ఎమ్బీయస్‌ :తెలంగాణ మేధావులెక్కడ? – 1

తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం తెలంగాణలోని మేధావి వర్గాలనే వారు ఊదరగొట్టేశారు. విద్యావంతులని, ఉద్యోగులని, టీచర్లని, విద్యార్థులని, రచయితలని, కళాకారులని, జర్నలిస్టులని, లాయర్లని, డాక్టర్లని.. అనేక వర్గాల నుంచి సంఘాలు, వాటికి నాయకులు, వారు వేదిక…

తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం తెలంగాణలోని మేధావి వర్గాలనే వారు ఊదరగొట్టేశారు. విద్యావంతులని, ఉద్యోగులని, టీచర్లని, విద్యార్థులని, రచయితలని, కళాకారులని, జర్నలిస్టులని, లాయర్లని, డాక్టర్లని.. అనేక వర్గాల నుంచి సంఘాలు, వాటికి నాయకులు, వారు వేదిక ఎక్కి యిలా అన్యాయం జరిగింది, అలా అన్యాయం జరిగింది అంటూ గణాంకాలు వల్లించేవారు. పత్రికల్లో చేంతాడంత వ్యాసాలు. రాసినవే రాసి, చెప్పినదే చెప్పి చావగొట్టారు. ఈ వ్యాసాలకు తోడుగా వెబ్‌సైట్లు, ఈ మెయిల్‌ ఫార్వార్డ్‌స్‌, టీవీ డిస్కషన్లు.. ఒకటి కాదు, ప్రచారం హోరెత్తిపోయింది. మీడియా కొండంత అండగా నిలబడింది. వీళ్లని ప్రశ్నించినవాళ్లను అదిలించారు, బెదిరించారు, అడలగొట్టారు, సమావేశాలకు వెళ్లి చెడగొట్టారు. సమైక్యభావన గురించి మాట్లాడేందుకు అవకాశమే లేకుండా చేశారు. 

ఇది రాజకీయ ఉద్యమం కదా, మీరంతా యిలా విరుచుకుపడడం దేనికి అంటే, 'అబ్బే తెలంగాణ సమాజ పునర్నిర్మాణానికి మేం కంకణం కట్టుకున్నాం. నవ తెలంగాణలో ఏ పొరబాటు జరిగినా మేం తెరాసను కూడా నిలదీస్తాం. రాష్ట్రసాధనతో మా పని పూర్తవదు. ఒక అద్భుతమైన తరం తయారయ్యేవరకూ మా కృషి ఆగదు. అందుకే జెఎసిలను కూడా కొనసాగిస్తాం.' అంటూ చెప్పుకొచ్చారు. కనీసం పాతికేళ్లపాటు యీ మేధావివర్గం యిలాగే ఉత్తేజంగా వుండి అన్యాయాలను ఎత్తిచూపుతూ, అక్రమాలను ఖండిస్తూ, ప్రజల్లో చైతన్యం రగిలిస్తూ వాళ్లు ప్రవచించిన సామాజిక తెలంగాణ (వాటెవర్‌ దట్‌ మీన్స్‌) కళ్లారా చూసి కానీ ఆయుధాలు దింపరన్నమాట అనుకున్నాను. రాష్ట్రప్రకటన వచ్చింది. అమరవీరుల ఆత్మీయుల దగ్గర్నుంచి విద్యార్థులదాకా అందరూ టిక్కెట్లు కోసం ఎగబడ్డారు. తెరాసవారు కొందరు టిక్కెట్లు, మరి కొందరికి పదవులు యిచ్చి వూరుకోబెట్టారు. వీళ్లు 'తృప్తాస్మ' అని త్రేన్చినా, అందలాలు అందనివాళ్లు చాలామంది వున్నారు కాబట్టి వాళ్లయినా కాస్త సందడి చేస్తారని అనుకున్నాను. అబ్బే, ఎక్కడా వులుకూ పలుకూ లేదు. 

