే విషయమై వివిధ రాజకీయ పార్టీలు కసరత్తులు షురూ…

మెదక్‌ ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. నోటిఫికేషన్‌ కూడా వచ్చింది. ఎవర్ని బరిలోకి దింపాలనే విషయమై వివిధ రాజకీయ పార్టీలు కసరత్తులు షురూ చేశాయి. ఆశావహులు టిక్కెట్ల కోసం పార్టీల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు. మీడియా సర్కిల్స్‌లో అయితే ఫలానా వ్యక్తికే టిక్కెట్‌ దక్కే అవకాశముందన్న ప్రచారమూ జోరందుకుంది. అయినాసరే, ఇంకా ఈ విషయమై ఆయా పార్టీలు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సీటు ఇది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఉప ఎన్నిక తలెత్తింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఉప ఎన్నికలు కొత్త కావు. సెంటిమెంట్‌ పేరుతో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన ట్రాక్‌ రికార్డ్‌ ఆ పార్టీకి వుంది. అదే సమయంలో ఒకటీ అరా చేదు సంఘటనలూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.

ఇప్పుడు అధికారం తమ చేతిలో వున్న దరిమిలా, చాలా తేలిగ్గా మెదక్‌ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంటామన్న ధీమాతో వుందిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి. దాంతో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌ని ఎమ్మెల్యేని చేసిన కేసీఆర్‌, ఈసారి దేవీప్రసాద్‌ని ఎంపీ చేసే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రేసులో కోదండరామ్‌ పేరూ ప్రచారంలోకొచ్చినా, ఆయన విషయంలో కేసీఆర్‌ అంత సానుకూలంగా లేరన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం.

ఇక, తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోలేకపోయిన కాంగ్రెస్‌ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రేసులో వున్నట్లు సమాచారం. ఆయన తప్ప ఇంకెవరి పేరూ విన్పించడంలేదు. అప్పుడప్పుడూ విజయశాంతి పేరు తెరపైకొస్తున్నా ఆమె అసలు రాజకీయాలపైనే ఆసక్తితో లేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ – టీడీపీ కూటమి విషయానికొస్తే, అసలు ఆ పార్టీల మధ్య పొత్తు వుంటుందా.? లేదా.? అన్న వాతావరణం కన్పిస్తోంది. పొత్తు వుండదని బీజేపీ నేతలు కొందరు చెబుతోంటే, దానిపై బయటకు ఏమీ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో బీజేపీ  టీడీపీ ఉమ్మడి అభ్యర్థే మెదక్‌ ఎంపీ ఎన్నికల బరిలో వుండే అవకాశం సుస్పష్టం. రేసులో కిషన్‌రెడ్డి పేరు విన్పిస్తోంది. మరికొందరు బీజేపీ నేతలూ మెదక్‌ టిక్కెట్‌ని ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆశావహులు పెద్దగా లేనట్టేనేమో.!

మొత్తంగా చూస్తే, మెదక్‌ ఎంపీ సీటు హాట్‌ హాట్‌గా మారింది. విజయం ఎవర్ని వరిస్తుంది.? అన్నది ఖచ్చితంగా చెప్పలేంగానీ, ఎడ్జ్‌ మాత్రం అధికార పార్టీకే వుంటుందనేది రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోన్న అంచనా. చూద్దాం.. ఏం జరుగుతుందో.!