విశాఖ మేయర్ సీటు అంటే అత్యంత ప్రతిష్టాత్మకం అన్న సంగతి తెలిసిందే. పైగా 98 వార్డులతో అతి పెద్దదైన జీవీఎంసీని కైవశం చేసుకోవడానికి ఎవరైనా ముందుకు ఉరుకుతారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ ఫలితాలతో అర్బన్ లో కూడా గట్టి దెబ్బ తగిలినట్లుగా ఉంది అంటున్నారు.
విశాఖలో 98 వార్డులకు గానూ టీడీపీ గుర్తు మీద పోటీ చేస్తామని నామినేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో పలువురు వైసీపీలో చేరిపోవడంతో పసుపు పార్టీకి ఏం పాలుపోవడంలేదు అంటున్నారు.
ఉత్తర నియోజకవర్గం నుంచి బాక్సర్ రాజు అని పేరున్న అప్పల నరసింహరాజు తాజాగా వైసీపీలో చేరిపోయారు. ఆయన 14వ వార్డు నుండి టీడీపీ తరఫున అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. అదే విధంగా ఇదే నియోజకవర్గంలో మరో సీనియర్ నేత పోటీకి విముఖంగా ఉండడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారుట.
ఇక విశాఖ సౌత్ నుంచి టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్ధులు వైసీపీలో చేరిపోయారు. దీంతో అధికారికంగా ఇలాంటి చోట్ల టీడీపీకి అభ్యర్దులు లేరని తెలుస్తోంది. వైసీపీతో దీంతో ఢీ అంటే ఢీ కొడదామని చూస్తున్న టీడీపీకి ఆదికి ముందే ఇలా అగచాట్లు తప్పడంలేదు అంటున్నారు.
ఇంకో వైపు కార్పోరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైసీపీ గట్టిగా చూస్తూండడంతో ఎంతమంది టీడీపీ అభ్యర్ధులు అఫీషియల్ గా బరిలో ఉంటారో తెలియడం లేదన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి పరోక్ష పద్దతిన జరిగే మేయర్ పోరులో టీడీపీ కార్పోరేషన్ అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో గెలిస్తేనే పోటీ పడగలరు అన్నది నిజం. సీన్ చూస్తే వేరేగా ఉంది మరి.