ఇంద్రాణీ ముఖర్జీ ఇంద్రజాలం

ఇటీవలి కాలంలో ఇంత సంచలనం కలిగిస్తున్న క్రైమ్ స్టోరీ లేదనే చెప్పాలి. ఒక టీవీ ఛానెల్ గ్రూపు అధిపతిగా, మరో పెద్ద టీవీ గ్రూపు సిఇఓ భార్యగా హై సర్కిల్స్‌లో ఓ వెలుగు వెలిగి,…

ఇటీవలి కాలంలో ఇంత సంచలనం కలిగిస్తున్న క్రైమ్ స్టోరీ లేదనే చెప్పాలి. ఒక టీవీ ఛానెల్ గ్రూపు అధిపతిగా, మరో పెద్ద టీవీ గ్రూపు సిఇఓ భార్యగా హై సర్కిల్స్‌లో ఓ వెలుగు వెలిగి, అత్యంత ప్రతిభావంతురాలైన మహిళగా ఎవార్డులు పొందిన ఇంద్రాణీ ముఖర్జీ ఈ రోజు సొంతకూతుర్ని పీక నులిమి హత్య చేసిన తల్లిగా తోచి సభ్యసమాజం ముక్కున వేలేసుకుంటోంది. నిజంగా చంపిందా, ఎందుకు చంపింది, వావివరసలపై ఈమెకు అంత పట్టింపు ఉందా అని విస్తుపోతూ వుండగా, డబ్బు కోసమే జరిగిందని ఆమె సొంత కొడుకే ఆరోపణలకు దిగాడు. ‘స్కూప్’ల పేరుతో, ‘స్ట్రింగ్ ఆపరేషన్’ పేరుతో పొరుగింట్లో మూలమూలలకు కూడా వెళ్లి విషయాలను తెలుసుకుని లోకానికి చాటే టీవీ ఛానెల్ సిఇఓకు సొంత ఇంట్లో తన కళ్ల ముందు మసలుతున్న అమ్మాయి సవతి కూతురో, మరదలో తెలుసుకోలేడా? తన కొడుకు పెళ్లి చేసుకుందామని అనుకున్నామె హఠాత్తుగా మాయమై మూడేళ్లయినా ఆమె అజాపజా తెలుసుకోలేడా? వింతగా లేదూ!? అసలు వచ్చిన చిక్కేమిటంటే విషయం అర్థం చేసుకుందామంటే పాత్రధారుల్లో ఎవరు ఎవరికి ఏమవుతారో ఏమీ అర్థం కావటం లేదు. రోజుకో కొత్త న్యూస్ వచ్చి గందరగోళం పెరుగుతోంది. దీనిలో ఏది నిజమో, ఏది కాదో తెలియటం లేదు. ఇప్పటిదాకా చేరిన సమాచారాన్ని గుదిగుచ్చి, ఒక క్రమంలో పెట్టి చూస్తే ఇకపై జరిగే సంఘటనలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది.

ఇంద్రాణీ ముఖర్జీ అసలు పేరు పరీ బోరా. బొంబాయికి వచ్చాక పేరు మార్చుకుంది కానీ సౌలభ్యం కోసం ఇంద్రాణి అనే వ్యవహరిద్దాం. ఆసామీ వనిత. 1972లో పుట్టిందంటున్నారు కానీ అంతకు ముందే పుట్టి ఉండాలి. ఎందుకంటే ఆమె మొదటి పెళ్లి 1984లో జరిగింది. ఆమె తల్లి  దుర్గారాణి. ఇంద్రాణి చిన్నతనంలోనే ఆమె తండ్రి భార్యాబిడ్డల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పుడామె భర్త సోదరుడైన ఉపేంద్ర కుమార్ బోరాను పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ఉపేంద్ర ఇంద్రాణిని కొడుతూ వుండేవాడు. చిన్నప్పటినుంచీ ఇంద్రాణి చురుకుగా వుండేది. స్కూలులో తక్కిన ఆడపిల్లలు మగాళ్లతో మాట్లాడడానికే జంకే రోజుల్లో చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరిగేది. గువాహటీలో కాటన్ కాలేజీలో చదివే రోజుల్లో 1984 డిసెంబరులో కామాఖ్య ఆలయంలో బిష్ణు చౌధురీ అనే అతనితో ఆమెకు పెళ్లి జరిగిందని, తను దానికి సాక్షిననీ ఆమె క్లాస్‌మేట్ ఒకామె చెప్పింది. నాలుగు నెలల తర్వాత అతన్ని విడిచి పెట్టేసి షిల్లాంగ్ వెళ్లింది. అందువలన కాబోలు మీడియా అతన్ని భర్తగా లెక్కపెట్టటం లేదు. 

షిల్లాంగ్‌లో 1986లో ఆమెకు త్రిపురకు చెందిన సిద్ధార్థ దాస్ కలిశాడు. మీడియా ఇతన్ని ఇంద్రాణి మొదటిభర్తగా లెక్క వేస్తోంది కానీ అతను అలా అనుకోవటం లేదు. 1989 వరకు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)లో ఉన్నామంటున్నాడు. అతనొక చిన్న ఉద్యోగి. అతని వలన తను ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశం లేదని గ్రహించిన ఇంద్రాణి మూడేళ్లు పోయాక అతనికి గుడ్‌బై చెప్పేసింది. అతను 1998 నుంచి కలకత్తాలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ భార్య, కొడుకుతో గుట్టుగా కాపురం చేసుకుంటున్నాడు. తను ఫలానా అని తెలిస్తే ఇల్లు గలాయన ఖాళీ చేయిస్తాడనీ, ఉద్యోగం వూడుతుందనీ భయంతో హెల్మెట్ వేసుకుని ముసుగేసుకుని ప్రెస్‌తో మాట్లాడుతున్నాడు. హతురాలు షీనా అతనికి, ఇంద్రాణికి పుట్టినదే. తన కూతుర్ని చంపేసిన మాజీ భార్యకు ఉరి పడాలని ఆవేశపడుతున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఉండగా 1987 ఫిబ్రవరిలో షీనా, 19 సెప్టెంబరులో మిఖాయేల్ పుట్టారు. విడిపోయినప్పుడు తను పిల్లల సంరక్షణ తీసుకుంటానని చెప్పినా వినకుండా పిల్లల్ని తన పుట్టింటికి తీసుకుపోయిందంటాడు దాస్. షీనాను పదో క్లాసులో ఓ సారి చూశానని, మిఖాయేల్‌తో అస్సలు టచ్‌లో లేననీ చెప్పాడు. 

పుట్టింటికి తీసుకెళ్లి పిల్లల్ని స్కూలులో చేర్చేటప్పుడు ఇంద్రాణి ఖతర్‌నాక్ తెలివితేటలు బయటపడ్డాయి. ఆమె అప్పటికి ట్వంటీస్‌లోనే ఉండి వుంటుంది. కానీ భవిష్యత్తులో ఈ పిల్లలు తనకు గుదిబండలుగా మారతారనే ముందుచూపుతో స్కూలు రికార్డులలో పిల్లల తలిదండ్రులుగా అమ్మమ్మ, తాతయ్యల పేరు రాయించింది. బర్త్ సర్టిఫికెట్టులోనే రాయించిందన్న వార్త నిజమైతే ఆ తెలివితేటలు ఇంకో ఐదేళ్లకు ముందే వికసించాయన్నమాట! ఇదెక్కడి ఘోరమని ఓ జర్నలిస్టు అడిగితే ‘నా సవతి తండ్రి తాగి నాపై అత్యాచారం చేయడం వలన షీనా పుట్టింది’ అని ఇంద్రాణి చెప్పినట్టు ఒక వార్త వచ్చింది. మరి మిఖాయేల్ ఎలా పుట్టాడో జర్నలిస్టు అడిగాడో లేదో తెలియదు. ‘షీనా నా మనుమరాలే కానీ కూతురు కాదు బాబోయ్’ అని ఉపేంద్ర మీడియా ముందుకు వచ్చి చెపుతున్నాడు. 

పిల్లల్ని స్కూల్లో చేర్చాక ఇంద్రాణి భర్తల వేటలో పడింది. కలకత్తా, జంషెడ్‌పూర్‌లలో వ్యాపారం చేసే సంజీవ్ ఖన్నా అనే వ్యాపారి తగిలాడు. తనకు అప్పటికే పిల్లలున్నారని  చెప్పిందో లేదో మనకు తెలియదు. 1993లో పెళ్లి చేసుకుని అతని ద్వారా విధి అనే కూతుర్ని కంది. ఇతని నుంచి విడిపోయి, విడాకులకు అప్లయి చేసి, 2001లో ఇంద్రాణి బొంబాయి ప్రయాణం కట్టింది. ఈ సంసారం ద్వారా పుట్టిన కూతుర్ని కూడా తన వద్ద వుంచుకుంది. సంజయ్ ఖన్నా కలకత్తాలోనే వుండిపోయాడు. ఇప్పుడీ షీనా హత్య కేసులో అతను తన మాజీ భార్యకు ఎందుకు సహకరించాడన్నది పెద్ద మిస్టరీ అయిపోయింది. షీనాను తొలగించివేస్తే – మిఖాయిల్‌ను కూడా తుదముట్టించాలనుకున్నారనీ, సాగలేదనీ సమాచారం – ఆమెకు రావలసిన ఆస్తి కూడా విధికి వచ్చేస్తుందనే ఆశతో సంజీవ్ హత్యలో పాలు పంచుకున్నాడంటున్నారు. దీనితో బాటు అతనికి హత్య కాగానే డబ్బు ముట్టచెప్పారని, ఇప్పుడు అతను హఠాత్తుగా సంపన్నుడై పోయాడనీ చెప్తున్నారు. హత్య బయల్పడ్డాక విచారణలో అతను రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు. షీనా, ఇంద్రాణి, తనూ కారు ఎక్కారనీ, కారు ఎక్కగానే సాయంత్రం 6 గంటలకు సంజెవేళ తనకు నిద్ర పట్టేసిందని, మెలకువ వచ్చి చూసేసరికి పక్కన షీనా శవం ఉందని అన్నాడు. ఎంత మత్తులో ఉన్నా పీక నులిమేస్తూంటే కదలదా, అప్పుడైనా మెలకువ రాలేదా? డ్రైవర్ ఇతని హస్తం కూడా ఉందనడంతో ఇప్పుడు మెలకువగానే వున్నానంటున్నాడు. పీక నులిమింది ఇంద్రాణా, సంజీవా అన్నది ఇంకా తేలలేదు. ‘నేను పీక నులిమే ప్రశ్నే లేదు, అసలు షీనా చచ్చిపోతే కదా, ఇప్పుడు కూడా అమెరికాలో హాయిగా మొగుడితో కాపురం చేస్తోందిగా’ అని దబాయిస్తోంది ఇంద్రాణి.

