అమెరికా కూడా ఆంధ్ర దేశంలా మారిపోతోంది, తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు. ఒకప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ అంటే ఏమాత్రం ఆసక్తి వుండేది కాదు. ఎవరైనా అడిగితే, ఏదో చిన్న మొత్తం తీసుకుని ఇవ్వడం తప్ప, అక్కడ ఏమైనా వచ్చిందా, వస్తుందా, అన్నది పెద్దగా పట్టింపు వుండేది కాదు. కానీ గడచిన పదేళ్లుగా ఓవర్ సీస్ ఇన్ కమ్ గణణీయంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఓవర్ సీస్ అన్నది ఏ రేంజ్ కు చేరింది అంటే, సినిమాకు అది ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదంతా తెలిసిందే.
ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేమిటంటే, ఓవర్ సీస్ మార్కెట్ తో పాటు, ఓవర్ సీస్ ప్రేక్షకులకను కూడా గుర్తించడం. ఓవర్ సీస్ మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణం అక్కడి తెలుగు ప్రేక్షకులు. వారి సినిమా అభిమానం. అందువల్ల ఇప్పుడు ముందు వారిలో మరింత సినిమా పిచ్చి లేదా అభిమానం పెంచాలన్న తాపత్రయం కనిపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రేక్షకులను ఏవిధంగా ఎంటర్ టైన్ చేసి, సినిమా పట్ల, సినిమా నటుల పట్ల ఆదరణను పెంచుతారో ఓవర్ సీస్ లో కూడా అలాగే చేస్తున్నారు.
సినిమా హిట్ అయిన తరువాత ఓవర్ సీస్ లో సభలు సమావేశాలు నిర్వహించడం, ప్రేక్షకులను మీట్ అవ్వడం నుంచి ఇప్పుడు వారి కోసం అడియో ఫంక్షన్లు నిర్వహించే వరకు వెళ్లారు. భలే భలే మగాడివోయ్ కోసం మారుతి టీమ్ ఓ తరహా విజయ యాత్రలు పూర్తి చేసింది. అఖిల్ సినిమా అడియో ఫంక్షన్ తో పాటు, అక్కడ సమావేశాలు నిర్వహించారు. శ్రీమంతుడు 50డేస్ ఫంక్షన్ అక్కడ చేస్తారంటున్నారు. ఇలా రాను రాను ఇలా ఇవన్నీ ఆనవాయితీగా మారిపోతాయిు. పెద్ద సినిమాల అడియో ఫంక్షన్లు, అలాగే సక్సెస్ లేదా థాంక్స్ గివెన్ మీట్లు తరచు ఓవర్ సీస్ లో కామన్ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
పైగా అక్కడి ప్రేక్షకులు కూడా ఈ తరహా ఎంటర్ టైన్ మెంట్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్ మన నటులను, మన సినిమా సెలబ్రిటీలను కలుసుకోవడం వారికి మాంచి సరదాగానే వుంది. అందవల్ల ఇక అమెరికాలో కూడా టాలీవుడ్ హడావుడి ఓ రేంజ్ లో వుంటుంది.