తమ మనోభావాలను దెబ్బతీసేలా సంభాషణలున్న ఆదిపురుష్ సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సీబీఎఫ్సీ జారీ చేసిన సర్టిఫికెట్ విషయంలో తాము జోక్యం చేసుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ అంశం గురించి అలహాబాద్ హై కోర్టులో ఒక కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తదుపరి చర్యలను సుప్రీం కోర్టు పెండింగ్ లో పెట్టింది.
ఆదిపురుష్ సినిమా తీవ్ర వివాదాలతో వార్తల్లో నిలిచింది. ప్రత్యేకించి ఈ సినిమాలో పురాణ పాత్రల సంభాషణలు దుమారం రేపాయి. క్రిటిక్స్ నుంచి విమర్శలు రావడం, ఈ డైలాగులేంటంటే ప్రేక్షకులు నవ్వుకోవడం, ఆ పై మనోభావాల బ్యాచ్ కూడా తీవ్రంగా స్పందించింది ఆ డైలాగుల పట్ల. ఈ నేపథ్యంలో పలువురు కోర్టుకు ఎక్కారు. ఇలాంటి కేసు అలహాబాద్ హైకోర్టులో విచారణలో ఉంది.
జూలై 27వ తేదీన ఈ సినిమా రూపకర్తలు తమ ముందు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పిటిషన్ నే సుప్రీం కోర్టులో కూడా విచారణకు వచ్చింది. సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ ఈ పిటిషన్ లో కోరారు.
అయితే అందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఎలాగూ అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి.. ఆ విచారణ ప్రక్రియ తర్వాత ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు తదుపరి విచారించవచ్చు కాబోలు. మొత్తానికి ప్రభాస్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ అయితే రద్దు కాలేదు. ఒకవేళ అది రద్దు అయితే.. ఈ సినిమా తదుపరి సెన్సార్ చేయించుకునే వరకూ ఎక్కడా ప్రదర్శనకు ఆస్కారం ఉండేది కాదు.
ఈ సినిమా సంభాషణల విషయంలో మొదట్లో రచయిత సమర్థించుకోగా, ఆ తర్వాత ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే క్షమాపణలు అంటూ రూపకర్తలు ప్రకటించారు. మరి ఇలాంటి నేపథ్యంలో అలహాబాద్ కోర్టు లో విచారణ ఏ రకంగా సాగుతుందో!