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విద్యుత్‌! అది లేనిదే పరిశ్రమలు రావు, విద్యార్థుల చదువులు వానాకాలం చదువులవుతాయి (సామెత అన్వయించదు, నాలుగు చినుకులు పడగానే కరంటు పోతుంది, వేసవికాలం ఎలాగూ కోత, శీతాకాలం చదువులందాం), పంటలు ఎండిపోతాయి. రాష్ట్రానికి న్యాయప్రకారం రావలసిన విద్యుత్‌ తెచ్చుకోకపోతే అన్ని విధాల నష్టపోతాం. ప్రభుత్వం చూడబోతే ఆంధ్రను తిడుతోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావలసిన వాటా యివ్వడం లేదంటోంది. అటు ఆంధ్ర చూస్తే ఏవేవో లెక్కలు చెప్పి, యివ్వాల్సిన దానికంటె ఎక్కువే యిచ్చాం అంటోంది. ఏది సత్యం? ఏదసత్యం? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడగబోతే సమాధానం చెప్పకుండా వాళ్లను తెలంగాణ ద్రోహులంటున్నారు. అఖిలపక్షం పెట్టి, అంకెలు బయటపెడితే వాటి ఆధారంగా అందరం కలిసి అడుగుదాం అన్నా తెరాస వినిపించుకోవటం లేదు. అంకెలు మీకనవసరం, మేం తిడుతున్నాం కాబట్టి మీరూ తిట్టాల్సిందే అంటున్నారు. 'వాళ్లు సకాలంలో విద్యుత్‌ కొనుక్కున్నారట కదా, మీరు ఏమీ చేయలేదట కదా' అని అడిగితే 'మాదేం తప్పు లేదని చెప్తున్నాం కదా, వాళ్లదే తప్పని మీరూ మాతో గొంతు కలపకపోతే మీరు ఆంధ్రా నామినేటెడ్‌ సభ్యులే' అంటున్నారు. ఇక్కడే తెలంగాణ సమాజం గందరగోళపడుతోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావలసిన 54% విద్యుత్‌ వచ్చిందా లేదా? విద్యుత్‌ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేశారు. వాళ్లు గణాంకాలతో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది కదా. 

హరీశ్‌ వగైరాలు మాట్లాడితే కెపిటియస్‌, సీలేరులలో రావలసిన విద్యుత్‌లో వాటా గురించి మాట్లాడతారు. కావాలనే కెపిటియస్‌ కమిషన్‌ చేయడాన్ని ఆలస్యం చేస్తున్నారంటున్నారు. ఒక్కో విద్యుత్‌ ప్లాంటు నుంచి 54% వాటా రావాలని రాసుందా? లేక ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్‌లో 54% వాటా రావాలని రాశారా? అలా రాస్తే ఒక్కో ప్లాంటు లెక్క వేయడానికి వీల్లేదు కదా! కెపిటియస్‌లో, హిందూజా ప్రాజెక్టులో తెలంగాణ వాటా వుంది కాబట్టి దానిపై మా పెత్తనం కూడా నడవాలంటున్నారు. పెట్టుబడి పెట్టినపుడు తెలంగాణ అనేదే లేదు. అప్పటి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఒక భాగమంతే. ఆ లెక్కన మెట్రోలో, ఔటర్‌ రింగు రోడ్డులో, సైబరాబాదులో.. అన్నిట్లోనూ ఆంధ్ర వాటా వున్నట్టేనా? హైదరాబాదు స్టేట్‌ విడిపోయినప్పుడు కొంత భాగం మహారాష్ట్రలో, కొంత భాగం కర్ణాటకలో పోయింది. వాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల్లో వాటాలు అడిగారా? మనం వాళ్ల వూళ్లల్లో వున్న ప్రాజెక్టుల్లో వాటాలడిగామా? అసలీ వాటాల శాతాలు విభజన జరిగేవరకూ వున్న ప్రాజెక్టులకే పరిమితమా? లేక ఉమ్మడి రాజధాని వుండే పదేళ్లకు వరకు కొనసాగుతుందా? లేక ఎల్లకాలమూ కొనసాగుతుందా? ఇలా అనేక సందేహాలు. 

