గుజరాత్లో పాలితాణా అనే జైన పుణ్యక్షేత్రం వుంది. జైన తీర్థంకరులు 24 మంది వుంటే వారందరూ సందర్శించిన ప్రదేశమది. శత్రుంజయ నది ఒడ్డున శత్రుంజయగిరిపై 27 వేల విగ్రహాలతో, మూడు వేల గుళ్లతో అలరారే దేవాలయసముదాయం అది. వెళ్లాలంటే 3600 మెట్లు ఎక్కాలి కానీ జైన మతస్థులందరూ విధిగా అక్కడికి వెళతారు. అది పవిత్రస్థలం కాబట్టి జైనమతం అహింసను బోధిస్తుంది కాబట్టి ఆ ప్రాంతమంతటిలో శాకాహారం తప్ప మరొకటి లభ్యం కాకుండా చేయాలని జైనులు ఆందోళన చేస్తున్నారు. కొండ ఎక్కేందుకు తొలిమెట్టు వున్న తలేటీ నుండి 250 మీటర్లలోపు మాంసాహారం అమ్మకూడదన్న నిబంధన 1999లోనే విధించారు. శత్రుంజయ నదికి వెళ్లే దారిలో కూడా మాంసాహారాన్ని అనుమతించరు. అయితే యిప్పుడు దాన్ని విస్తరించి వూరికి 9 కి.మీ. వ్యాసార్థం వరకు 'వెజిటేరియన్ ఓన్లీ జోన్' గా ప్రకటించాలని జైనుల డిమాండ్. తక్కిన చోట్ల కన్న గుజరాత్లో శాకాహారం ఎక్కువే అయినా జనాభాలో 68% మంది మాంసాహారులే. ముస్లిములు, క్రైస్తవులు, పార్శీలు, యూదులు, గిరిజనులు, కొన్ని వెనకబడిన కులాలవారు, కొన్ని అగ్రకులాలవారు మాంసం తింటారు. పాలితాణా వరకు చూస్తే అక్కడి జనాభాలో 25% మంది ముస్లిములు. కోలీలు, సింధీలు, దళితులు 35% వరకు వుంటారు. వీరందరూ మాంసాహారులే. బయటినుండి తీర్థయాత్రకై వచ్చే జైనుల కోసం మా ఆహారపు అలవాట్లు మార్చుకోమంటే ఎలా? అని వీరు అడుగుతున్నారు.
గుజరాత్ జనాభాలో జైనులు 1% మాత్రమే అయినా వ్యాపారంలో సింహభాగం వారిదే. అందువలన రాజకీయాలను శాసించగలుగుతున్నారు. పాలితాణాలో తమ మాట చెల్లాలనే పట్టుదలతో వున్నారు. శ్వేతాంబర జైనుల్లో ఒక శాఖ అయిన జంబూద్వీప్ వారి ఆశ్రమం యీ విషయంలో ఒక ఉద్యమం చేపట్టింది. ''జైన పుణ్యస్థలమైన పాలితాణాలో రోజూ 2 వేల జంతువులను చంపుతున్నారు, 68 మంది కసాయిలున్నారు. వారి పేర్లు ఫలానా ఫలానా. వారు వారి వృత్తి మానేస్తే వారి పునరావాసానికి తలా రూ. 9 లక్షలు యిస్తాం. మాంసాహారం అమ్మే హోటళ్లు మూసేస్తే రూ. 5 లక్షలు యిస్తాం.'' అంటూ పోస్టర్లు వేసి, కరపత్రాలు వేసి పంచుతున్నారు. ఇప్పటిదాకా 15 మంది ఆ వృత్తి మానేశారని వారు చెప్పుకుంటున్నారు. పాలితాణాలోని కసాయివారందరూ ముస్లిములే. వీరితో పాటు సికిల్గర్ శిఖ్కులపై కూడా జైనుల కన్ను పడింది. ఆ శిఖ్కులు పందులను పెంచి అమ్ముతూంటారు. పాలితాణాలో తరతరాలుగా హిందూ, జైన్, ముస్లిములు సహజీవనం సాగిస్తున్నారు. అన్ని జైన దేవాలయాలున్న శత్రుంజయగిరి పై అంగార్ పీర్ అనే ముస్లిము ప్రార్థనాస్థలం వుంది. పిల్లలు పుట్టని దంపతులు – అన్ని మతాలవారూ – అక్కడకి వచ్చి ప్రార్థిస్తారు.
ఇప్పుడు జైనులు యిలా ఉద్యమం లేవనెత్తడం కొందరు జైనులకే నచ్చటం లేదు. 'హింస అనుమతించే మతాల వారు కూడా జంతువులను చంపడంలో తమ తమ మతధర్మాలను పాటిస్తారు. మన నమ్మకాలను వారిపై రుద్దకూడదు. ఇవాళ యిదంటున్నారు. దీనికి ఒప్పుకుంటే రేపు ఉల్లిపాయ, బంగాళాదుంప కూడా నిషేధించాలంటారు.' అంటున్నారు. ''బదరీనాథ్, హరిద్వార్, పూరి, ఉజ్జయిని, బృందావనం లాటి ప్రదేశాలలో మాంసాన్ని నిషేధించలేదా? ఇక్కడెందుకు ఆ పని చేయించలేం?' అని జైనులు పట్టుబడుతున్నారు. మోదీకి కుడిభుజంగా వుంటూ దేశవ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న అమిత్ షా జైన్ మతస్థుడే. అతని సహాయంతో యీ ఉద్యమం యిటీవల మరింత వూపు అందుకుంది. జైనులు గుజరాత్ ప్రభుత్వానికి విన్నపం పంపుకోవడం, దానిపై భావనగర్ జిల్లా కలక్టరు స్పందించి పాలితాణా మునిసిపాలిటీని దీనిపై ఆలోచించి జులై 30 నాటికల్లా నిర్ణయం తీసుకోమనడం జరిగాయి. ఈ లోపునే అనధికారికంగా నిషేధం అమలవుతోంది కాబట్టి ఆ నిర్ణయం ఎలా వుండబోతోందో ఎవరైనా ఊహించుకోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)