నారా రోహిత్ మంచి నటుడు. కానీ తన ఫిజిక్ మీద దృష్టి పెట్టక, సరైన ప్లానింగ్ లేక తెరమరుగయ్యారు. చాలా ఏళ్లుగా అస్సలు ప్రేక్షకుల దగ్గరకే రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, రాజకీయాల్లో బిజీగా వున్నారని, నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత సరిగ్గా ఎన్నికలు దగ్గరకు వస్తుండగా సినిమా ప్రకటించారు. అది కూడా టీవీ 5 మూర్తి దర్శకత్వంలో.
ఇది మరీ ఆశ్చర్యం. జర్నలిస్ట్ టీవీ5 మూర్తి ఒక్కసారిగా డైరక్టర్ అవతారం ఎత్తడం. అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడం, అదీ కాక గతంలో నారా రోహిత్ చేసిన ప్రతిధ్వని ఛాయలు వుండడం, ఇవన్నీ కాక టైటిల్ కూడా ప్రతిధ్వని 2 అని పెట్టడం.
సో కచ్చితంగా కాంటెంపరరీ పాలిటిక్స్ ప్రస్తావని, వ్యవహారం వుంటాయి. అందులో సందేహం లేదు. పైగా నారా రోహిత్ పొలిటికల్ కెరీర్ కు పనికి వచ్చేలా వుంటుందని ఊహించడం తప్పేం కాదు, రాంగ్ అంతకన్నా కాదు.
జర్నలిస్ట్ గా అగ్రెసివ్ నేచర్ వున్న మూర్తి, సినిమాను ఏ రేంజ్ లో తీస్తారని వేచి చూడాలి. కాన్సెప్ట్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కనుక రోహిత్ ఫిజిక్ సమస్య రాదు. అయినా రోహిత్ ఎలా వున్నారో అన్న ఫొటోలు బయటకు వచ్చి చాలా కాలం అయింది.