రాష్ట్రాలకు బయట వున్న ఢిల్లీ ఆంధ్రభవన్‌ వంటి ఆస్తుల విషయంలో జనాభా నిష్పత్తిలో వాటా వస్తుందని 6 వ భాగం 47 వ సెక్షన్‌ చెపుతోంది. 53 (1) సెక్షన్‌ ప్రకారం కార్పోరేషన్ల ఆపరేషనల్‌ యూనిట్లను లొకేషన్‌ ప్రకారం, హెడాఫీసు ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోమంటున్నారు. ఇవన్నీ సరిగ్గా అర్థం కావు. పాఠకులు నన్ను అడుగుతున్నారు. నేను మేధావిని కాకపోవడం వలన మొన్నటిదాకా చురుగ్గా వున్న మేధావులెవరైనా ప్రకటనలు చేస్తారేమోనని చూస్తున్నాను. అబ్బే, అందరూ మౌనంగానే వున్నారు. ఎందుకో!? 'ఆస్తులు, అప్పులు అన్నీ జనాభా నిష్పత్తి ప్రకారమే విభజిస్తూ పోతూ వుంటే నేనే కలగజేసుకుని గత ఐదేళ్ల వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌ పంపిణీ జరగాలని బిల్లులో పెట్టించి తెలంగాణకు అధికంగా విద్యుత్‌ సాధించి పెట్టాను' అని సూపర్‌ మేధావి జయపాల్‌ రెడ్డిగారు యిటీవల చెప్పారు. సాధించారు సరే, అది సరిగ్గా అమలు అవుతోందా లేదా అన్న విషయం కూడా చెప్పి వారే పుణ్యం కట్టుకోవాలి.

అటువైపు ఆంధ్ర ప్రతినిథిగా పరకాల ప్రభాకర్‌ ఏవేవో అంకెలు వల్లించేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ సలహాదార్లుగా బోల్డు మంది ఐయేయస్‌లను తీసుకున్నారు. మీడియా సలహాదార్లు వున్నారు. వాళ్లంతా ఏం చేస్తున్నారో కానీ, ప్రభాకర్‌ మాటలను ఖండించటం లేదు. రాజకీయనాయకులే మాట్లాడుతున్నారు. అందులో చంద్రబాబు నింద ఎక్కువ, సరుకు తక్కువ. ఏ ప్రశ్నకూ సూటి సమాధానం దొరకదు. రాష్ట్రం ఏర్పడగానే గబగబా విద్యుత్‌ బుక్‌ చేసుకోవాలి అని బాబు సలహాదార్లకు తోచిన విషయం, కెసియార్‌ సలహాదారులకు ఎందుకు తోచలేదు? ప్రభుత్వంలో పదవులు చిక్కినవారికి అలసత్వం సహజం. బయట వున్న మేధావులైనా పిచ్చాపాటీగా కలిసి చెప్పవచ్చు కదా. కెసియార్‌ అధికారంలోకి వస్తూనే రోజుల.. కాదు నెలల తరబడి అధికారులతో గంటలగంటల సమావేశాలు ఏర్పరచి ఆదేశాలు యిస్తూ పోయారు కదా. దసరా దాకా యిదే కార్యక్రమం నడిచింది కదా. ఆ సమావేశాల్లో ఒక్కరు కూడా 'సార్‌, మీరు చెప్పిన పనులుకు విద్యుత్‌ కావలసి వస్తుంది కదా, యిప్పటికైనా బుక్‌ చేద్దాం' అనలేదా? బాబు ప్రభుత్వం కూడా యిక్కడి నుండే నడుస్తోంది కదా, సెక్రటేరియట్‌లో గోడవతల నుంచి సమాచారం యిక్కడకు లీకవలేదా? 'సార్‌ వాళ్లు చీప్‌గా కొనేశారండీ, మనమూ తొందరపడాలి' అని ఒక్క ఉద్యోగీ చెప్పలేదా? అందరూ రాష్ట్రం వచ్చిందన్న సందడిలో, యింక్రిమెంట్ల సంతోషంలో, పదిహేను రోజుల పాటు బతకమ్మ ఆడే సంబరంలో పడిపోయారా? (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]