రాహుల్ గాంధీ కెసియార్‌ను మినీ మోదీ అని ఎందుకన్నారో తెలియదు కానీ, తననుకున్నది చేయడానికి వెరవకపోవడంలో యిద్దరికీ పోలిక వుంది. జాతీయస్థాయిలో ప్రతిపక్షంలాగానే తెలంగాణలో కూడా ప్రతిపక్షం కూడా చచ్చుబడి వుంది. అక్కడ పార్టీ ఫిరాయింపులు లేవు, యిక్కడ అవీ వున్నాయి. ఏ ప్రతిపక్ష నాయకుడికీ తన సహచరుడు తనతో బాటే వుంటాడన్న నమ్మకం లేదు. నియోజకవర్గంలో పనుల కోసం.. అన్న ఒక్క సాకు చెప్పి గోడ దూకేయవచ్చు. కెసియార్ చేస్తున్న తలతిక్క పనుల గురించి మీడియా కూడా గట్టిగా పోట్లాడటం లేదు. ఆంధ్రజ్యోతి ఒక్కటీ కాస్త గట్టిగా రాస్తోంది కాబట్టి దాని ఛానెల్ ఎవరికీ కనబడకుండా చేసేశారు కెసియార్. ఎవరేం చెప్పినా వినటం లేదు. నిషేధానికి కొన్నాళ్లలో ఏడాది అవుతుంది. ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలబడడానికి మీడియాలోని యితర పెద్దలకు దమ్ము చాలటం లేదు. అందరికీ యిక్కడ స్థిరాస్తులున్నాయి, కెసియార్ మొండివాడనీ, తలచుకుంటే ఏమైనా చేయగలడనే ఎఱిక వుంది. అందుకని అందరూ సహిస్తున్నారు.
ఈ వైభోగం ఎంతకాలం నడుస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన చూపు ఉస్మానియా యూనివర్శిటీ స్థలాలపై పడింది. ఇప్పటికే కొంత స్థలం కబ్జా అయిపోయింది. ఉద్యమకాలంలో ఆ స్థలాన్ని మళ్లీ రాబడతామని అన్నారు. అది రాబట్టకపోగా యిప్పుడు ప్రభుత్వమే 11 ఎకరాలు కబ్జా చేస్తోనంటోంది. దానికి ఒప్పుకోం అని ఉస్మానియా విద్యార్థులంటే వారిని మెచ్యూరిటీ లేని పోరగాండ్లు అనేశారు కెసియార్. మరి యిదే పోరగాండ్లు మొన్నటిదాకా ఉద్యమానికి దీపధారులు. విప్లవవీరులు. అధికారం చేజిక్కేసరికి చవటల్లా కనబడుతున్నారు.
వాళ్లకు మెచ్యూరిటీ లేదన్న మాట అక్షరాలా నిజం. ఉండి వుంటే తెలంగాణ రావాలని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వాళ్లల్లో ఒక్కడికి ప్రాణం మళ్లీ వచ్చి లేచినా, యీనాటి తెలంగాణ చూస్తే దీని కోసమా నేను ఆత్మత్యాగం చేసినది అని హతాశుడై మళ్లీ మరణిస్తాడు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతంతా ఆశపడింది. ఏడాది పాలనలో ఎన్ని వచ్చాయి? అని అడిగితే 60 ఏళ్లగా రానివి ఒక్క ఏడాదిలో వస్తాయా? అని పాలకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు బుగ్గకార్లు, ఇన్నోవాలు, పార్లమెంటు సెక్రటరీ పదవులు, జీతభత్యాల పెంపు అన్నీ నెలల్లోనే వచ్చేశాయి. వీళ్ల ఉద్యోగాలకు మాత్రం యింకో 60 ఏళ్లు ఆగాలా? ఐదేళ్లలో లక్ష వుద్యోగాలు వస్తాయనుకుంటే ఏడాదిలో 20 వేలైనా రావాలి కదా! 