గత ఏడాది మేలో యూరోప్‌లో కొన్ని దేశాలు పర్యటించాను. ప్రస్తుతం యూరోప్‌లోని ఇంగ్లండులో నాలుగు నెలలు వుంటున్నాను. ట్రావెలాగ్ రాయవచ్చు కదాని చాలామంది పాఠకులు అడుగుతున్నారు. నేనిప్పటిదాకా యాత్రాసాహిత్యం రాయలేదు. ఎలా రాయాలన్నదానిపై స్పష్టతా లేదు. చాలామందిలాగే చిన్నప్పణ్నుంచి నాకు వూళ్లు తిరగడం సరదా. ట్రావెలాగ్స్ ఉత్సాహంగా చదివేవాణ్ని. కానీ నచ్చేవి కావు. ఆంధ్రప్రభలో ''ప్రమదావనం''లో యిలాటి రచనలు చాలా వచ్చేవి. కలకత్తా పర్యటన అని పేరు పెట్టి రెండు పేజీల వ్యాసం వచ్చేది. దానిలో కోట్లు వేసుకున్న రచయిత్రి, భర్త ఫోటో, మొక్కల మధ్య రచయిత్రి కూతురి ఫోటో పోగా తక్కిన మ్యాటర్‌లో ''స్టేషన్‌లో దిగగానే రావుగారి కుటుంబం వచ్చి రిసీవ్ చేసుకున్నారు. బెంగుళూరులో వుండగా వాళ్లు మా పక్క యింట్లో వుండేవారు… దిగిన మూడో రోజు అందరూ సరదాగా పిక్నిక్‌కు వెళ్లాం. మేం చేగోడీలు, జంతికలు తెస్తే రావుగారి బెంగాలీ ఫ్రెండ్స్ రసగుల్లా, సందేశ్ తెచ్చారు..'' లాటి అనవసర వివరాలు చాలా వుండేవి. వెళ్లిన వూరు సుందర నగరమని, అక్కడివాళ్లు తెలుగువాళ్లంటే చాలా గౌరవమిస్తారని, వాళ్లు అరటిపళ్లతోనో, వెలగపళ్లతోనే మంచి స్వీటు చేస్తారనీ… యిలాటివి తప్పనిసరిగా వుండేవి. ఇక అక్కడ స్థలపురాణం సంగతి సరేసరి. మనకు పనికి వచ్చే విషయం ఏమీ వుండేది కాదు. కొన్ని పత్రికలలో యిప్పటికీ యిలాటివి చూస్తూ వుంటాను. ఇటీవలి కాలంలో వస్తున్న కొందరి పుస్తకాలూ యిదే ధోరణిలో వుంటున్నాయి. గత ఏడాది యూరోప్ వెళ్లేముందు కొన్ని పుస్తకాలు కొని చదివాను. 'మా అబ్బాయి పని చేస్తున్న ఫలానా వూరి నుంచి స్విజర్లండ్ వెళ్లాం, మావాడు అన్నీ దగ్గరుండి చూపించాడు, అక్కడ ప్రకృతి అందంగా వుంటుంది.' అని రాస్తే మనకేమిటి లాభం? మన వూరి నుంచి అక్కడకి ఎలా వెళ్లాలి? ఎంతవుతుంది అనేది తెలియాలి. ప్రకృతి వర్ణనలకేముంది, ఏ కవిత్వపుస్తకం చూసినా కనబడతాయి.
