ఆర్తీ…గుర్తుకొస్తున్నావ్…

అన్ని తారలు వెలుగులు విరజిమ్మవ్..కొన్ని అర్థాంతరంగా రాలిపోతాయి. ఆర్తీ అగర్వాల్ ది కూడా అలాంటి జీవితమే. ఉవ్వెత్తున లేచింది పైకి. కానీ అంతలోనే చటుక్కున నేలరాలింది. 'ఓ నవ్వు చాలు..ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది..'…

అన్ని తారలు వెలుగులు విరజిమ్మవ్..కొన్ని అర్థాంతరంగా రాలిపోతాయి. ఆర్తీ అగర్వాల్ ది కూడా అలాంటి జీవితమే. ఉవ్వెత్తున లేచింది పైకి. కానీ అంతలోనే చటుక్కున నేలరాలింది. 'ఓ నవ్వు చాలు..ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది..' అని వినిపించిన నువ్వు నాకునచ్చావ్..ఆమె తొలిసినిమా. ఈ సినిమాకు కథ మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. పెద్ద హిట్. ఆ వెంటనే నువ్వులేక నేను లేను..అదీ హిట్. మరి వెను తిరిగి చూడలేదు. 

తరుణ్, ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున,బాలకృష్ణ, రవితేజ, సునీల్, రాజశేఖర్, ఇలా దాదాపు ఇలా అందరి తోనూ నటించింది. కానీ ఏం లాభం..చిన్న స్టెప్ జీవితాన్ని తారుమారు చేసింది. విఫల ప్రేమ ఆమె చేత ఆత్మహత్యా ప్రయత్నం చేయించింది. దాంతో కెరీర్ తల్లకిందులైంది. వెలుగుల మాయమై, చీకటి మిగిలింది. మనిషి లావైపోయింది. అందం తరిగిపోయింది. చాన్సులు కరిగిపోయాయి. సుఖం మాట కేమో కానీ కష్టాలు కట్టగట్టుకువస్తాయి. అదే ఆర్తి ఆరోగ్యాన్ని కుంగదీసి వుండొచ్చు. 

ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధితో అమెరికాలోని న్యూజర్సీలో మరణించింది. అందరు తారల జీవితాలు సదా అయిదు నక్షత్రాల స్థాయిలోనే వుండిపోవు…కొందరి బతుకులు ఇలా అర్థాంతరంగా కూడా విషాదాంతాలవుతాయి. ఆర్తీ..నీ నవ్వు చాలు..అభిమానులు నిన్ను మరిచిపోకుండా వుండడానికి.