20 వందలైనా వచ్చాయా? అసలు అమరవీరులకు సరైన గుర్తింపు లభించిందా? ఉద్యమం నడిచినంత కాలం 1200 మంది పోయారంటే 1500 మంది అని చెప్పుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక దానిలో సగం మందైనా లేరంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ సభ దాకా ప్రతీ చోటా తెలంగాణ అనగానే శవాల ప్రస్తావనే జరిగింది. ఇప్పుడు అంతా గప్‌చుప్. తెలంగాణ వచ్చాక కొంతమందికి కొన్ని ప్రయోజనాలు ఒనగూడాయి. కానీ అందరి కంటే ఆశోపహతులు మాత్రం విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే. పేదలకు యిళ్లు కడతామంటున్నారు. మంచిదే. అది ఉస్మానియాలోనే కట్టాలనేముంది? సికింద్రాబాదులో యింకెక్కడా చోటు లేదట. అసలు సికింద్రాబాదులోనే యిళ్లు కట్టాలనేముంది? ఇదంతా శాటిలైట్ టౌన్స్ యుగం. ఊరికి చివర శాటిలైట్ టౌన్లు కట్టి అక్కణ్నుంచి వూళ్లోకి తక్కువ బస్సు టిక్కెట్టుతో బస్సులు, రైళ్లు నడిపితే వూరిపై ఒత్తిడి తగ్గుతుంది. తమిళనాడులో అదే చేస్తున్నారు. అనేక మహానగరాల్లో అదే పని చేస్తున్నారు.
కొత్త చోట ఏదైనా కట్టడం సులభం. విశాలమైన రోడ్లు, చక్కటి డ్రైనేజీ, నీటి సరఫరా అన్నీ బాగా ప్లాన్ చేయవచ్చు. పాతబడిన నగరంలో యిళ్లు పడగొట్టి ఫ్లాట్లు కడితే గతంలో పదిమంది వుండే చోట యిప్పుడు వందమంది నివసిస్తారు. డ్రైనేజిపై, నీటి సప్లయిపై, రోడ్లపై విపరీతమైన ఒత్తిడి పడి మాటిమాటికీ బ్రేక్‌డౌన్లు అవుతాయి. పైగా యూనివర్శిటీకి పక్కగా బస్తీ వాసులుంటే శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుంది. ఆ యిళ్లల్లో ఆడపిల్లల్ని విద్యార్థులు ఏడిపించారనో, విద్యార్థినులను బస్తీవాసులు ఏడిపించారనో నిరంతరం కలహాలు ఏర్పడతాయి. యూనివర్శిటీ అనగానే బంద్‌లు, లాఠీ చార్జిలు, బాష్పవాయు ప్రయోగాలు సహజం. విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వి బస్తీలో పోయి దాగుంటారు. పోలీసులు వెళితే పేదలపై దాడి జరిగిందని గగ్గోలు పెడతారు. తెలంగాణ ఉద్యమసమయంలో జరిగినదదే. ఇప్పుడు ఆ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ వచ్చింది. రేపు మరొక రకమైన ఆందోళన రావచ్చు. ఎప్పటికైనా తలకాయనొప్పే. పేదలకు ఎందుకు అక్కడ కట్టాలి? అని అడిగితే కెసియార్ యూనివర్శిటీకి అంత స్థలం అక్కరలేదు, అయినా పేదలు బతకవద్దా అంటున్నారు. యూనివర్శిటీ హాస్టళ్లలో వుండేది పేద విద్యార్థులు కారా? అక్కడ హాస్టళ్లు ఎప్పుడో కట్టినవి, వాటిని బాగు చేయించాలి. కొత్తవి కట్టాలి. ఉస్మానియా అనుబంధ కాలేజీల విద్యార్థులు సైతం అక్కడ వుండేట్లా మరిన్ని హాస్టళ్లు కట్టవచ్చు కదా. ఆ ఆలోచన ఎందుకు రావటం లేదు? యూనివర్శిటీకి అంత స్థలం అక్కరలేదని కెసియార్ తీర్మానించారు. మరి ఫిలిం సిటీకి వేల ఎకరాలు కావాలా? ఫార్మా సిటీకి కావాలా? ఏ ప్రాతిపదికన ఆ ప్రకటనలు చేశారు?
