గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విషయాల్లో అయితే తీవ్రంగా విమర్శించిందో.. భారతీయ జనతా పార్టీ అచ్చంగా అవే పనులు చేస్తూ.. జనాలను విసుగెత్తిస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకూ, పాలనకూ సంబంధం లేకుండా సాగుతూ ఉంది మోడీ పాలన. 2014 ఎన్నికల ప్రాతిపదికన తీసుకుంటే.. అప్పటికీ ఇప్పటికీ సామాన్యుడి బతుకు నానాటికీ తీసికట్టుగా తయారైందే తప్ప, ఇప్పటి వరకూ చెప్పుకోవడానికి అయినా మోడీ ప్రభుత్వం ఉద్ధరించిన దాఖలాలు లేవు.
కాంగ్రెస్ వాళ్లు పెట్టిన కొన్ని పథకాలే కరోనా సమయంలో కూడా జాతిని కొంత కాపాడాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కరోనా లాక్ డౌన్ సమయంలో పట్టణాల్లో, నగరాల్లో పనులు చేసుకునే కార్మికులు సొంతూళ్ల బాట పట్టగా.. అప్పుడు వారిని కొద్దోగొప్పో అదుకున్నది వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకమే!
ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా చెప్పుకోవడానికి అలాంటి పని చేయలేక.. ఆఖరికి పెట్రోల్ ధరల పెంపుకు కూడా గతంలోని కాంగ్రెస్ పాలనే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడటం ఇటీవలి కాలంలో ప్రహసనంగా మారింది. జనాలు పెట్రోల్ ధరల గురించి విసుగెత్తిపోయిన దశలో ఉన్నారు. భక్తులకు ఆ మంట తెలియకపోవచ్చు కానీ.. అన్ని నిత్యవసరాల ధరల పెరుగుదలకూ పెట్రో ధరలే కారణం అవుతాయని ప్రజలెవరికి భక్తులు చెప్పనంత మాత్రాన తెలియనిది కాదు.
ఆ సంగతలా ఉంటే.. గుజరాత్ లో భారీ ఎత్తున పునర్నిర్మించిన మొతెరా ఏరియాలోని స్టేడియంకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేరు పెట్టడం బీజేపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అని స్పష్టం అవుతూ ఉంది.
ఇన్నాళ్లూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పి బీజేపీ బోలెడంత రాజకీయాన్ని పండించింది. ఇప్పుడు అదే స్టేడియానికి మోడీ పేరు పెట్టడం కాంగ్రెస్ కు అవకాశంగా మారింది. అయితే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు పటేల్ పేరు అలాగే ఉందంటూ బీజేపీ వాదిస్తూ ఉంది. కానీ ఇంత అర్జెంటుగా నరేంద్రమోడీ స్టేడియం అంటూ నామకరణం చేయడం, బ్రేకింగ్ న్యూస్ లుగా అది జాతీయ వార్తల్లో నిలవడం.. మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
ఏదేమైనా.. ఇన్నాళ్లూ నెహ్రూ, ఇందిర, రాజీవ్..ల పేర్ల విషయంలో తీవ్ర విమర్శలు చేసి.. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తూ ఉండటం, తమ పేర్లను తామే పెట్టేసుకుంటూ ఉండటం.. కమలం పార్టీని పలుచన చేస్తోంది. దీన్ని బత్తాయిలు ఎంతగా సమర్థించుకున్నా… ప్రజలపై ఒక ఇంప్రెషన్ మాత్రం పడుతుంది. కాంగ్రెస్ వాళ్లు చేయలేదా? అని బీజేపీ ప్రశ్నించడమే.. ఆ పార్టీ ఫెయిల్యూర్ కు చివరి మెట్టు!
ఇక 2014తో పోలిస్తే.. 2019 లో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి.. అనే లెక్కలు చెబుతూ, మోడీ విధానాలన్నింటినీ ప్రజలు మెచ్చుకుంటున్నారు అనే భ్రమల్లో కూడా కొందరున్నారు. అయితే.. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్ కు వచ్చిన ఎంపీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ! దాదాపు 50 ఎంపీ సీట్ల బలం పెరిగింది దేశ వ్యాప్తంగా! అలాంటి పార్టీ పరిస్థితి 2014 నాటికి ఏమయ్యిందో గుర్తెరగాలి! తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కు తగ్గే సంప్రదాయం లేని బీజేపీ ప్రభుత్వం.. ఒకసారి కొన్నింటిని అయినా సమీక్షించుకుంటే వారికే మంచిదేమో!