ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తన మార్క్ పంచ్‌లు విసిరారు. సెటైర్స్‌తో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై బాదుడే బాదుడంటూ సెటైర్స్‌తో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై ధరలు, వివిధ రకాల చార్జీల ధరల పెరుగుదలను చూపుతూ బాదుడే బాదుడని విమర్శిస్తుంటే, వాటినే తీసుకుని అంబటి రివర్స్ అటాక్ చేయడం విశేషం.
చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో తాము హాజరు కాకపోతే, విమర్శించిన సంగతిని గుర్తు చేశారు. అంబటి మీడియాతో మాట్లాడుతూ చంద్ర బాబుకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రావడం లేదన్నారు.
నాడు శాసనసభకు రానివారు జీతాలు కూడా తీసుకోకూడదంటూ ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికంటే ధరలు ఇప్పుడే చౌకగా ఉన్నాయని అంబటి చెప్పడం విశేషం. ఈ దేశంలో గత మూడేళ్లలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీనివల్ల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా బాదుడే బాదుడు అని రాతలు రాయడం.. వీళ్లు డ్యాన్సులు చేయడం రివాజుగా మారిందని ఎద్దేవా చేశారు.
మీకు 175 సీట్లలో ప్రజలు బాదుడే బాదుడు చూపించారని వెటకరించారు. నీ కుమారుని మంగళగిరిలో బాదింది అసలు బాదుడని చంద్రబాబును దెప్పి పొడిచారు. జన్మభూమి కమిటీల ద్వారా మీరు చేసింది బాదుడే బాదుడని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్సార్ 2004, 2009లో చూపించింది బాదుడే బాదుడన్నారు.
జగన్ వచ్చాక మీకు ఆ బాదుడు మరింత ఎక్కువైందిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను నమోదు చేసుకున్న విషయాన్ని గణాంకాలతో సహా అంబటి వివరించారు. కుప్పంలో 4 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఒకటన్నా గెలిచారా? అని నిలదీశారు. నీ (చంద్రబాబు) కుప్పంలోనే తుక్కు తుక్కుగా ఓడించి అసలైన బాదుడు చూపించారని అంబటి వెటకారంతో ప్రతిపక్షాన్ని ఆడుకున్నారు.
నీ దత్తపుత్రుడిని రెండు చోట్లా ఓడించి బాదుడు చూపించారని పరోక్షంగా జనసేనాని పవన్‌కల్యాణ్ ఓటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముగ్గురూ కలిసి కట్టుగా వచ్చినా రాబోయేది తమ ప్రభుత్వమే అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇదిలా వుండగా బాదుడే బాదుడని జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు వ్యంగ్యోక్తులు విసురుతుంటే, వాటికి దీటుగా అంబటి సమాధానం ఇవ్వడం విశేషం.