సంజీవ్ ద్వారా కన్న విధి ఖన్నాను తోడు పెట్టుకుని అప్పటి పరీ ఖన్నా బొంబాయి చేరింది. ఓ శుభముహూర్తాన తన పేరు ఇంద్రాణిగా మార్చుకుని, ఒక ఎచ్‌ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ పెట్టింది. వాళ్ల క్లయింట్లలో రిలయన్సు గ్రూపు ఒకటి. యాడ్ కంపెనీలతో స్నేహం పెంచుకుంది. సుప్రసిద్ధ యాడ్‌మేన్, లింటాస్ ఫేమ్ అలేక్ పాదమ్‌సీ ఈమెను పీర్ ముఖర్జీకి పరిచయం చేశాడు. పీటర్ షబ్నమ్ అనే ఆమెను పెళ్లాడి, 1994లో విడిపోయాడు. వాళ్లకి 1980లో రాహుల్ అనే కొడుకు, 1984లో మరో కొడుకు పుట్టారు. రాహుల్ తల్లితో డెహ్రాడూన్‌లో వుండేవాడు. తండ్రి బొంబాయి వచ్చాక వచ్చి అతనితో వుండసాగాడు. పీటర్ ఇంద్రాణిని  చూసి మురిసిపోయి తనకంటె 16 ఏళ్లు చిన్నదైనా ఫర్వాలేదని పెళ్లి చేసుకుంటానన్నాడు. 2002లో అతని ఇంట్లోకి ఈమె ఐదేళ్ల విధి ఖన్నాతో సహా మారిపోయింది. కోర్టు నుంచి విడాకులు వచ్చాక 2002 నవంబరులో ఇద్దరూ ఢిల్లీలో పెళ్లి చేసుకున్నారు. విధిని పీటర్ దత్తత తీసుకుని ఆమెకు ముఖర్జీ అనే తన ఇంటి పేరును ప్రసాదించాడు. లోకమంతా ఇంద్రాణీని తిడుతున్నా ఇప్పుడీ విధీ ముఖర్జీ మాత్రం తల్లిని అంటిపెట్టుకుని ఓదారుస్తోంది. 

పీటర్ ముఖర్జీ అసలు పేరు ప్రతీమ్ ముఖర్జీ. ఇంగ్లండులో పుట్టి అక్కడే పెరిగాడు, 1971లో డూన్ స్కూల్లో చదువుకున్నాడు, ఉద్యోగాలు చేశాడు. యుకెలో హెంజ్ అనే అమెరికన్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ యుకె మార్కెటింగ్ విభాగంలో పనిలో చేరాడు. ఓగ్లివీ అండ్ మేథర్ అనే ప్రముఖ యాడ్ కంపెనీలో ఎక్కవుంట్ డైరక్టర్‌గా న్యూ ఢిల్లీ, లండన్‌లలో పని చేశాడు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌లో డిడిబి నీధామ్ గ్రూపులో అదే పొజిషన్‌లో పనిచేసి, హాంగ్‌కాంగ్‌లోనే స్టార్ టివి (ఇండియా)కు సేల్స్ డైరక్టరుగా చేరాడు. స్టార్ అధిపతి రూపర్ట్ మర్దోక్‌కు ఇతను బాగా నచ్చడం చేత బొంబాయి పంపించి స్టార్ టీవీ యాడ్ సేల్స్ డివిజన్ తెరిపించాడు. 1996 నుంచి మిడిల్ ఈస్ట్ వ్యాపారం కూడా చూడసాగాడు. 1997లో అతన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటు చేశారు. 1999 వచ్చేసరికి అతను స్టార్ ఇండియాకు సిఇఓ అయిపోయాడు. ఆ పదవిలో  ఏళ్లు పనిచేసి అమిత ఖ్యాతిని గడించాడు. ఇఎస్‌పిఎన్ స్టార్ స్పోర్ట్‌స్ ఛానెల్‌కు, హాత్‌వే  కేబుల్ టీవీకి, స్టార్ న్యూస్‌కు డైరక్టరుగా కూడా వున్నాడు. పీటర్ పదవీకాలంలోనే స్టార్ గ్రూపు ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’, ‘‘క్యూంకీ సాస్ భీ..’’ వంటి పాప్యులర్ టీవీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టి భారతీయ టీవీ పరిశ్రమకు దిశానిర్దేశం చేసింది. ఒకలా చెప్పాలంటే ఇంద్రాణి పీటర్ ముఖర్జీ భార్య కాకుండా ఉంటే ఈ హత్యకు ఇంత పబ్లిసిటీ వచ్చేదే కాదు. 

పీటర్, ఇంద్రాణి బొంబాయి సోషల్ సర్కిల్స్‌లో తళతళలాడిపోయారు. బొంబాయిలో తను దృఢంగా పాతుకున్నాక ఇంద్రాణి తన కూతురు షీనాను 2006లో తన వద్దకు రప్పించుకుని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాజువేషన్‌లో చేర్పించింది. మిఖాయిల్‌ను మాత్రం గువాహటిలోనే వుంచి, డబ్బు పంపిస్తూ తన తలితండ్రుల ఆలనాపాలనా చూడమంది. షీనాను పీటర్‌కు, లోకానికి తన చెల్లెలుగా పరిచయం చేసింది. అసలు ఇంద్రాణి షీనాను ఎందుకు రప్పించుకోవాలి? తల్లిప్రేమ చేతనా?  మరి ఆరేళ్లు తిరిగేటప్పటికి ఆ ప్రేమంతా ఏమైంది? – వీటికి సమాధానాలు ఇప్పుడే కచ్చితంగా తెలియవు. ఆమె స్వభావం చూస్తూ ఉంటే తనలాగే తన కూతుర్ని సోషల్ సర్కిల్స్‌లో తిప్పి ఎవడైనా పెద్దవాడికి (అన్ని విధాలా) ఇచ్చి పెళ్లి చేద్దామనుకుందేమో అనిపిస్తుంది. ఇంకో థియరీ ఏమిటంటే – తనూ, పీటర్ కలిసి స్టార్ టీవీలో కొట్టేసిన డబ్బుకి బినామీలు కావాలి. అతనివైపు, తనవైపు కనబడిన బంధువుల పేర ఇంతో అంతో పెట్టినా, ఎక్కువ డబ్బు తనవాళ్ల పేరే పెట్టుకుని అవసరం వచ్చినపుడు వెనక్కి తీసుకుంటే మంచిది కదా అనుకుని వుండవచ్చు. పుట్టినప్పటినుంచి తనను దూరంగా పెట్టిందని కూతురికి వున్న కోపాన్ని పోగొట్టి, బినామీగా ఒప్పించడానికి బొంబాయి పిలిపించి, ఈ జీవితాన్ని రుచి చూపించి ఆకట్టుకుందామని అనుకుని వుండవచ్చు. అయితే తర్వాత అనూహ్యంగా ప్రేమ కోణం మొలుచుకుని వచ్చి కథ అడ్డం తిరిగింది. అది చెప్పుకోబోయే ముందు వీళ్లు చేసిన ఆర్థిక అక్రమాల గురించి తెలుసుకోవాలి. 

ఆర్థిక అక్రమాలు ఇంద్రాణితో పెళ్లి అయ్యాక పీటర్ బుద్ధి వక్రించినట్లు తోస్తుంది. స్టార్ ఇండియా సిఇఓగా ఉండగానే పోటీ టీవీ ఛానెల్ గ్రూప్ పెట్టాలన్న ఐడియా వచ్చింది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలైన న్యూ సిల్క్ రూట్, సింగపూరుకి చెందిన తెమాసెక్ హోల్డింగ్స్, న్యూ వెర్నాన్ ప్రైవేట్ ఈక్విటీలకు నచ్చచెప్పి ఆ ఛానెల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించాడు. ఆ గ్రూపు ద్వారా న్యూస్ ఛానెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ వగైరాలు పెడదామనుకున్నారు. అన్నీ సిద్ధమయ్యే సమయానికి హఠాత్తుగా ఆ కంపెనీలకు తెలిసి వచ్చింది. విదేశీ సంస్థలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్లో 100% పెట్టుబడి పెట్టవచ్చు కానీ న్యూస్ ఛానెల్‌లో 26%కు మించి పెట్టడానికి భారత ప్రభుత్వ నియమాలు ఒప్పుకోవని! అప్పుడు పీటర్ మీరు ఆ డబ్బు మా పేర పెట్టండి అన్నాడు. అయితే పీటర్ బ్రిటిష్ పౌరుడు. అందువలన ఇంద్రాణి పేర ఇంద్రాణి ఇన్‌కాన్ ప్రై.లి. అనే కంపెనీ పెట్టి వీళ్ల దగ్గర్నుంచి పెట్టుబడులు సేకరించి, ఆ గ్రూపుకి పెట్టుబడిదారుగా అవతరించింది. ఆ గ్రూపుకు ఇంద్రాణి పేరులో మొదటి అక్షరాలు ఐయన్ చేర్చి ఐయన్‌ఎక్స్ నెట్‌వర్క్ అన్నారు. దాని ఛాయలో 9ఎక్స్, న్యూస్ ఎక్స్… ఇలా ఛానెళ్లు పుట్టుకుని వచ్చాయి. 

