టీడీపీ అను”కుల”చానల్ ఏబీఎన్ డిబేట్‌లో తనపై దాడి తర్వాత మొదటిసారిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
ఇలాంటి అవాంఛనీయ ఘటనలతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌లో తనపై దాడిని నాటి వైశ్రాయ్ ఘటనతో పోల్చడం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. విష్ణువర్ధన్‌రెడ్డి తాజా ట్వీట్ ఏంటో చూద్దాం.
‘అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్‌లో తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌పై చంద్రబాబు జరిపిన దుశ్చర్య పరంపర ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉంది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన. ప్రజల తరఫున ప్రశ్నించడంలో నేను వెనకడుగు వేసేదిలేదు. ఇలాంటి దాడులకు మేము బెదిరేది లేదు ’అని విష్ణు మండిపడ్డారు.
ఇంతటితో విష్ణు ఆగలేదు. బాబు తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు.
‘అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతునొక్కడం అసాధ్యం. ప్రజా సమస్యలపై మరింత రెట్టింపుగా ఇక ముందూ నా వాణి వినిపిస్తా. నా మీద, మా పార్టీ మీద మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిది’ అని విష్ణువర్థన్‌రెడ్డి హితవు పలికారు. అవమాన భారంతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారని భావించిన ఎల్లో గ్యాంగ్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి తాజా ట్వీట్ తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు.