వెటరన్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్ సినీరంగ ప్రవేశం గురించి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్రహీరో కొడుకు ఆరంగేట్రం సినిమాలో జాన్వి హీరోయిన్ గా ఫిక్సయిపోయినట్టు పుకార్లు షికారు చేశాయి. అయితే తర్వాత శ్రీదేవి ఈ వార్తలను తోసిపారేసింది. తన కూతురు చదువుకుంటోందని, ఆమె ఇప్పుడే హీరోయిన్ అవ్వాలని తానేమీ అనుకోవడం లేదని కూడా చెప్పింది.
అయితే శ్రీదేవి తరచుగా తనతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లలో వేడుకలకు కూతుర్ని కూడా తీసుకువెళ్లడంతో ఎప్పుడో ఒకప్పుడు జాన్వి కూడా తెరకెక్కడం ఖాయం అనే విశ్లేషకులు అంచనా వేశారు. దాంతో అడపా దడపా జాన్వి సినీ రంగప్రవేశంపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మళ్లీ ఇప్పుడు జాన్వి కపూర్ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి మరింత డీటైల్డ్‌గా, నమ్మదగినట్టుగా.
అదేమిటంటే… ఈ ఏడాదితో 18ఏళ్లు నిండి 19లోకి అడుగుపెట్టనున్న జాన్వి… మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కొడుకు ఓకె బంగారం ఫేమ్ డాల్కర్ సల్మాన్‌తో జత కట్టనుందని. వీరిద్దరూ జంటగా ఓ సినిమా రానుందని. ఈ సినిమాకు కధను బాహుబలి, భజరంగ్ భాయీజాన్‌లతో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న తెలుగు రచయిత కెకె విజయేంద్రప్రసాద్ అందించనున్నాడని, దీనిని తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రూపొందించనున్నారని కూడా వార్తలు రెండ్రోజులుగా హల్‌చల్ చేశాయి.
అటు మొన్నటి టాప్ హీరోయిన్ కూతురు, నిన్నటి సూపర్‌స్టార్ తనయుడి జంట ప్రేక్షకులకు కను విందేనని సిని పండితులు జోస్యం చెప్పేశారు. అయితే శ్రీదేవి మంగళవారం ఈ వార్తలపై స్పందిస్తూ ఈ సమాచారం ఉట్టిదేనని తేల్చేసింది. తన కూతురు విదేశాల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందని త్వరలో భారత్‌కు తిరిగి రానుందని శ్రీదేవి తెలియ చేసింది.
ఏదేమైనా… కూతురి చదువు విషయంలో శ్రీదేవి చాలా పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. బాగా చదువుకోవాలనే ఆశ తీరకుండానే సినిమాల్లోకి వచ్చేసిన తనలా కాకుండా తన కూతురు ఉన్నత విద్యా వంతురాలు కావాలని శ్రీదేవి భావించడంలో తప్పులేదు. అయితే సినిమాలపై ఆసక్తి చూపుతున్న జాన్వి మనసులో ఏముందో తెలియాలంటే… ఆ టీనేజ్ బ్యూటీ ఇండియాకు వచ్చేదాకా ఆగాల్సిందే.