మొత్తం 17 పెడదామనుకున్నారు.  పీటర్ స్టార్‌టీవీకి సిఇఓ కాబట్టి ఈ ఐయన్‌ఎక్స్ గ్రూపుకు ఇంద్రాణిని సిఇఓ చేసేశాడు. ఆమెకు టీవీ రంగంతో, పత్రికారంగంతో, కళలతో ముఖపరిచయం కూడా లేకపోయినా! స్టార్ టీవీని పట్టించుకోవడం మానేయడంతో బిజినెస్ తగ్గి మర్దోక్‌కు కోపం వచ్చింది. 2007లో పీటర్ స్టార్ వదిలి రావలసి వచ్చింది. ఐయన్‌ఎక్స్‌లో అతను చైర్మన్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసరుగా చేరాడు. భార్యాభర్తలిద్దరికీ కలిపి కంపెనీలో 50% వాటా వుంది. ఇక కంపెనీ నుంచి డబ్బులు మళ్లించడం మొదలుపెట్టారు. మళ్లించినది తమ బంధువుల పేర పెట్టనారంభించారు. వారిలో పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జీ ఒకడు. అతను ‘‘ప్లానెట్ గోవా’’ అనే మ్యాగజైన్‌కు పబ్లిషరు. ఇవతల పెట్టుబడిదారులను ఏమార్చడానికి పూనుకున్నారు. ఛానెళ్లు అద్భుతంగా నడిచేస్తున్నాయని మభ్యపెట్టడానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన్లైన 9ఎక్స్ టిఆర్‌పి రేటింగ్స్‌ను న్యూస్ ఎక్స్‌కు కలిపేసి తప్పుడు రేటింగ్స్ చూపించారు. ఇంద్రాణి అధిపతిగా వున్న ప్రోగ్రామింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఏడాదికి రూ.350 కోట్లు కేటాయించారు. అంటే రోజుకి దాదాపు రూ. కోటి అన్నమాట! దాని ద్వారా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల డీలింగుల్లో కూడా కమీషన్లు తీసుకున్నారని అంటారు.

ఇంద్రాణి తరఫున పెట్టుబడి పెట్టిన న్యూ సిల్క్ రూట్ కంపెనీ పెద్దలు కూడా వాహినీ వారి పెద్దమనుషులే. ఆ కంపెనీ పెట్టిన ఆరుగురిలో నలుగురు అమెరికాలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారిలో మెకిన్సే రజత్ గుప్తా కూడా ఒకరు. వాళ్లు ఈ వ్యవహారాలను ప్రశ్నించసాగారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడ్డాక తెమాసెక్ హోల్డింగ్స్ వారు కూడా ఐయన్‌ఎక్స్ ఆర్థిక లావాదేవీలను ప్రశ్నించసాగారు. ఆడిట్ చేయించి వీళ్ల డబ్బు తరలించినట్లు కనుగొన్నారు. న్యూస్ ఎక్స్ ఛానెల్ సిబ్బంది అందించిన సమాచారంతో బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు ప్రియరంజన్ దాస్‌మున్షీ ఫిర్యాదు చేయగా, ఛానెల్‌కు డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందన్నదానిపై, వీళ్ల వ్యవహారాలపై 2008లోనే ఆర్థికమంత్రి చిదంబరం విచారణకు ఆదేశించారు. ఐయన్‌ఎక్స్ నెట్‌వర్క్‌లోంచి నిధులు తరలిపోతూండగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ కలిసి ముఖర్జీలను గట్టున పడేశారు. వీరంతా కలిసి షేర్‌హోల్డర్స్‌ను మోసం చేశారన్న విషయంపై ఇప్పుడు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు విచారణ జరుపుతోంది. దీనితో బాటు టేపుల ఫేం నీరా రాడియాకు  చెందిన న్యూకమ్ కన్సల్టింగ్‌కు న్యూస్ ఎక్స్‌కు మధ్య నడిచిన లావాదేవీల గురించి కూడా విచారణ సాగుతోంది. రిలయన్సుకు చెందిన ప్రమోటర్ కంపెనీల నుండి రుణాలు తీసుకోవడానికి ఇంద్రాణి సంతకాలు చేసిందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసు అంటోంది. షేర్ల అమ్మకంలోనే గోల్‌మాల్ జరిగింది. షేరు ధర రూ.10 కాగా, ప్రీమియం రూ. 20. 2009 వరకు అదే రేటు. 2009 జనవరిలో రూ.10 రేటుకే అమ్మేశారు. ఇవన్నీ ఎకామడేషన్ ఎంట్రీలని విచారణాధికారుల అనుమానం. గ్రూపుకి సంబంధించిన ఛానెల్స్ ఇంత అధ్వాన్నంగా నడిచినా పీటర్, ఇంద్రాణి తమ షేర్లను లాభదాయకంగా అమ్ముకుని బయటపడిపోయారు. ఇంగ్లండ్ వెళ్లిపోయారు. మధ్యమధ్యలో ఇండియాకు వచ్చి వెళుతున్నారు. లండన్‌లో అయిదారు ఇళ్లుంచుకుని దర్జాగా బతుకుతున్నాడట. 