తెలుగులో ట్రావెలాగ్ పుస్తకాల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి పుస్తకాలు ఎన్నదగినవి. ఆయన ప్రతి చిన్న విషయం మర్చిపోకుండా విపులంగా రాస్తారు. జేబులో ఎంత చిల్లర పెట్టుకోవాలి, టిక్కెట్టు తీసుకునేటప్పుడు ఏమేం ప్రశ్నలు అడగాలి అనే అంశాల దగ్గర్నుంచి చక్కగా, ఓపిగ్గా రాస్తారు. మనం వెళ్లదలచిన దేశం గురించి ఆయన రాసిన పుస్తకం మార్కెట్లో వుందంటే చింతే వుండదు. ఇక అలాటప్పుడు నాబోటి వాడు రాయవలసిన అవసరం ఏముంది? నిజానికి నేను వూళ్లు వెళ్లినప్పుడల్లా డైరీ రాసి పెట్టుకున్నాను. ఇంటర్నెట్‌లో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం లేని రోజుల్లో కూడా ఏ టూరైనా చక్కగా ప్లాన్ చేసుకునేవాణ్ని. బంధుమిత్రులకు ఆ సమాచారం ఎంతో వుపయోగపడేది. అవన్నీ యీ కాలమ్ పాఠకులతో పంచుకోవడం అనవసరం. ఎందుకంటే అవి నా బోటి స్థితిలో వున్నవారికే పనికి వస్తాయి. అప్పట్లో టూర్లంటే చాలా ఖర్చు అని, తెలియని ప్రదేశమని దడిసేవారు. అక్కర్లేదయ్యా, వెయ్యి రూపాయలు చేత్తో పట్టుకుంటే ఫ్యామిలీతో వెళ్లి వచ్చేయచ్చు అని ప్రోత్సహిస్తూ ప్లాను వేసి యిచ్చేవాణ్ని. ఇప్పుడా రోజులు మారాయి. పైగా మన పాఠకులందరిదీ ఒకే రకమైన ఆర్థికస్థితి కాదు. ఒకళ్ల బజెట్ 5 వేలుంటే మరొకరిది 50 వేలుంటుంది.
సమయం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. వారం రోజులు పట్టినా ఫర్వాలేదు, రైల్లో వెళితే డబ్బులు మిగులుతాయని కొందరనుకుంటే, మూడు రోజులకు మించి అరక్షణం లేటవడానికి వీల్లేదు, డబ్బు పోతే పోయింది, ఫ్లయిట్‌లో వెళదాం అని కొందరంటారు. వెళ్లే ఊరి పట్ల, దర్శనీయాల స్థలాల విషయంలో కుటుంబంలో నలుగురు వ్యక్తుల మధ్యే ఏకాభిప్రాయం కుదరదు. ఒకరు మ్యూజియం చూద్దామంటే, మరొకరు తెల్లవారగట్ల నదీస్నానం అంటారు, మూడోవారు చీరల మార్కెట్టంటారు, నాలుగోవారు మంచి తెలుగు భోజనం ఎక్కడుందో వెతుకుదామంటారు. అందువలన ఎవరిదైనా సరే టూరు ప్లాన్ అనేది హైలీ కస్టమైజ్‌డ్. మరి అందర్నీ దృష్టిలో పెట్టుకుని ట్రావెలాగ్ రాయడం ఎలా? పాఠకులకు కొంత సమాచారం అందిస్తూనే యాత్ర సందర్భంగా ఎదురైన ఘట్టాలు, సన్నివేశాలు, మనుష్యులు, అనుభవాలు రాస్తే చదవడానికి బాగుంటుంది. ఫిక్షన్ రైటర్ అయితేనే వాటిని ఆసక్తికరంగా రాయగలరు. అది పాఠకుల మనసులో హత్తుకుని వారు ఆ యాత్ర ప్లాన్ చేసినప్పుడు గుర్తుకు వస్తుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా వుంటాయి. ఖుశ్వంత్ సింగ్ అలాటి వాటిల్లో దిట్ట. అలా రాయగలుగుతానన్న ధైర్యం కలిగినప్పుడు ట్రావెలాగ్ రాస్తాను. అయితే యీ లోపున టూరిస్టులు సాధారణంగా ఎదుర్కొనే ఒక సమస్యను పరిష్కరించడానికి యీ సీరీస్ ద్వారా ప్రయత్నిస్తున్నాను.
