వంశీ సినిమా అంటే… గుమ్మానికి పచ్చటి తోరణం కట్టినట్టు పద్ధతిగా, సంప్రదాయంగా ఉంటుంది. ఆయన ఫ్రేములోని ఉన్న అందం అలాంటిది. తక్కువ బడ్జెట్లో సినిమా తీసినా చుట్టేయడం ఆయనకు చేతకాని విద్య. చెట్టుకింద ప్లీడరు, సితార, ఏప్రిల్ 1 విడుదల, అన్వేషణ… ఇవన్నీ చిన్న సినిమాలే, తక్కువలో తీసినవే. అయితే క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు.
ఆయన లేటెస్ట్ చిత్రం – మెల్లగా తట్టింది మనసు తలుపు. రెండేళ్లు ఈ సినిమా మూలన పడి.. ఇప్పుడే విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే..అందులో వంశీ కనిపించాడు గానీ (ఆయన ఓ చిన్న పాత్ర చేశాడు లెండి) ఆయన మార్క్ మాత్రం అగుపించలేదు. ఈ సినిమాని సీరియల్‌గా చుట్టేసిన లక్షణాలైతే పుష్కలంగా ఉన్నాయి. వంశీ ఛమక్కుల్లో ఒక్కటీ వినిపించలేదు. సరికదా… ఆయన ఫ్రేమల్లో ఉన్న అందం మచ్చుకైనా కనిపించలేదు.
ఇది వంశీ సినిమానా?? అని ఎవరైనా అనుమానపడతారేమోనని, ఈసినిమాలో ఫస్ట్ టైమ్ ఆయన తెరపై కనిపించారు కూడా. ట్రైలర్ చివర్లో జెండా పట్టుకొని ఊపిన స్టేషన్ మాస్టర్ ఆయనే మరి. వంశీ సినిమాలంటే ఆశగా థియేటర్లకు వెళ్లే ఆయన అభిమానులు సైతం ఈ ట్రైలర్ చూసి పెదవి విరుస్తున్నారు. కనీసం సినిమాలో అయినా విషయం ఉందంటారా???