దీపం వుండగా ఇల్లు చక్కబెట్టుకోవడమే కాదు, ఆ దీపం వెలుగులో ఇంద్రాణి ఇంద్రవైభోగం అనుభవించింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థల్లో అందరి కంటె వయసులో చిన్నదైన మహిళా సిఇఓ కావడంతో ఆమెను మెచ్చుకోనివారు లేరు. ఛానెళ్లు నిలదొక్కుకోవడానికి ముందే ఎవార్డులు కురిశాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ ‘‘గమనించవలసిన 50 మంది మహిళలు’’ (50 విమెన్ టు వాచ్‌ఔట్ ఫర్) జాబితాలో ఇంద్రా నూయీ, పద్మా వారియర్‌ల సరసన ఈమెకు స్థానం ఇచ్చింది. అంతా పీటర్ కారణంగానే అని వేరే చెప్పనక్కరలేదు. బొంబాయి, ఢిల్లీ సోషల్ సర్కిల్స్‌లో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఇదంతా ఆమె అహంకారాన్ని పెంచింది. తన ఛానెళ్లలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులను అవమానించి గొడవలు తెచ్చుకుంది. వారిలో వీర్ సంఘ్వీ ఒకరు. టెలివిజన్ మీడియాలో వున్న పాత్రికేయులెవరూ ఆమె గురించి మంచిగా మాట్లాడటం లేదు. సమాజంలో పలుకుబడి రావడంతో తను ఏం చేసినా చెల్లుతుందనే భావం ఇంద్రాణిలో బలపడింది. అందుకే కూతురు హత్యకు పాల్పడింది. దాన్ని మాపు చేయగలిగింది. అనుకోకుండా ఇది బయటపడింది కానీ లేకపోతే ఆమె గురించి ఇంత మాట్లాడుకునే వారమే కాదు. 

2009లో కాలేజీ చదువు పూర్తయ్యాక షీనా రిలయన్సు ముంబయి మెట్రో ప్రాజెక్టులో ఇంటెర్న్‌గా పనిచేయసాగింది. 2010-11 నాటికి ఉద్యోగంలో కన్‌ఫమ్ అయింది. 2006 నుంచి అంటే 19 ఏళ్ల వయసు నుంచి తన కంటె ఏడేళ్లు పెద్దవాడైన రాహుల్‌తో ప్రేమలో పడింది. రాహుల్ ఏం వుద్యోగం చేసేవాడో తెలియటం లేదు. తల్లి ఇంగ్లండు వెళ్లిపోయిన తర్వాత కాబోలు, రాహుల్, ఈమె కలిసి కాపురం పెట్టేశారు. ఖార్‌లో, బాంద్రాలో ఎపార్టుమెంట్లలో వుండేవారు. తర్వాత తన ఆఫీసుకి దగ్గర్లో అంధేరీ దగ్గర తీసుకున్నారు. చనిపోయేనాటికి ఆమె గర్భవతి అని కూడా అంటున్నారు. నిజానిజాలు తేలవలసి ఉంది. రాహుల్ యీమెను వెంటపెట్టుకుని డెహ్రాడూన్‌లోని తన తల్లి వద్దకు తీసుకెళ్లి చూపించాడు. అక్కడున్న సమీప బంధువులకు, తాతఅమ్మమ్మలకు ‘బెస్ట్ ఫ్రెండ్’ అంటూ పరిచయం చేశాడు. రాహుల్ తల్లికి షీనా నచ్చింది. కోడలైతే బాగుండుననుకుంది. 2012 ఏడాది చివర్లో పెళ్లి చేసుకోమంది. అయితే ఈ వ్యవహారం పీటర్‌కు, ఇంద్రాణికి నచ్చలేదు. పీటర్‌కు షీనా అంటే ఇష్టం లేదని కాదు. ఆమెను అనేకసార్లు పార్టీల్లో కలిసేవాడు. ఇంద్రాణి తన తల్లి అని ఆమె పీటర్‌కు చెప్పిందట కూడా. ‘అవునా అని అడిగితే ఇంద్రాణి కాదంది. దాంతో చెల్లెలే అయి ఉంటుందని అనుకుని వూరుకున్నాను’ అంటున్నాడు పీటర్ ఇప్పుడు. ఇంద్రాణి తల్లిని కూడా పీటర్ కలిశాడు. ఆవిడా చెప్పిందట.. షీనా మనుమరాలే అని. 

