సినిమా రివ్యూ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..

రివ్యూ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు, పవిత్ర, రఘుబాబు, సప్తగిరి తదితరులు మాటలు: ఖదీర్‌ బాబు…

రివ్యూ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు, పవిత్ర, రఘుబాబు, సప్తగిరి తదితరులు
మాటలు: ఖదీర్‌ బాబు
సంగీతం: హరి
కూర్పు: రమేష్‌ కొల్లూరి
ఛాయాగ్రహణం: కె.ఎస్‌. చంద్రశేఖర్‌
నిర్మాతలు: శిరీష-శ్రీధర్‌
కథ, కథనం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు
విడుదల తేదీ: జూన్‌ 19, 2015

ఒక నటుడు తను చేస్తున్న సినిమా కథతో ఇన్‌స్పయిర్‌ అయితే తనలోని బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఆటోమేటిగ్గా బయటకి వస్తుందని ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’ నిరూపిస్తుంది. ఇంతకాలం చాలా యావరేజ్‌ యాక్టర్‌ అనిపించుకున్న సుధీర్‌బాబు ఈ చిత్రంలో కృష్ణ పాత్రలో జీవించాడు. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ‘చార్మినార్‌’ సినిమాకి రీమేక్‌ ఇది. ఒరిజినల్‌ మూవీ అంతగా విజయం సాధించడంలో ఆర్‌. చంద్రు మ్యాజిక్‌ ఏంటనేది తెలియదు కానీ… ‘డైరెక్టర్స్‌ మూవీ’ కావాల్సిన ‘కృష్ణమ్మ..’కి తన అభినయంతో సారథిగా మారాడు 
సుధీర్‌. 

ఏళ్ల తరబడి గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని ప్రేయసికి వ్యక్తం చేయలేక… ఆమెకి తెలీకుండానే తనలో రగిలించిన స్ఫూర్తితో, ఆమె తన చెంత లేకుండానే అధిరోహించిన శిఖరాల్లో.. తను సాధించిన విజయాల్లో సంతోషం దొరక్క, తను చేరుకున్న లక్ష్యంలో సంతృప్తి కనిపించక.. మధనపడే ప్రేమికుడిగా సుధీర్‌ అభినయం చాలా బాగుంది. అయితే అదే స్థాయిలో ఈ చిత్రం మాత్రం నిలబడలేకపోయింది. ప్రేమించిన అమ్మాయి మెప్పు కోసం, ఆమె కళ్లల్లో కనిపించే మెరుపు కోసం నిరంతరం కష్టపడుతూ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునే ఒక ప్రేమికుడి ప్రయాణమిది. ఏడవ తరగతి పాస్‌ కాలేని, దేశ రాజధాని ఏదో తెలియని మొద్దు.. పెద్ద ఇంజినీర్‌ కావడంలో తన ప్రేమ రగిలించిన స్ఫూర్తి ఏంటనేది మనకి చెప్తూ అమెరికా నుంచి తన స్వగ్రామానికి ప్రయాణమవుతాడు కృష్ణ (సుధీర్‌). గొర్రెలు కాస్తూ తనని పెంచిన నాన్నకి.. అయిదు రూపాయలు దాచుకోడానికి చాలా రోజుల పాటు నిరీక్షించే తల్లికి అమెరికాలో భోగభాగ్యాలు అందించేంత ఎత్తుకి ఎదగడంలో తనని ప్రేరేపించిన ప్రేమ ఎలా పుట్టిందో, ఎలా తనని నడిపించిందో వివరిస్తుంటాడు. ఎనిమిదో క్లాసులో తన కంట పడిన రాధ (నందిత) అతని జీవితాన్నే మార్చేస్తుంది. కానీ తన ప్రేమని తనకి తెలియజేయాలని చూసిన ప్రతిసారీ ఏదో ఒక అవాంతరం అడ్డు పడుతుంది. జీవితంలో అన్నీ సాధించినా కానీ ప్రేమని పొందలేదంటే మాత్రం పరాజయమే అని భావించే కృష్ణ తన రాధని కలుస్తాడా లేదా అన్నదే ఈ కథ. 

కృష్ణ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో జరిగే కథ కాబట్టి ఇందులో రాధ వైపు నుంచి ఏ స్పందనలు తెలియవు. చివరకు ఆమె అతడిని ప్రేమించిందా లేదా అనేది కూడా కొన్ని క్లూస్‌ ద్వారా అర్థం చేసుకోవాల్సిందే తప్ప క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ క్రమంలో నందిత క్యారెక్టర్‌ చాలా పాసివ్‌ అయిపోయింది. మామూలుగా చాలా యాక్టివ్‌గా నటించే నందిత ఈ చిత్రంలో ఆ పాసివ్‌ మోడ్‌లో ఎలాంటి ఇంప్రెషన్‌ వేయలేకపోయింది. అయితే నెరేటర్‌ బాధ్యత తీసుకున్న సుధీర్‌ తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాడు. ఇంటర్‌ విద్యార్థిగా, కాలేజ్‌ స్టూడెంట్‌గా, ఉద్యోగంలో బాగా సెటిలైన వాడిగా వివిధ స్టేజ్‌ల్లో కనిపించే తన పాత్ర కోసం సుధీర్‌ బాగానే హార్డ్‌ వర్క్‌ చేసాడు. తన పాత్ర పరంగా పెరిగే వయసుతో పాటు సుధీర్‌ కూడా నటుడిగా మెచ్యూర్‌ అయినట్టు అనిపిస్తుంది. మొదట్లో సోసోగా అనిపించిన వాడే తర్వాత్తర్వాత ఆకట్టుకుంటూ… చివరకు వచ్చేసరికి స్పాట్‌లెస్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రధానంగా సుధీర్‌ కోణంలో నడిచే కథ కనుక మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చి పోతుంటాయే కానీ గుర్తుండేవి, గుర్తించాల్సినవీ ఏవీ లేవు. 