కెసియార్‌కు పర్యావరణం గురించి స్పృహ వుందా లేదాని సందేహం వస్తోంది. ఎన్టీయార్ స్టేడియంలో కళాభారతి కడతామంటున్నారు. అక్కడెందుకు దాన్ని ఆటలకై వదిలేసి, డిబిఆర్ మిల్స్ వున్న చోట కట్టండి అంటే తెలంగాణ సంస్కృతికి మీరంతా విరోధులు అంటారు. అసలు ఆడిటోరియంలు మాత్రం వూరి మధ్యలోనే ఎందుకు వుండాలి? రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వున్నాయి కదా. శివార్లలోనే ఎక్కువ జనాభా వుంటున్నారు. వారికి ఆడిటోరియం అక్కరలేదా? రంగారెడ్డి జిల్లాలో కళాభారతి కట్టకూడదా? దాని కోసం నగరానికి వున్న లంగ్ స్పేస్ పోగొట్టుకోవడం దేనికి? ఉస్మానియా యూనివర్శిటీలో బస్తీవాసులకు యిళ్లు కడితే అక్కడి వాతావరణం కూడా వేడెక్కడం ఖాయం. కలకత్తాలో జాగా తక్కువ. చోటు కోసం చాలా వెతుక్కుంటారు. అయినా ఊరి మధ్యలో వున్న మైదాన్, విక్టోరియా మెమోరియల్, రేస్ కోర్సు వంటి ప్రాంతాలను వాళ్లు ముట్టుకోలేదు. అందుకనే అక్కడ ఆ మాత్రమైనా గాలి ఆడుతోంది. హైదరాబాదు ఒకప్పుడు వేసవిలో కూడా చల్లగా వుండేదని చెపితే యిప్పుడెవరూ నమ్మలేని పరిస్థితి వచ్చింది. కెసియార్ ఐదేళ్ల పాలన పూర్తయ్యేలోగా యింకెంత పర్యావరణ విధ్వంసం జరుగుతుందో తెలియదు. ఏమడిగినా సమైక్యవాదుల పాలనలో నాశనమైంది అంటున్నారు. ఇప్పుడు నాశనం చేస్తున్నదీ వారేనా?
ఉస్మానియాపై జరుగుతున్న దాడి గురించి మేధావులు ఎందుకు మౌనంగా వున్నారు? కెసియార్‌ను విమర్శిస్తున్నది రాజకీయపక్షాలు మాత్రమే. పార్టీ నాయకులు మాట్లాడితే పదవిలో మీరుండగా ఏం చేశారు అని ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటారు. తటస్థులను, మేధావులను, విద్యావంతులను అలా అనలేరు. అందుకని గొంతు విప్పి పాలకులను ప్రశ్నించాల్సింది విద్యావంతులే. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినది ఉస్మానియాలో చదువుకున్న, పాఠాలు చెప్పిన మేధావులే. ఈ రోజు వారి మాతృసంస్థకు యీ గతి పడుతూంటే నోరు విప్పరేం? ఇదే గతంలో అయితే ఎంత రచ్చ చేసేవారు? మరి ఈనాడు నోరు పెగలక పోవడానికి కారణం – పదవులా? భయమా? టెక్స్‌ట్‌బుక్ కమిటీలో స్థానం యిస్తే సంతృప్తి పడిపోయారా? తెలంగాణ భవిష్యత్తు పట్ల వీరికి ఏ బాధ్యతా లేదా? ఈనాటి నిష్క్రియాపరత్వానికి రేపటి తరానికి వీరు జవాబు చెప్పుకోవలసి వస్తుందన్నది మాత్రం తథ్యం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2015)