భారతీయ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య ఐదు కోట్లకు పై మాటే అని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పార్లమెంట్ కు ఈ సమాచారాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య వివరాలను వెల్లడించింది.
పెండింగ్ లో ఉన్న ఐదు కోట్ల కేసుల్లో జూలై ఒకటి నాటికి సుప్రీం కోర్టులో 69,766 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదే హైకోర్టుల విషయానికి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లోనూ కలిపి 60.62 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో అత్యధిక స్థాయిలో 4.41 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండటం గమనార్హం.
పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య గురించి చర్చ ఈనాటిది ఏమీ కాదు. దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల గురించి అనేక మార్లు అనేక మంది స్పందించారు. జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే మాటను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ చర్చ వరకే. పెండింగ్ లోని కేసుల పరిష్కారం ఎడతెగనిది.
సివిల్ కేసులు అయితే దశాబ్దాలకు దశాబ్దాలు గడుస్తున్నా వాటి గతి అలాగే ఉంటోంది. జిల్లా స్థాయి కన్నా కింది కోర్టుల్లో ఇలాంటి కేసులు దశాబ్దాలకు దశాబ్దాలు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఇక హై కోర్టు స్థాయిలో విచారణకు రావడానికే దశాబ్దాల సమయం పడటం సహజం అయ్యింది.
ఇక 9 యేళ్లలో సుప్రీం కోర్టుకు అదనంగా, ప్రత్యామ్నాయంగా.. 56 మంది జడ్జిల నియామకం జరిగిందని, హై కోర్టులకైతే అదనంగానే 653 మంది న్యాయమూర్తుల నియామకం జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.