ఫలానా షాంపూ వాడండి.. జుట్టుని సిల్కీగా మలచుకోండి.. అనే ప్రకటనలు ఎక్కడికక్కడ కనిపిస్తాయి. హీరోయిన్లే వీటికి ప్రచారకర్తలు. అందమైన మేని ఛాయ కోసం ఫలానా క్రీమ్ వాడండి.. క్షణాల్లో తెల్లగా మారిపోండి.. ఇలాంటి ప్రకటనలూ కోకొల్లలు. వీటికీ హీరోయిన్లే బ్రాండ్ అంబాసిడర్లు. సినిమాల్లో హీరోయిన్గా నటిస్తే వచ్చే సంపాదనతో సమానంగా ఇప్పుడు ప్రకటనలతో అందాల భామలు సంపాదించేస్తున్నారు.
ఇది ఇప్పటి ట్రెండ్ కాదు. ఎంతో కాలంగా నడుస్తున్నదే. అయితే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మాత్రం ఇలాంటి ప్రకటనల్లో నటించడం తన వల్ల కాదంటోంది. నల్లగా వున్నవారు తెల్లగా మారిపోండి.. అనడం నల్లగా వున్నవారిని అవమానపర్చడమేననీ, ప్రకటనలతో మోసం చేయడం తనకు ఇష్టం వుండదనీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
‘నలుపు, తెలుపు.. ఏ రంగు అయినా అది దేవుడు ఇచ్చినదే..’ అంటున్న కంగనా, పెళ్ళి, ఇతర ఫంక్షన్లలో హీరోయిన్లు, హీరోలు డాన్సులు వేయడం కూడా తనకు గిట్టని వ్యవహారమని తేల్చేసింది. పబ్లిసిటీ కోసం పాకులాడను కాబట్టి, ప్రకటనల్లో కన్పించను కాబట్టే తనకు పాపులారిటీ రావడానికి పదేళ్ళు పట్టిందంటోంది కంగనా. తన వయసు 28 ఏళ్ళు అనీ, అప్పుడే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదనీ, ఇంకా జీవితంలో స్థిరపడాల్సి వుందనీ, అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిస్తానని కంగనా చెబుతోంది.
రెబల్ భావాలు వుంటే వుండొచ్చుగానీ, వాటినలా బయటకు ఎక్స్ప్రెస్ చేసేస్తే, కంగనాకి నచ్చని చాలా అంశాల చుట్టూ మిగతా హీరోయిన్లు పరుగు పెడ్తున్నప్పుడు వాళ్ళంతా కంగనా కామెంట్స్ విని ఏమైపోవాలి.?