షీనా ఎలాంటిదైనా రాహుల్ ఆమెను చేసుకోవడం మాత్రం పీటర్ ఇష్టపడలేదు. ఈ విషయంగా తండ్రీకొడుకులిద్దరూ ఘర్షణ పడి మాట్లాడుకోవడం మానేశారు. ఇంద్రాణికి ఎందుకిష్టం లేదు అనేది స్పష్టంగా తెలియటం లేదు. వరస కుదరలేదనా? లోకం దృష్టిలో షీనా రాహుల్‌కు పిన్ని వరసైనా నిజానికి చెల్లెలి వరస అని ఇంద్రాణికి సంకోచమా? ఏది ఏమైనా తల్లి కానీ, తండ్రి కానీ కామన్ కాదు. రక్తబంధం లేదు. రాహుల్‌ను షీనా పెళ్లి చేసుకుంటే పీటర్ వాటాలో తనకు రావలసిన డబ్బు తగ్గిపోతుంది కాబట్టి.. అని కొందరంటున్నారు కానీ అది అర్థం లేనిమాట. షీనా కాకపోతే మరో రీనా, రాహుల్ ఎవరిని చేసుకుంటే వాళ్లకి పీటర్ ఆస్తిలో వాటా వచ్చి తీరుతుంది. అదేదో తన కూతురే అయితే మంచిదేగా? పెళ్లి ఇష్టం లేకపోవడం అంశం మాట ఎలా వున్నా, పగతోనే షీనాను చంపేసిందనే నమ్మాలి. పగ ఎందుకు అంటే తన పేర పెట్టిన ఆస్తులను తిరిగి ఇవ్వడానికి షీనా తిరస్కరించి వుండవచ్చు అనే సమాధానం వస్తుంది.

ఏది ఏమైతేనేం, ఇంద్రాణి షీనాను చంపడానికే నిశ్చయించుకుంది. పనిలో పనిగా నన్ను కూడా చంపుదామనుకుంది అంటాడు ఆమె కొడుకు మిఖాయేల్. అతన్నీ బొంబాయి రప్పించింది. మాజీ మొగుడు సంజీవ్ ఖన్నాతో కలిసి కుట్ర పన్నింది. మిఖాయేల్, సంజీవ్ ఒకే హోటల్లో వున్నారట.  ఏప్రిల్ 23 న ఇంద్రాణి షీనాను ఓర్లీకి రమ్మనమని పిలిచింది. కానీ షీనా వెళ్లలేదు. ఏప్రిల్ 24 న సంజీవ్‌ను, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌ను వెంటపెట్టుకుని నేషనల్ కాలేజీకి వెళ్లి తనను పికప్ చేసుకుంది. హోటల్‌కు తీసుకెళ్లి తాగించింది. కార్లోనే పీక నులిమి చంపేశారు. ఎవరన్నది ఇంకా తేలలేదు. తర్వాత ఆ కారును తీసుకుని వచ్చి పీటర్ గరాజ్‌లో దాచిపెట్టారు. మర్నాడు బొంబాయికి 4 కి.మీ.ల దూరంలోని పెన్ తహసీల్‌లో గాగోడ్ గ్రామంలో కాల్చి తగలబెట్టి పూడ్చేశారు. అంతకుముందే రెక్కీ నిర్వహించి పెట్టుకున్నారు కాబట్టి ఎవరూ చూడకుండా పని అయిపోయింది. ఆ శవం మే 23 న ఒక ఆదివాసీ గ్రామీణుడి కంటపడితే అతను పోలీసులకు తెలియపరిచాడు. వాళ్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డిఎన్‌ఏ నమూనాలు కూడా సేకరించకుండా ఆసుపత్రికి పంపించివేశారు. ఇప్పుడు అస్థిపంజరం మాత్రమే వుంది. అది షీనాదో కాదో ఫోరెన్సిక్ నిపుణులే చెప్పాలి. షీనా చచ్చిపోతే కదా అంటోంది ఇంద్రాణి. షీనా శుబ్భరంగా అమెరికా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని హాయిగా వుంటోంది అని ఇప్పటికీ చెప్తోంది.

కవరప్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా వుంది. షీనా చనిపోయిన వారం రోజులకు మే 3 న ఆమె ఆఫీసుకి ఆమె రాజీనామా లేఖ అందింది. వాళ్లు దాన్ని ఆమోదించి కూర్చున్నారు. ఆమెకు రావలసిన జీతభత్యాలు ఎవరికి పంపారో తెలియదు. ఎవరూ అడక్కపోతే ఆశ్చర్యపడనైనా పడాలి. షీనా కనబడకపోవడంతో రాహుల్ వెళ్లి ఇంద్రాణిని అడిగాడు. తను పై చదువులకు అమెరికా వెళ్లిపోయిందని చెప్పింది. ‘అదేమిటి? పాస్‌పోర్టు నా దగ్గరే వుంది కదా’ అన్నాడితను. ‘తన దగ్గర ఇంకో పాస్‌పోర్టు వుందిలే’ అని ఇంద్రాణి సమాధానం చెప్పింది. ఒక మనిషికి రెండు పాస్‌పోర్టులెలా ఉంటాయన్న ఆలోచనే రాలేదు పీర్ ముఖర్జీ వంటి మేధావి పుత్రరత్నానికి. కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే ఇంద్రాణి వద్దని చెపితే ఇతను వినేశాడు. ఇతని న్యూసెన్సు ఆపడానికి షీనా సెల్ నుంచి ఎస్సెమ్మెస్‌లు పంపింది ఇంద్రాణి. ‘మన వ్యవహారం ఇంతటితో బంద్. వేరే వాళ్లని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు’ అంటూ కొన్ని నెలల వ్యవధిలో అయిదారు మెస్సేజ్‌లు వెళ్లాయి. దానితో మనవాడు మూణ్నెళ్లు వెయిట్ చేసి, చివరకు ఇల్లు ఖాళీ చేసి, నిట్టూర్చి ఊరుకున్నాడు. కనబడకుండా పోయిన వ్యక్తి పీటర్, ఇంద్రాణి వంటి ప్రముఖుల కుటుంబసభ్యురాలైనా పోలీసులు ఏమీ చేయకుండా వుండడం అత్యాశ్చర్యకరంగా వుంది. ఏమీ చేయవద్దని హంతకులు చెప్పి వుంటారు. 