సిగ్గు విడిచి నిజం ఒప్పుకోవాలంటే మనందరిలో చాలా విషయాల్లో అజ్ఞానం రాజ్యమేలుతూంటుంది. ఏదో మన వూరు, మహా అయితే మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, మన ఆఫీసు, మనం చేసే పని, దేశంలో రాజకీయాల గురించి కాస్తకాస్త తెలుసు, దాన్తోనే బండి లాగించేయవచ్చు కాబట్టి లాగించేస్తూ వుంటాం. పురాణాల గురించి కూడా అమర్ చిత్ర కథ లెవెల్ వరకు తెలుసు కానీ మరీ శత్రుఘ్నుడి మావగారి పేరు, శిశుపాలుడి తల్లి పేరు అడిగితే కళ్లు తేలేస్తాం. అర్జునుడికి కార్తవీర్యార్జనుడు ఏమవుతాడని చటుక్కున అడిగితే తబ్బిబ్బు పడతాం. ఏ పాత్ర ఏ యుగంలో వస్తుందో డౌటు. ఇక చరిత్ర గురించైతే మరీ అన్యాయం. ఔరంగజేబు అన్నదమ్ముల పేర్లు చెప్పమంటే కొరకొరా చూస్తాం. ఏ రాజు ఏ శతాబ్దం వాడో, ఏ ప్రాంతంవాడో తెలియదు. మన దేశం గురించే మన తెలివిడి యిలా తెల్లారితే, యిక విదేశాల గురించి ఏం తెలుస్తుంది? లక్షలు ఖఱ్చు పెట్టుకుని వెళ్లే ముందు కాస్త తెలుసుకుని వెళితే టూర్లో ఏం చూపిస్తున్నారో, మనం ఏం చూస్తున్నామో కాస్తయినా బోధపడుతుంది. 'ఏ వూరు గురించైనా యింటర్నెట్‌లో సమాచారం దొరుకుతుంది, ఎక్కడకి వెళ్లినా అక్కడ గైడ్లు వుంటారు. దాని గురించి యిప్పణ్నుంచి ఆయాస పడనక్కరలేదు' అని కొందరనుకోవచ్చు. నిజమే, యింటర్నెట్‌లో దొరుకుతుంది, కానీ అది మనకు బోధపడాలిగా, పూర్వాపరాలు తెలిస్తేనే కదా మనకు ఏమైనా అర్థమయ్యేది, అవి అప్పటికప్పుడు అర్జంటుగా తెలిసిపోతాయా?
ఇక గైడ్. నిజానికి ఎక్కడి కెళ్లినా గైడ్ వుండడం చాలా అవసరం. చాలామంది వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని యాత్రాస్థలాలకు వస్తారు కానీ అక్కడి గైడ్‌కు వంద రూపాయలివ్వడానికి ఖేదపడతారు. 'వాడు చెప్పేదేముంది తొక్క, చూస్తే మన కర్థం కాదా?' అనుకుంటారు. కొన్ని సంగతులు గైడ్ చెపితేనే మనకు తడతాయి. కానీ గైడ్లందరూ మంచివాళ్లు దొరకరు. చాలామంది కవిత్వం ఒలకపోస్తారు. కొందరు మనకు తెలిసిన భాష మాట్లాడరు. మాట్లాడినా వాళ్ల యాస మనం ఫాలో కాలేము. ఏ ఇంగ్లీషులోనో, హిందీలోనో చెపుతూ వుంటే అది రాని మన కుటుంబసభ్యులకు తర్జుమా చేసి చెప్పాల్సిన పరిస్థితుల్లో కొంత మిస్సయిపోతూ వుంటాం. కండక్టెడ్ టూర్‌లో అయితే గైడ్ విధిగా వుంటాడు. బస్సు వూళ్లోంచి వెళుతూ వుంటే మైక్ పట్టుకుని చెపుతూ వుంటాడు. ఎడమవైపు చూడండి ఫలానా భవనం, కుడివైపు చూడండి ఫలానా విగ్రహం అంటూ వుంటాడు. ప్రయాణీకులందరూ టెన్నిస్ మ్యాచ్ ప్రేక్షకుళ్లా తల ఎడాపెడా తిప్పేస్తూ, ఎక్కడ ఎక్కడ అని అడుగుతూంటారు. కుడి అంటే ఎడమవైపు చూసి, ఎడమ అంటే కుడివైపు చూసి, కిటికీ దగ్గర కూర్చున్నవారిపై వాలిపోయి, అంతలోనే కెమెరాలు తీసి క్లిక్ మనిపిస్తూ నానాసందడీ చేస్తారు. మధ్యలో యింటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా సాగుతూ వుంటుంది, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదన్న కబుర్లు వుంటాయి. ఈ గోలలో గైడ్ మాటలు వినబడవు. అతను ఆగడు. తన పాటికి తను దంపుళ్లపాటలా చెప్పుకుంటూనే పోతాడు.
