సుధీర్ బాబు ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ అయిడెంటిటీ తెచ్చుకుంటున్నాడు. ప్రేమకధాచిత్రమ్, నిన్నటికి నిన్న మోసగాళ్లకు మోసగాడు, మరో రెండు రోజుల్లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని..మరి కొద్ది నెలల్లో భలే మంచిరోజు. ఇలా చకచకా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు, సైలెంట్ బాలీవుడ్ సినిమాలో కూడా చాన్స్ కోట్టేసాడు. అదెలా అని అడిగితే..చాలా చిత్రంగా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. 'నాకు మొదట్నించీ జాకీ చాన్ టైపు ఫైట్లు, ఫీట్లు ఇష్టం.
ఎస్ ఎమ్ ఎస్ సినిమా చివర్న రోలింగ్ టైటిల్స్ లో అలాంటివి కొన్ని వుంటాయి. సరదాగా చేసినవి. ఓ బాలీవుడ్ ట్రయాగిల్ లవ్ స్టోరీకి వాళ్లకో మంచి నటుడు కావాల్సి వచ్చింది. వారి దృష్టి ఎలాగో ఎస్ఎమ్ఎస్ రోలింగ్ టైటిల్స్ మీద పడింది. వెంటనే నా ఐడితో ఫేస్ బుక్ సెర్చ్ చేసి, దాని ద్వారానే నన్ను కాంటాక్టు చేసారు. అలా బాలీవుడ్ లో చేస్తున్నా, ఇప్పటికి ఓ షెడ్యూలు అయింది..కేరళ కలయరిపట్టు విద్య నేపథ్యంలో జరిగే కథ అది…' అన్నాడు.
అవును ఇంతకీ..కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సంగతులు ఏమిటంటే…' మంచి సినిమా..సాధారణంగా సినిమా చూస్తాం..వచ్చేస్తాం..కానీ ఈ సినిమా, డివిడి కొనుక్కుని ఇంట్లో వుంచుకోవాలనిపిస్తుంది..ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు..నాకు ఓ మంచి సినిమాగా వుంటుదని భావిస్తున్నా' అన్నాడు సుధీర్ బాబు.
ప్రేమకథాచిత్రమ్ తరువాత సరైన హిట్ కొట్టలేకపోయారు..ఇప్పుడైనా ఆ కొరత తీరుతుందా అనడిగితే, 'హిట్, ఫ్లాప్ లతో సంబంధం పెట్టుకోను. మంచిసినిమాలు చేసుకుంటూ మంచి ఆర్టిస్టు అనిపించుకొవడమే' లక్ష్యం అంటున్నాడు.
మహేష్ మీ సినిమాలపై ట్వీట్ లు చేయడేమి..అని అడిగితే..మహేష్ సినిమా చూసి కానీ ట్వీట్ చేయడు..ఏదో బావ కదా, అని చూడకుండానే సూపర్, చూడండి అని చెప్పడు..అతనికి వున్న బిజీ షెడ్యూలులో మోసగాళ్లకు మోసగాడు చూడలేకపోయాడు..అందుకే ట్వీట్ చేయలేదు. అంతకన్నా మరేం లేదు' అంటున్న సుధీర్ బాబు, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో పాటు ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని తరువాతే కొత్త సినిమాలు సైన్ చేస్తా అంటున్నాడు.