అన్ని పాత్రలూ అందరూ చెయ్యలేరు. నూటికో కోటికో ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు లాంటి గొప్ప నటులు మాత్రమే కొన్ని పాత్రలు చేయగలరు. మిగతా హీరోలు అవి వేస్తే అభాసుపాలవ్వక తప్పదు. తాజాగా హీరో రాణా నటించిన ‘బాహుబలి’ చిత్రంలోని తన పాత్ర బళ్లాలదేవుడిగా కనీ వినీ ఎరుగుని రీతిలో నటించేశాననీ, ఆ పాత్ర ఆసరమాయణంలోని రావణుడినీ, భారతంలోని దుర్యోధనుడ్ని గుర్తుకు తెస్తుందని సెలవిస్తున్నాడు.
అసలు ఆ పాత్ర కోసం కొన్ని కిలోల బరువైన దుస్తులు తొడుక్కుని ఎంతో భారంగా నటించాననీ చెబుతున్నాడు. నిజానికి రాణాకు విలన్ పాత్రలను పోషించే ఆహార్యం అయితే వుంది. మరి అభినయం, వాచకం సంగతి ఏంటి? ఎన్టీఆర్, ఎస్వీ రంగారావుల మాదిరి పాత్రలతో పోల్చుకోవడం అతిశయం కాదా? ఆ పాత్ర గురించి రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది.
రాణా లాంటి ఒడ్డూ పొడుగూ వున్న నటీనటులు తెలుగు పరిశ్రమకు కావాలి. కేవలం ఆకారంతోనే హిట్ కొట్టలేరు కదా. నటన అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. ఆ సంగతి రాణాకి కూడా తెలిసే వుంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న బెంగళూరు డేస్ సినిమా ఎంతో హాయిగా వుందనీ, పౌరాణిక తరహా దుస్తులు లేకుండా రెగ్యులర్ డ్రెస్‌లతో ఆనందంగా వున్నానంటున్న రాణా జాతకం అంతా ‘బాహుబలి’ చిత్రంపైనే ఆధారపడి వుంది కాబట్టి వెయిట్ చేస్తే బెటర్.