ఒక్కో చోట గైడ్ బస్సు దిగమంటాడు. దిగగానే కోడి చుట్టూ కోడిపిల్లలు మూగినట్లు అతని చుట్టూ మూగాలి. అప్పుడు ఆ స్థలం గురించి చెప్తాడు. ఇది వినడం వీజీ కాదు. బస్సులోంచి ఎవరు ముందుగా దిగి గైడ్‌కి చేరువగా వుండగలరో వాళ్లే శ్రద్ధగా వినగలరు. ముందుగా దిగడం మన చేతుల్లో లేదు. మన సీటు ముందు వస్తుందో, వెనక వస్తుందో తెలియదు. మన ముందుసీటులో వాడు దారిలో నిలబడి రుమాలో, చెప్పో వెతుక్కుంటూ తాత్సారం చేస్తే మనం ఆగిపోతాం. దిగాక కెమెరాయో, స్వెటరో మర్చిపోయామని భార్య గుర్తు చేస్తే మళ్లీ బస్సులోకి వెళ్లి తేవలసి వస్తుంది. గైడ్‌కు కాస్త దూరంలో వుంటే ఏదీ సరిగ్గా వినబడదు, విననివ్వరు. ఎందుకంటే 40 మంది టూరిస్టులుంటే వారిలో శ్రద్ధగా అన్నీ తెలుసుకోవాలనుకునేవారు పదిమంది కంటె ఎక్కువుండరు. మిగతా అందరూ వచ్చామంటే వచ్చాం, వెళ్లామంటే వెళ్లాం గాళ్లే. ఇంకో బ్యాచ్ 'ఏముందండీ యిక్కడ గాడిదగుడ్డు, మన దగ్గర మాత్రం యింతకంటె మించి లేవా?' గాళ్లు. కొంతమంది దిక్కులు చూస్తారు కానీ ఆ కట్టడం ఏమిటో, ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో పట్టించుకోరు. ఆటో ఫోకస్ కెమెరాలు వచ్చిన దగ్గర్నుంచి రెచ్చిపోతున్న కెమెరాల బ్యాచ్‌కు కనబడిన ప్రతీదాన్నీ ఫోటో తీయడమే పని. నువ్వు తీసినదాని పేరేమిటి అంటే ఏమో అంటాడు. ఇక సెల్ఫీల బ్యాచ్‌ని చూస్తే జీవితం మీద విరక్తి పుడుతుంది. ఫ్రేమంతా నీ మొహమే కనబడితే నయాగరాకు వెళ్లినా ఒక్కటే, పిరమిడ్‌కి వెళ్లినా ఒక్కటే! మనం గైడ్‌కు దూరంగా వీళ్ల మధ్య పడ్డామో ఆయనేం చెప్తున్నాడో అర్థం కాదు. మనం కష్టపడి విందామని చెవులు రిక్కిస్తూ వుంటే 'చలిగా వుంది కదండీ', 'భోజనానికి ఎక్కడకు తీసుకెళతాడంటారు?' లాటి కబుర్లతో డిస్టర్బ్ చేస్తారు. తెలుగువాళ్లు తగిలితే 'మా పెద్దమ్మ అల్లుడి తమ్ముడు మీ బ్యాంకేనండీ, పేరు గుర్తు లేదు, మీకు తెలుసా? నల్లగా, లావుగా వుంటాడు, భలే విట్టీగా మాట్లాడతాడు' లాటి ఉబుసుపోక కబుర్లు చెప్పబోతారు. ఒళ్లు మండి ఎర్రగా చూస్తే 'సాటి తెలుగువాళ్లు కదాని పలకరిస్తే పోజు కొడుతున్నాడు' అని పెళ్లాంతో మనకు వినబడేట్లా అంటాడు (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)