దర్శకుడి స్వీయానుభవం నుంచో, లేక తను సాక్షిగా నిలిచిన తన స్నేహితుడి ప్రేమకథ నుంచో ఈ సినిమా పుట్టిందనిపిస్తుంది. హీరో జీవితానికి, అతని అనుభూతులకి, అతని భావోద్వేగాలకీ సంబంధించిన అన్ని సన్నివేశాల్లో సహజత్వం కనిపించింది. అయితే ప్రేమ సన్నివేశాలు, ఆ ప్రేమ తాలూకు జర్నీ తప్పిస్తే… ఈ కథని సినిమాగా మలచడానికి యాడ్‌ చేసిన ఎలిమెంట్స్‌ ఏవీ ఆకట్టుకోలేదు. ఇంటర్‌లో ‘ఈ జాగా నాది’ అంటూ ఒకడు, కాలేజ్‌లో చైతన్య కృష్ణ రెండు ఫైట్‌ సీన్స్‌కి పనికొచ్చారు. కానీ ఆ ఫైట్‌ సీన్ల వల్ల కానీ, ఆయా క్యారెక్టర్ల వల్ల కానీ కథకి ఒరిగిన ప్రయోజనం ఏదీ లేదు. గ్యాప్‌ ఫిల్లింగ్‌ కోసమనో లేక కమర్షియల్‌ టచ్‌ కోసమనో చేసిన ఎటెంప్ట్స్‌ అన్నీ ఈ చిత్రానికి అవరోధాలుగా మారాయి. చేరన్‌ డైరెక్ట్‌ చేసిన ‘ఆటోగ్రాఫ్‌’ ఛాయలున్న ఈ సినిమాలో అందులో ఉన్నంత ఫీల్‌ మిస్‌ అయింది. సరిగ్గా హ్యాండిల్‌ చేస్తే ఇలాంటి సినిమాలు థియేటర్లోంచి సరాసరి జ్ఞాపకాల పుటల్లోకి విసిరేస్తాయి. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అప్పుడప్పుడూ అలా పైపైన జ్ఞాపకాలని తట్టి పోతుందే తప్ప వాటి లోతుల్లోకి మాత్రం తీసుకుపోదు. 

గౌతమ్‌ మీనన్‌, చేరన్‌ మాదిరి దర్శకుల్లా చంద్రు రాణించలేదు. తనలో మంచి దర్శకుడైతే ఉన్నాడు కానీ తన కథకి కమర్షియల్‌ హంగుల అవసరం లేకుండా కమర్షియల్‌ వేల్యూ తీసుకురాగలననే నమ్మకం కనిపించలేదు. ఎందుకంటే ఇంత మంచి కథ తన చేతిలో ఉన్నప్పుడు ఇతర హంగుల కోసం ఆరాటపడాల్సిన పనిలేదు. ఈ సినిమాలో చివరి ఘట్టంలో… రాధ తనకోసం వేచి చూస్తుందా లేక పెళ్లయిపోయిందా అంటూ కృష్ణ కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశం నుంచీ స్కూల్లో టీచర్ల గురించి ఇచ్చే స్పీచ్‌ వరకు చూస్తే దర్శకుడి లోతేంటో తెలుస్తుంది. అంతటి సామర్ధ్యం పెట్టుకుని… దాదాపు రెండు గంటల సమయాన్ని చాలా వరకు వృధా చేసాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత నిస్సారంగా సాగిపోయిన సన్నివేశాలు గుర్తు రాలేదంటే మాత్రం క్లయిమాక్సే కారణం. క్లయిమాక్స్‌లో ఉన్నంత డెప్త్‌, ఆ ఎమోషన్‌ సినిమా అంతటా ఉన్నట్టయితే ఇదో క్లాసిక్‌ అయి ఉండేది. 

పాటలు ఫర్వాలేదు కానీ అవసరం లేనన్ని ఉన్నాయి. సంభాషణల్లో కొన్ని బాగున్నాయి కానీ చాలా వరకు సాదాసీదాగా అనిపిస్తాయి. మనసుని తాకే పతాక సన్నివేశాలు, ఆకట్టుకునే సుధీర్‌ అభినయం ‘కృష్ణమ్మ’కి ప్లస్‌ అయినా కానీ అవసరం లేని ఉపకథలు, సమంగా సాగని కథనం మైనస్‌ అయ్యాయి. 

బోటమ్‌ లైన్‌: ఒడిదుడుకుల ప్రేమ ప్రయాణం!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri