టాలీవుడ్ సూపర్‌స్టార్ చెప్పిన దాన్ని ఆచరించడంలోనూ సూపర్ అనిపించుకుంటున్నాడు. శ్రీమంతుడు సినిమాలో పల్లెల అభివృధ్ధి గురించి ఏదో చెప్పేసి ఊరుకోకుండా ఆచరణలోనూ పెడుతున్న మహేష్‌బాబు… అదే క్రమంలో మరో గ్రామం దత్తత తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. తెలంగాణ మంత్రి కెసిఆర్ వినతి మేరకు మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్… అదే విధంగా తెలంగాణలోనూ మరో వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మంత్రి కెటిఆర్ సూచనల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని మహేష్ అభివృధ్ది చేయనున్నాడు.
ఈ సందర్భంగా సదరు గ్రామవాసులు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి మంచి రోజులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆశలు వమ్ము కాకుండా ఉండాలంటే గ్రామాల దత్తత మాత్రమే కాదు అవి నిజంగా అభివృద్ధి చెందే వరకూ వాటిపై గట్టి పర్యవేక్షణ అవసరమనేది మహేష్ గ్రహించాలి. తనకున్న సెలబ్రిటీ ఇమేజ్‌ను ఉపయోగిస్తూనే అవసరమైనంత మేరకు వ్యయప్రయాసలకు సిద్ధమై, దత్తత తీసుకున్న గ్రామాల భవిష్యత్తును తీర్చిదిద్దాలి.
ఎందుకంటే మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం విషయంలో ఆయన తగినంత శ్రధ్ధ చూపించడం లేదనే విమర్శలు అప్పుడే మొదలైపోయాయి. తనకు వీలు కుదరదు కాబట్టి, సమయం చిక్కదు కాబట్టి ఈ పనిని ఆయన తన బంధువు తెదేపా ఎంపి గల్లా జయదేవ్‌కు అప్పగించేసి చేతులు దులుపుకున్నాడని కొందరు మరీ తొందరపడి విమర్శించేస్తున్నారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే మహేష్… తన సినిమా ద్వారా మాత్రమే కాదు బయట చేసే పనుల ద్వారా కూడా ఇన్‌స్పైరింగ్ స్టార్ అవుతాడు.