రాహులే కాదు, మిఖాయేల్ ప్రవర్తన కూడా వింతగా వుంది. ‘నాకూ మత్తుపదార్థం ఇచ్చి జోకొట్టారు. షీనాను చంపేశాక వెనక్కి వచ్చి నన్ను చంపుదామనుకున్నారు. కానీ నాకు మెలకువ వచ్చి పారిపోయాను’ అంటున్నాడు యిప్పుడు. ‘తర్వాతైనా మీ అక్క ఏమైందో అడగలేదా?’ అంటే ‘అడిగాను. అమెరికా వెళ్లిందని అమ్మ చెప్పింది. ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోనని చెప్పిందంది. అలా ఎందుకంటుందో నాకు అర్థం కాలేదు. 2012లో బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చినపుడు బాగా మాట్లాడింది. తన ఫేస్‌బుక్ ఎక్కవుంట్ కూడా మూసేసింది. మా అమ్మ చాలా పలుకుబడి గల వ్యక్తి కాబట్టి భయపడి వూరుకున్నాను. ఇప్పటికైనా తనే నిజాలు బయటపెట్టాలి. సెప్టెంబరు నెలాఖరు దాకా చూసి, లేకపోతే నేనే మాట్లాడతాను. హత్యకు కారణం డబ్బు కాదు, మరొకటి..’ అంటున్నాడు. నిజానికి ఇతను  నెలనెలా ఇంద్రాణి పంపించే రూ. 40 వేల మీద ఆధారపడుతున్నాడు. తాతా అమ్మమ్మల పోషణభారం కూడా అతనిపై ఉంది.  షీనా రాజీనామా లేఖను మెట్రోలోని స్టాఫ్ ఎవరో అమ్మాయి చేత ఇంద్రాణి రాయించింది అంటున్నారు. అబ్బే మిఖాయేలే రాశాడు అంటున్నారు కూడా. డబ్బుతో ఇతని నోరు మూయించిందని కూడా అనుకోవాలి. నేను గట్టిగా అడిగితే నాకు మతిస్థిమితం లేదని పూనాలో మెంటల్ హాస్పటల్‌లో పెట్టించింది’ అన్నాడని ఒక వార్త వస్తే, అబ్బే అలా ప్లాన్ చేసింది తప్ప చేయలేదని, వీణ్ని చంపడానికి ఎవరికో సుపారి ఇచ్చి భయపెట్టిందని ఇంకో వార్త వచ్చింది.

రాహుల్‌కు, మిఖాయేల్‌కు బుఱ్ఱ లేదని అనుకుని ఊరుకోవచ్చు. కానీ పీటర్ ముఖర్జీ మాటేమిటి? తన ఇంట్లో వ్యక్తి మూడేళ్లగా కనబడకపోతే అడగనైనా అడగడా? ‘తను అమెరికాలో దీపావళి జరుపుకుంటున్న ఫోటోలను ఇంద్రాణి చూపించింది. నమ్మాను. పెళ్లి చేసుకుందంటే నమ్మాను’ అంటున్నాడు. ఆ మీడియా బేరన్ తలచుకుంటే నిమిషాల్లో నిజాలు తెలుసుకోగలడు. అతను హత్యలో పాలు పంచుకోకపోయినా, హత్య జరిగిందని గ్రహించాడని మాత్రం అర్థమవుతోంది. కానీ మీడియాలో ఉన్న అతని మిత్రులు అతనిది తప్పేమీ లేదన్నట్లు చిత్రీకరిస్తున్నారు. డ్రైవర్ శ్యామ్ రాయ్ అక్రమాయుధాలు కలిగివున్న కేసులో చిక్కుకుని, పోలీసు విచారణలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ నేరాన్ని వెళ్లకక్కివుండకపోతే వీళ్లంతా ఘరానావ్యక్తులగానే చలామణీ అయిపోయేవారు. తన పేర పెట్టిన అక్రమాస్తులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం చేతనే షీనా హత్యకు గురైందని, ఇంద్రాణి దాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నించిందనీ ఇప్పటికి నమ్మవచ్చు. వాస్తవాలు పోనుపోను తెలియవచ్చు. పలుకుబడి, ధనం మళ్లీ వుపయోగిస్తే తెలియకపోనూ వచ్చు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)

[email protected]